ఆర్థిక,మానసిక స్థితిగతులు ఆందోళనకరంగా మారటానికి కారణాలు. 

0
221

గడచిన పది సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో అనేకమంది మధ్యతరగతి కి చెందినవారి ఆర్థిక,మానసిక స్థితిగతులు ఆందోళనకరంగా మారటానికి 10 ముఖ్య కారణాలు.
1. కుటుంబంలోని ప్రతి సభ్యుడు ప్రతి సంవత్సరం తనకు అత్యంత అధునాతనమైన స్మార్ట్ఫోన్ కావాలనే ఒక రంది లో పడిపోవటం. అవసరం ఆదాయం కంటే  అట్టహాసం ఆర్భాటం కోసం వెంపర్లాడటం.
2. అందరితో చెప్పుకోవడం కోసం అవసరం ఉన్నా లేకున్నా ఖర్చుతో కూడిన దూరప్రయాణాలు చేపట్టటం, తాహతుకు మించి ఖర్చు చేయటం.
3. నడిచి వెళ్ళ గ లిగినా, సైకిల్ వేసుకుని వెళ్ళ గ  లిగినా, స్కూటర్ తో పని జరుపుకో గలిగినా, అంతస్తులు కృత్రిమంగా పెంచుకునే భాగంగా కారు కొనుక్కోవటం ఆ అప్పులు తీర్చటంలో అసహనం పాలు కావడం.
4. ఆరోగ్యకరమైన ఇంటి వంట భోజనం మరచి మనము కూడా బయటకు వెళ్ళి తినకపోతే అనాగరికులు అని అనుకుంటారేమో సామాజిక ఒత్తిడి కోసం వారానికి ఒకసారి బయటకు వెళ్లి అవసరాన్ని మించి ఖర్చు చేసి భోజనం చేయటం. వంట ఇంటి ని దేవాలయంగా.. ఆహారాన్ని ప్రసాదంగా.. వడ్డించే వారిని మాతృ సమానులుగా… భావించే సంస్కృతి నుంచి జరిగిపోవటం, భౌతిక ఆహారంతో పెనవేసుకున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక మనోల్లాస పార్శ్వాలను పక్కన పెట్టడం.
5. సౌందర్య చిట్కాలు ఇంట్లో ఎన్ని పాటించగలిగినా, ఫలానా బ్యూటీపార్లర్కు, సెలూన్ కు వెళితేనే, అందం ఇనుమడిస్తుంది అని, అలాగే సరసమైన ధరలకు లభించే చక్కని ఆరోగ్యకరమైన చేనేత వస్త్రాలు ధరించ కలిగినా, బ్రాండెడ్ దుస్తులు ధరిస్తే విలువ పెరుగుతుందనే ఒక అజ్ఞానపు ఆవేశంలో బ్రాండెడ్ దుస్తులు వస్తువులపై అనవసరంగా ఖర్చు చేయటం.
6. పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు ఆత్మానందం కలిగించే అతిశయం  తగ్గించే ఖర్చులేని ఆత్మ సంతృప్తినిచ్చే ఆత్మీయ పనులు చేపట్టకుండా గుడ్డిగా అనుకరణకు పోయి అనవసరపు ఖర్చులు చేసి అప్పులపాలు కావటం.
7. అనుబంధాలను ఇనుమడింప చేస్తూ అనురాగాలను ఆవిష్కరింప చేసే ఆహ్లాద పూరిత వాతావరణంలో చేయవలసిన వివాహ సంబంధిత కార్యక్రమాలు అయిన పసుపు కుంకాలు,  ప్రదానాలు, వివాహ ఉత్సవం …. ఎవరినో అనుకరిస్తూ అద్దె ప్రదేశాలలో, అద్దె వస్తువులతో, ఆత్మీయ పలకరింపులు లేకుండా, కృత్రిమ వస్త్రధారణ ల తో కేవలం ఫోటోలు వీడియోలు కోసమే జరిగే తంతుగా, ఎంత ఖర్చు పెడితే దంపతులు అంత సుఖపడతారు అనే శూన్య భావంతో ఆర్ధిక హద్దులు పరిమితులు మరిచి ఖర్చు చేయటం అప్పుల పాలు కావటం.
8. చక్కని శిక్షణ పొందిన అధ్యాపకులు , మంచి తరగతి గదులు ఉన్న పాఠశాలలను కళాశాలలను వదిలిపెట్టి పిల్లలను పలానా స్కూల్లో కాలేజీలో చదివిస్తున్నారు అంటే సామాజిక హోదా పెరుగుతుందనే అనాలోచిత ఆలోచనలకు బందీలై అవాంచిత ఖర్చులు పెంచుకుని ఆర్థిక వ్యాధులను కొని తెచ్చుకోవడం.
9. శరీర అవసరాలకు ఉపయోగపడే ఆహారం కాకుండా మార్కెట్లో లభ్యమవుతోంది, ఫలానా ఆహారం తింటే ఆధునికతకు చిహ్నం, అటువంటివి తినకపోతే వెనుకబడినవారు అనుకుంటారేమో, అనే అపోహ మధ్య అనవసరపు ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని చేజేతులా అటకెక్కిoచేయడంవల్ల, కృత్రిమ జీవన ప్రయాణం లో పెరిగిన వైద్య ఖర్చుల భారం.
10.  అప్పు చేయటం అనర్థమనే అనాది ఆలోచనను ఆదిమానవుడి ఖాతాలో వేసి, అవసరం లేని అప్పులు చేస్తూ వడ్డీలను కడుతూ భవిష్యత్తును తాకట్టు పెడుతూ వర్తమానంలో సంతోషంగా జీవించ లేకపోవటం.