‘కమల’వనంలోకి జగన్గురువు ?

952

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో శారదా పీఠ ఉత్తరాధికారి వరస భేటీలు
రాంమాధవ్, జీవీఎల్‌తో స్వాత్మానందేంద్ర భేటీ
అమిత్‌షా పిలుపు కోసం ఎదురుచూపులు
ఏపీలో మతమార్పిళ్లపైనే చర్చ
ఫిబ్రవరిలో విశాఖ వేదికగా  హిందూ సమ్మేళనం?
మార్చిలో కీలక ప్రకటన?
‘సూర్య’కు ప్రత్యేకం

ఏపీలో రాజకీయ పరిణామాలు మారనున్నాయా? తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో.. హిందుత్వ కార్డు సంధించేందుకు భాజపా సిద్ధమవుతోందా? అందుకు పీఠాథిపతుల సహకారం, ఆశీస్సులు తీసుకునే పనిలో భాజపా నాయకత్వం ఉందా? ఏపీలో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్ల అంశమే, భవిష్యత్తులో బీజేపీ సంధించనున్న బ్రహ్మాస్త్రమా? పీఠాథిపతులు-మఠాథిపతులను ముందు వరసలో ఉంచి, వారితో హిందువులను ఏకం చేసేందుకు పావులు కదుపుతోందా? అందులో భాగంగానే.. శారదా పీఠ ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఢిల్లీ పర్యటన జరుగుతోందా?.. ఇటీవల శారదా పీఠం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు, హిందూ-బ్రాహ్మణ సంఘాల నుంచి వస్తున్న ఆ పీఠంపై వస్తున్న ఒత్తిళ్లు పరిశీలిస్తే.. అది నిజమేననిపిస్తోంది.

పీఠంలో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు లేకపోయినా, శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి… ఢిల్లీలో చేస్తున్న పర్యటన అనేక అనుమానాలు- ఆసక్తి రేపుతోంది. సహజంగా పీఠంలో ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలుంటేనే.. ఆయన వీవీఐపిలను స్వయంగా కలసి, ఆహ్వానపత్రికలు అందిస్తుంటారు. కొద్దికాలం కూడా ఇదే తరహాలో విజయవాడ వెళ్లి, జడ్జిలను కలసి ఆహ్వనపత్రికలు ఇవ్వడం చర్చనీయాంశమయింది. పీఠాథిపతి అయి ఉండీ, వ్యక్తుల ఇళ్లకు వెళ్లి కార్డులివ్వడం ఏమిటన్న విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు శారదా పీఠంలో, ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరగడం లేదని భక్తులు చెబుతున్నారు. మరి.. ‘చిన్నస్వామి’ హటాత్తుగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అక్కడ ఆయన కేవలం బీజేపీ అగ్రనేతలతోనే ఎందుకు భేటీ వేస్తున్నారు?.. ఇదీ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ.

అయితే… ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, అక్కడ గెలిచేందుకు తన ముందున్న అన్ని మార్గాలూ అన్వేషిస్తున్న బీజేపీ నాయకత్వమే.. స్వామిని ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యక్ష పోరాటాలతో, రాజకీయపరంగా పురోగతి సాధించలేని బీజేపీ.. ఇతర రాష్ట్రాల మాదిరిగానే మతపరంగానే పాగా వేయాలన్న వ్యూహంతో వెళ్లాలని,  నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం.. విజయవాడలో మతపరమైన అంశంపైనే చేసిన ధర్నా అందరినీ ఆకట్టుకుంది. మసీదు నిర్మిస్తామన్న మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలపై, సోము కన్నెర్ర చేశారు.

ఇటీవలే విజయవాడలో ట్రాఫిక్ పోలీసులు క్రిస్మస్ వేడుకులు చేసుకున్న అంశాన్ని,  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి దుయ్యబట్టారు. దానితో పోలీసు సంఘం స్పందించాల్సి వచ్చింది. నర్సరావుపేట రొంపిచర్లలో ప్రభుత్వ ఖర్చుతో చర్చి నిర్మాణంపైనా  విష్ణు విరుచుకుపడ్డారు. గత కొద్దిరోజుల నుంచి విష్ణువర్దన్‌రెడ్డి ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీన్నిబట్టి ఏపీలో,  బీజేపీ వ్యూహమేమిటన్నది  స్పష్టమవుతోంది.

