‘రత్నాల’ సంగతి సరే…!రోత పుట్టిస్తున్న ‘రోడ్ల’ సంగతి కూడా చూడు ‘జగనన్నా’…!

258

ఈ మధ్య కాలంలో  ప్రతి వారం, హైదరాబాద్ నగరంలోని అన్ని భాషా జాతీయ న్యూస్ పేపర్లలోనూ, మొదటి పేజీలో ఫుల్ పేజీలు మొత్తం ఆంధ్రా లో ‘జగనన్న’ నేతృత్వంలో జరుగుతున్న అనన్య సామాన్యమైన ప్రగతి గురించి శర-పరంపరగా సాగుతున్న ప్రకటనలతోనే నిండిపోతున్నాయి.
ఇదేదో నిజం కామోసు…! అని ఆంధ్రా ప్రగతి ని కళ్లారా చూద్దామని కార్లో ఆంధ్రా పర్యటన కు బయలు దేరి వెళ్లారో… ఇక అంతే సంగతులు… ఆంధ్రా రోడ్లన్నీ  గోతులతో, గుంతలతో, రాళ్లు-రప్పలతో గరుకెత్తిపోయి, అష్టవంకర్లతో గబ్బుపట్టి అష్టదరిద్రం గా ఉన్నాయి. ఈ రెండు రోజులుగా నాకు రోత పట్టిస్తున్న, రంధి పుట్టిస్తున్న, రోగాల పాల్జేస్తున్న ఈ ఆంధ్రా రోడ్ల పై వెన్ను ‘కదిలే’ దురదృష్టం పట్టింది…!
ఆంధ్రా ప్రజల వెన్నెముకలు చాలా బలంగా, సుదృఢంగా, అసామాన్య ప్రఖ్యాత “ధధీచి” (ఇంద్రుని వజ్రాయుధం) స్థాయిలో ఉండటం వలన కామోసు వాళ్ళు ఇలాంటి అష్టావక్ర – దరిద్ర రోడ్లపై కూడా వాళ్ళు చాలా ధైర్యం గా, ఎంతో సాహసంతో, స్థిరం గా ప్రయాణాలు చేస్తున్నారు.
కానీ,  మనలాంటి వేరే రాష్ట్రాల్లో నివసిస్తున్న వాళ్ళు, సామాన్య ‘వెన్ను’న్న వాళ్ళు ఒక్క రెండు రోజులు ఈ రోడ్లపై ప్రయాణం చేస్తే మీకు విషయం అర్ధమౌతుంది!… మీకు గానీ, ఏ కొంచం వెన్నెముక సమస్య ఉన్నా ఇక మీ వెన్ను పై పూర్తిగా ఆశ వదులుకోవాల్సిందే… గర్భవతులు పొరబాటున కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకుండా ఆంధ్రా రోడ్ల పై ప్రయాణం చేస్తే డెలివరీ ఎప్పుడవుతుందో కూడా డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితి.
ఏమాత్రం ఏమరుపాటు తో ఉన్నా ప్రాణాలు కూడా “హరీ” మంటాయి… సమీప భవిష్యత్తులో ఆంధ్రా ప్రాంతం లో ఆర్థోపెడిక్ , స్పైన్-వెన్నుముక, న్యూరో సర్జరీ, ట్రామా, ఆక్సిడెంట్స్,  ఎమర్జెన్సీ, హాస్పిటల్స్… వైద్య నిపుణులకు, ఆసుపత్రిలకు ఉన్న గిరాకీ మరెవరికీ ఉండబోదు.
బైక్స్, స్కూటర్లు, కార్స్, వేన్స్, లారీస్…ఇతర ఆటోమొబైల్స్  రిపేర్ సెంటర్లు, షాక్ అబ్సర్వర్స్, టైర్స్, బ్రేక్స్… వంటి ఆటోమొబైల్ విడిభాగాలూ, ఉపకరణాలు… వంటి వాటికి కూడా ఎంతో గిరాకీ పెరగబోతోంది…
కనీసం రోడ్లు రిపేర్ అన్నా చేయాలన్న స్పృహ లేని అధికారులు, చేయించాల్సిన బాధ్యత లేని ప్రజా ప్రతినిధులు, మంత్రులు… ఇంత చెత్త రోడ్లు మరెక్కడా ఉండవు…
ఆమ్మో…!!!… అయ్యా…!!!… వామ్మో…!!!… అబ్బా…!!!… అయ్యో…!!!అనిపిస్తూ అమ్మ  , నాన్న, అన్న ఇత్యాది మనవసంబంధాలు+ బంధాలన్నీ కలిపి ఒకేసారి గుర్తుచేసే ఆంధ్రా రోడ్లు… ఇన్సూరెన్సు ఏజెంట్లకు, హాస్పిటల్స్ కు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కు సరికొత్త గిరాకీ, జవ-జీవితాలు ఇస్తున్న ఆంధ్రా దిక్కుమాలిన రోడ్లు…
అన్నా జగనన్నా… నువ్వు ఆంధ్రా ను ‘ఎక్కడికో’ తీసికెళ్తున్నట్టు అన్ని న్యూస్ పేపర్స్ లోనూ, నువ్వు ఎంతో ఖర్చు పెట్టి వేయించే మొదటి పేజీ -ఫుల్ పేజీ  ప్రకటనలు చూసి తెలుసుకొంటున్నాం అన్నా… దయచేసి, అంత కాకపోయినా, కొంతైనా ఖర్చు పెడితే మన “ఆంధ్రా” రోడ్లు కూడా కొంచెం బాగు అయుతాయి కదా అన్నా…కొంచెం ఆంధ్ర ప్రజల ఎముకలు – వెన్నెముకలు – ఆడపడచుల పసుపు కుంకుమలు – కడుపుల గురించి కూడా కొంచెం ఆలోచన చెయ్యన్నా… “అసెంబ్లీ” కూడా అందరం చూస్తున్నాం… నువ్వు ఇప్పటికే ఆంధ్రా ను “నవ” రసమైన ‘రత్నాలతో’ నింపుతున్నావన్నా… శానా సంతోషం… కొంచం రహదారుల సంగతి కూడా వాటితోపాటే చూస్తే ఆంధ్రా ప్రజలకు కొంచెమైనా మేలు చేసిన వాడివైతావు అన్నయ్యా…కావాలంటే, ఆంధ్రా లో అన్ని రోడ్లు మంచిగా వేయించి ‘రాజశేఖర రహదారి’ అనో, ‘జగనన్న రోడ్డు’ అనో, ఏ ‘రెడ్డి రోడ్’ అనో ఎప్పట్లాగో పెట్టుకో అన్నా… నో ప్రాబ్లెమ్… కానీ కొంచం రోడ్ల సంగతి కూడా రత్నాల్లో పదో రత్నం గా చేయించన్నా… ఆంధ్రా ప్రజల ప్రాణాలు కూడా అమూల్య రత్నాలేనన్నా… కొంచం రోడ్ల పై కూడా దయ చూపియ్యన్నా…

                                                                                    – పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ,
                                                                                                                శృంగవృక్షం,
                                                                                                                Near భీమవరం,
                                                                                                           పాలకోడేరు మండలం,
                                                                                                          పశ్చిమ గోదావరి జిల్లా,
                                                                                                                         ఆంధ్ర ప్రదేశ్.