‘దేశం’లో కోవర్టులు?

408

బాబు వీడియో కాన్ఫరెన్స్ లీక్
పోలీసులపై ఎదురుకేసులు పెట్టాలన్న బాబు
వెంటనే ఖండించిన హోంమంత్రి
టీడీపీలో లీకువీరులెవరు?
మంచే జరిగిందంటున్న తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

తెలుగుదేశం పార్టీలో వైసీపీ కోవర్టులున్నారా? ఆ కోవర్టులే పార్టీ అధినేత వీడియో కాన్ఫరెన్సులు లీక్ చేస్తున్నారా? బుధవారం లీకయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్సు వీడియో క్లిప్పింగు వ్యవహారం చూస్తే,  ఈ అనుమానమే రాక తప్పదు. అయితే దీనిపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలో తమ నాయకులు, కార్యకర్తలను కేసుల పేరుతో హడలెత్తిస్తున్న పోలీసుల దూకుడుకు బ్రేకులు వేసేందుకు,  స్వయంగా అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిథిలోని రాజానగరం నియోజకవర్గ కార్యకర్తలతో, బాబు బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు.  ఆ సంద ర్భంగా పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులపై, ఎదురు కేసులు పెట్టి కోర్టులకు తిప్పాలని ఆయన పిలుపునిచ్చారు. వారు ఒక కేసు పెడితే మీరు రెండు పెట్టాలని, కేసులు తీసుకోకుంటే రిజిస్టర్‌పోస్ట్ ద్వారా కేసులు పెట్టాలని సూచించారు. డీజీపీ చెబుతున్న టెక్నాలజీనే మీరూ వాడాలన్నారు.  తప్పుడు కేసులు పెట్టే పోలీసులను, అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందామని తమ్ముళ్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.

అయితే.. కేవలం పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితమయిన ఆ వీడియో కాన్ఫరెన్సు విశేషాలు, సోషల్ మీడియాలో లీకవడం తమ్ముళ్లను ఖంగుతినిపించింది. సహజంగా పార్టీ నేతలు ఇచ్చే ఫోన్ నెంబర్లకే ఆపరేటర్లు కనెక్షను ఇస్తుంటారు. అలాంటిది బయట వారికి సైతం కనెక్షన్ వెళ్లిందంటే, సొంత పార్టీలోనే వైసీపీ కోవర్టులున్నారన్న విషయం స్పష్టమమయిందని.. టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వీడియో, టెలీ కాన్ఫరెన్సు ఏర్పాటుచేసే టెలిఫోన్ ఆపరేటర్లు.. తమకు పార్టీ నాయకత్వం ఇచ్చిన ఫోన్ నెంబర్లకే కనెక్షన్లు ఇస్తుంటారు. అయితే.. తాము ఇచ్చిన జాబితాలో ఎవరు పార్టీలో ఉన్నారు? ఎవరు వెళ్లిపోయారని తనిఖీ చేసుకోవలసిన బాధ్యత ఆయా నాయకులదే.

టీడీపీ చాలాకాలం నుంచి కొనసాగిస్తున్న ఈ వ్యవస్థ లోపాలను,  దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మీడియాకు స్వయంగా చూపించారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యంలో చేరిన ఆమె,  ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. అంతలో  టీడీపీ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. సార్ టెలీకాన్ఫరెన్స్ ఉందని చెప్పగా, తాను పీఆర్పీలో ఉన్నానని చెప్పి ఆమె ఫోన్ కట్ చేశారు. ‘సార్ టెక్నాలజీ గురించి బాగా మాట్లాడతారు. మీరే చూడండి. ఆయన టెక్నాలజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో? నాకు ఇంకా రోజు పార్టీ ఆఫీసు నుంచి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయ’ని ఆమె, తన ఫోన్‌లోని మెసేజ్‌లను మాకు చూపించారు. దీన్నిబట్టి.. ఇప్పటికీ టీడీపీ టెక్నాలజీ వ్యవస్థలో మార్పు రాలేదని స్పష్టమయింది.

పోలీసులపై ఎదురు కేసులు పెట్టాలన్న చంద్రబాబు వీడియో పిలుపు,  లీకవడం చర్చనీయాంశమయింది. వెంటనే హోంమంత్రి సుచరిత రంగంలోకి దిగి, బాబు వ్యాఖ్యలు ఖండించారు. ఆయనకు పోలీసు వ్యవస్థపై ఎంత గౌరవం ఉందో స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అయితే.. అసలు పార్టీ అధినేత మాట్లాడిన వీడియో ఎలా లీకయిందని అగ్రనేతలు కంగారు పడుతుంటే, జరిగింది తమ మంచికేనని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

పోలీసుల దూకుడుకు బ్రేకులు వేసేందుకు,  బాబు ఇచ్చిన సూచనలు ఎలాగూ లీకయినందున, ఇకనయినా పోలీసులు తమ విషయంలో జాగ్రత్త పడతారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఇలాంటి పని చంద్రబాబు ఎప్పుడో చేస్తే, తమకు కేసుల చుట్టూ తిరిగే పని ఉండేది కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.