కాగా.. కొద్దికాలం నుంచి శారదాపీఠం స్వాములపై,  హిందూ సంఘాలు-బ్రాహ్మణ సంఘాల నుంచి, మతమార్పిళ్ల అంశంపై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నట్లు భక్తుల నుంచి వస్తున్న సమాచారం. రాష్ట్రంలో మత మార్పిళ్లు జరుగుతున్నా,  శారదాపీఠం మౌనంగా ఉండటంపై హిందూ సంఘాలు-బ్రాహ్మణ సంఘాలు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయా సంఘ ప్రతినిధులు,  స్వామి దృష్టికి తీసుకువెళ్లాయట. దానితో ఏకీభవించిన ‘చిన్నస్వామి’.. ఫిబ్రవరి వరకూ మౌనంగా ఉండటమే శ్రేయస్కరమని, వాస్తవ పరిస్థితులు తమ దృష్టికి వస్తున్నా,  కొన్ని కారణాల వల్ల మౌనం వహించాల్సి వస్తోందన్నారట. మార్చిలో  తానే ఒక ప్రకటన విడుదల చేస్తానని భక్తులను శాంతింప చేశారట. హిందూ ధర్మ రక్షణ విషయంలో,  పీఠం ముందుండి హిందూ సమాజాన్ని నడిపిస్తుందని అభయమిచ్చారట. ఆ తర్వాత ఫిబ్రవరిలో విశాఖ కేంద్రంగా, రెండువేల మందితో హిందూ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించేందుకు.. చిన్నస్వామి ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు భక్తుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు  భక్తులు చెబుతున్నారు.

అయితే.. ఇది జరిగిన తర్వాతనే ఆయన ఢిల్లీ వెళ్లడం,చర్చ మొదలయింది. ఢిల్లీకి వెళ్లిన స్వామి.. తొలుత బీజేపీ అగ్ర నేత వారణాసి రాంమాధవ్, ఎంపీ గుంటుపల్లి వెంకట నరసింహారావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ ఇన్చార్జి, ఏక్‌తా మిషన్ అధ్యక్షుడిన మోంగాను కలిశారు. హోంమంత్రి అమిత్‌షా, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా చిన్నస్వామి కలవనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు నద్దాను కలవాలనుకున్నప్పటికీ,  కరోనా సోకడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు.

తిరుపతి ఉప ఎన్నికలోగానే పీఠాథిపతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, హిందూ శంఖారావం పూరించాలన్నది బీజేపీ నాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు శారదా పీఠమే సరైనదని భావించిన నాయకత్వం, ఆ పీఠం ఉత్తరాథికారిని పిలిపించినట్లు సమాచారం. స్వరూపానంద సరస్వతి చాలాకాలం నుంచి పీఠం నుంచి బయటకు రావడం లేదు. ఆయన ధర్మపరిరక్షణకు సంబంధించి ఓ గ్రంధం రాయించే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే చిన్నస్వామి ఒక్కరే పర్యటనకు వెళుతున్నారు. ఇప్పటికే కాకినాడకు చెందిన శ్రీపీఠాథిపతి పరిపూర్ణానంద స్వామి కమలతీర్ధం తీసుకుని, గత ఎన్నికల్లో పోటీ కూడా చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ఏపీలో కొంత ఇమేజ్-క్రేజ్ ఉన్న శారదాపీఠం ఉత్తరాధికారిని కూడా కమలవనంలోకి తీసుకురావడం ద్వారా, రాష్ట్రంలో హిందుత్వ వాతావరణం సృష్టించాలన్నదే  నాయకత్వ వ్యూహమని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అటు స్వాత్మానందేంద్ర సరస్వతి కూడా.. రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్లపై, ముఖ్యమయిన భక్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు, గత నెల రోజుల నుంచి ఆయన భక్తసమాజంలో ప్రచారం జరుగుతోంది. కొన్ని పరిస్థితుల కారణంగా  మౌనంగా ఉండాల్సివచ్చినా.. ఇకపై అది శాశ్వతం కాదని, మార్చిలో మత మార్పిళ్లు-హిందూధర్మ పరిరక్షణపై ఒక కీలక ప్రకటన చేస్తానని, భక్తుల వద్ద స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అదీగాక..తమ మౌనాన్ని సహచర పీఠాధిపతులు-మఠాథిపతులు ఆక్షేపిస్తున్న కారణంగా, శారదా పీఠం ఔన్నత్యం దెబ్బతినే ప్రమాదం ఏర్పడినట్లు,  చిన్నస్వామి భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయంటున్నారు.

లోకకల్యాణం-పీఠవిస్తరణ కోసం తాము చేపట్టిన కార్యక్రమాలపై,  వేరే సంకేతాలు వెళ్లడంపైనా,  స్వామి ఆవేదన వ్యక్తం చేశారట. ఇదిలాఉండగా.. జగన్ సర్కారు, శారదాపీఠాధిపతులకు మునుపటి గౌరవం ఇవ్వడం లేదని, అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవద్దని పాలకులు, సున్నితంగానే స్వామికి సూచించారన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే చిన్నస్వామి ఢిల్లీ పర్యటనకు సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా.. బీజేపీ అగ్రనేతలతో చిన్నస్వామి భేటీ అయిన సందర్భంగా, రాష్ట్రంలో జరుగుతున్న మతమార్పిళ్ల అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో శరవేగంగా జరుగుతున్న మతమార్పిళ్లను అడ్డుకునేందుకు, కార్యాచరణ రూపొందించే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక- ఇతర మతాల సంతుష్ఠీకరణ విధానాలపైనా, హిందూ సమాజాన్ని చైతన్యం పరిచే బాధ్యత తీసుకోవాలని బీజేపీ నాయకులు, చిన్నస్వామిని కోరారట. మొత్తానికి జగన్గురువు కమలదళంతో చేతులు కలపనున్నారన్నమాట!