రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్రానివే

522

భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు

రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కేంద్రం ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు స్పష్టం చేశారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న పథకాలన్నీ మోదీ ఇచ్చే నిధులతోనే జరుగుతున్నాయన్నారు. కేంద్రం రాష్ట్రానికి 23 లక్షల ఇళ్లు కేటాయించి, ఒక్కో ఇంటికి రూ.1.50 సబ్సిడీతో పాటు ఇళ్లకు రోడ్లు, తాగునీరు, విద్యుచ్ఛక్తి కనెక్షన్లు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా కలుగచేస్తుందని,ఇలాంటప్పుడు రాష్ట్రంలో ఇళ్లు నిర్మించేది కేంద్రప్రభుత్వమా లేక జగనా ఎవరని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు……

తెదేపా, వైకాపాలు కుటుంబ వారసత్వ పార్టీలు. ఆ కుటుంబ సభ్యులే నాయకులు. మంత్రులు. వారికి తమ వ్యక్తిగత అభివృద్ధి తప్ప ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు. భాజపా క్ష్యం రాష్ట్ర అభివృద్ధి. వాజ్‌పేయి దేశంలో రహదారులు నిర్మించారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలైన్ వేస్తున్నాం. హైదరాబాదుకు మరో రహదారిని నిర్మిస్తున్నాం. దేశంలోని ప్రజలందకీ ఇళ్లుండాలనేది మోదీ లక్ష్యం. రాష్ట్రానికి 23 లక్షల ఇళ్లు కేటాయించారు. అందుకు రూ.25 వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. నరేగా నుంచి మరో రూ.60 వేల కోట్లు ఇస్తున్నారు. ఒక్కోఇంటికి రూ.1.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ కేవలం 15 లక్షల ఇళ్లు మాత్రమే కడతామంటున్నారు. 8 క్షల ఇళ్లు వదిలేశారు. 30 లక్షల పట్టాలిస్తామని విచ్చలవిడి ధరలకు స్థలాలు కొన్నారు. వారు భూసేకరణకు పెట్టిన రూ.7 వేల కోట్లలో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగింది. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మరో రూ.3 వేల కోట్లు ఇస్తుంది. విద్యుత్ కనెక్షన్లు, నీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, రహదారులు నిర్మిస్తుది. మొత్తం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని అవసరాలను మోదీనే ఇస్తున్నారు. అసలు ఇళ్లు కట్టేది జగనా, మోదీనా ప్రజలు తెలుసుకోవాలి. ఒక్కో గ్రామానికి మనిషికి స్వచ్బభారత్ కింద రూ.330 ఖర్చుచేస్తున్నారు. పదిహేనో ఆర్దికసంఘం మరో రూ.500 నేరుగా ఇస్తుంది. మొత్తం అన్నీ కలిపి ఏడాదికి రూ.1100 ఇస్తున్నారు.

మీ గ్రామాల్లో జగన్ నిర్మించే నాడు నేడు, తోడునీడా, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, వ్యవసాయ భవనాలు అన్నీ నరేగా పధకం ద్వారా కేంద్రం పంపినవే. ఇందులో ఒక్కో భవనానికి కేంద్రం రూ.1.50 కోట్లు ఇచ్చిందన్న విషయం మీకు తెలీదు. రాష్ట్ర అభివృద్దిలో చేసే ఖర్చులో సింహభాగం కేంద్రానిదే. పశుగణాభివృద్ధి, ఆరోగ్యం, ఒక్కోటి రూ.50 కోట్లతో బోధనాసుపత్రులు నిర్మాణం మోదీ ఇచ్చినవే. మీకు మాచర్లలో నిర్మించే బోధనాసుపత్రి కేంద్రం మోదీ నిర్మించేదే.

జగన్‌ది ఏదన్నా ఉందంటే అది భూంభూం బీరు, పేరు తెలియని మద్యం. వీటి ద్వారా వేల కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ పార్టీలు వ్యాపారం కోసం నడుపుతున్నారు. చంద్రబాబుకు రాజధాని కట్టమని రూ.7,200 కోట్లు ఇస్తే వాటితో 4 తాత్కాలిక భవనాలు కట్టి మిగతా సొమ్ము జేబులో వేసుకున్నాడు. రూ.1,800 కోట్లతో కేంద్రం నిర్మించే ఎ యివ్‌‌సు ఎంత అద్బుతంగా ఉందో చూడండి. అవినీతి చేయకుండా రూ.7,200 కోట్లతో చంద్రబాబు రాజధాని కడితే జగన్ దానిని తరలించగలిగేవాడా? రాజధాని తరలించారని రాష్ట్రంలో కేంద్రం చేస్తున్న అభివృద్ది పనులు ఆపారా? రాష్ట్రంలో ఎంతసేపు పోలవరం ఎత్తు, రాజధానుల సంఖ్యపైనే తప్ప గుంటూరు జిల్లా, రాయలసీమ అభివృద్ధిపై చర్చ జరగడం లేదు.

కాంగ్రెస్ కుటుంబపాలన అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. కాని భాజపా కుటుంబమే లేని బ్రహ్మచారిని ప్రధానిగా చేస్తే ఆయన దేశానికి రహదారులను వేశారు. సెల్‌ఫోన్లు ఇచ్చారు. ప్రైవేటు బ్యాంకులు తెచ్చారు. ఎస్టీలకు మొదటిసారిగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సఫాయీ కర్మచారీ కమిషన్ ఏర్పాటుచేసి 50 శాతంతో వాహనాలు సబ్సిడీపై లబ్దిదారులకు అందించారు. ఆయన ఆడుగుజాడల్లోనే మోదీ నడుస్తూ, దేశాన్ని అవినీతిపరహింగా, అభివృద్ధి పథంలో పయనింపచేస్తున్నారు.

ఈ అభివృద్ధి కొనసాగాలంటే భాజపాను గెలిపించాలి. కుటుంబ రాజకీయాలను రాష్ట్రం నుంచి సమూలంగా పారదోలాలి. మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో భాజపా జనసేన ప్రభుత్వాన్ని నిర్మించాలి. భాజపా కులాతీత వ్యవస్థను నిర్మిస్తుంది. మాదిగ దండోరాకు మొదటి నుంచి మద్దతిచ్చేది భాజపా మాత్రమే. దానికి న్యాయం చేస్తాం. ఈ సందర్బంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పక్కాల సూరిబాబు,తన కుమారుడు 500 అనుచరులతో సహా పార్టీలో చేరగా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సొము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ పూర్వ అధ్యక్షులు కన్నా క్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్‌బాబు, పాటిబండ్ల రామకృష్ణ, నల్లబోతు వెంకట్రావు పాల్గొన్నారు.