బెజవాడ కాదది…జనవాడ!

405

విజయవాడలో జగన్- అమరావతిలో బాబు
అటు బీసీ సంక్రాంతి.. ఇటు జనరణభేరి
రాదార్లలో ఖాకీలు, పార్టీల కార్యకర్తలు

ఏపీ రాజధాని నగరమయిన విజయవాడ.. గురువారం  రెండు ప్రధాన కార్యక్రమాలతో జనవాడగా మారింది. విజయవాడకు వెళ్లే రోడ్లన్నీ పోలీసులు- వివిధ పార్టీ కార్యకర్తలతో క్రిక్కిరిసిపోయాయి. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు-పాలకమండలి సభ్యుల,  ‘బీసీ సంక్రాంతి’  ప్రమాణ స్వీకారానికి వేదికయిన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం, పరిసర ప్రాంతాలన్నీ సీఎం ‘జగన్నామ’స్మరణతో హోరెత్తిపోయాయి. అటు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ, రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడాది అయిన సందర్భంగా జరిగిన ‘జనరణభేరి’ కార్యక్రమానికి, వేలాదిమంది రైతులు హాజరయ్యారు. దీనికి వైసీపీ మినహా అన్ని రాజకీయపార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. ఈ వేదిక సర్కారు వ్యతిరేక నినాదాలతో వేడెక్కింది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉద్దండరాయునిపాలెంలో,  ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోట భూమిని  ముద్దాడారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తరలివచ్చిన కార్యకర్తలు-రైతులు, వారికి పహారా కాసేందుకు వివిధ ప్రాంతాల నుంచి  బందోబస్తుకు వచ్చిన పోలీసులతో..  విజయవాడ పరిసర ప్రాంతాలు జనవాడగా మారాయి.

ఉదయం  విజయవాడలో… తొలిసారి అన్ని బీసీ కులాలకు  56  కార్పొరేషన్లు ఏర్పాటుచేసి,  చరిత్ర సృష్టించిన సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయిన ‘బీసీ సంక్రాంతి’కి , వేలాదిమంది వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. ఆ వేదిక పై సీఎం జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో సొంత లాభం కోసం,  ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారని విరుచుకుపడ్డారు. రైతుల దగ్గర తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి, తన బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. భూముల ధర పడిపోతుందన్న ఆందోళనతోనే ఉద్యమం చేయిస్తున్నారని విమర్శించారు. 18 నెలల్లోనే బీసీలకు 38,519 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2 కోట్ల 83 లక్షల 57 వేల మంది బీసీలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.  బీసీ కార్పొరేషన్ చైర్మన్లు జడ్పీ సమావేశాలకు హాజరు కావచ్చని ప్రకటించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన బీసీ సంక్రాంతి సభ, వైసీపీ బీసీ నేతల బలప్రదర్శనకు వేదిగా మారింది.

ఇక అమరావతి రాయపూడిలో,  రైతులు నిర్వహించిన సభలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు.. సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, మంత్రులు రాష్ట్రాన్ని రిటైల్‌గా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.  జగన్ పప్పులు తన దగ్గర ఉడకవని, తాను బాంబులకే భయపడలేదని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పిందల్లా విని,  తప్పు చేసి శిక్ష అనుభవించవద్దని పోలీసులను హెచ్చరించారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న వైసీపీపై విరుచుకుపడ్డారు. పేటీఎం బ్యాచ్‌ను తీసుకువచ్చి, రైతు వ్యతిరేక ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. మోదీ చెబుతున్నట్లు త్వరలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, అప్పుడు ప్రజలు ఈ పిచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అంతకుముందు సభ వద్దకు వెళుతున్న బాబును పోలీసులు అడ్డుకోగా, ఆయన నడిచి వేదిక వరకూ వెళ్లారు. బీజేపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జనసేన నేత పోతిన మహేష్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అమరావతి పరిరక్షణ కమిటీ నేత వెలగపూడి రామకృష్ణ ప్రసాద్, పీసీసీ నేత సుంకరపద్మశ్రీ తదితరులు హాజరయ్యారు. కాగా సభకు వచ్చిన వేలాది మందికి,  రైతులు భోజన సౌకర్యం ఏర్పాటుచేశారు