నీవు నేర్పిన విద్యయే ‘నారా’ జాక్ష!

399

‘కేబుల్ కట్’పై నాడు నారా- నేడు జగన్
తాజాగా టీవీ-5, ఏబీఎన్ చానెళ్ల కోత
కేబుల్ టీవీ ఆపరేటర్లకు సర్కారు హుకుం

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని పెద్దలు ఊరకనే చెప్పలేదు. అప్పుడు సాక్షి గొంతుకు  నారా వారు కతె్తర వేస్తే..ఇప్పుడు జగనన్న సర్కారు.. టీవీ-5, ఏబీఎన్- ఆంధ్రజ్యోతి గొంతును.. కేబుల్ వైర్లతో నొక్కేస్తున్నారు. అప్పుడు నారా వారు నేర్పిన విద్యనే ఇప్పుడు జగనన్న విజయవంతంగా అమలు చేస్తున్నారంతే. చానెళ్ల పేర్లు- అధికారంలో ఉన్న పార్టీల పేర్లలోనే తేడాలు తప్ప.. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా, టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా గర్జించిన వైసీపీ అధికార మీడియా సాక్షి చానెల్ గొంతును, కేబుల్ టీవీ ఆపరేటర్ల ద్వారా నొక్కేసింది. ఇప్పుడు… జగనన్న జమానాలో,  టీడీపీ అనుకూల మీడియాగా ఆరోపణలెదుర్కొంటున్న టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెళ్ల గొంతును.. అదే కేబుల్ టీవీ వైర్లతో నొక్కేసింది. అప్పుడు సాక్షి గొంతు నొక్కితే మౌనంగా ఉన్న జర్నలిస్టు సంఘాలు, ఇప్పుడు కూడా అదే పాత్ర పోషిస్తున్నాయి.విద్యుత్ స్తంభాల ఆధారంగా కేబుల్ వైర్లు వేసి ఇంటింటికీ చౌకగా టీవీ చానెళ్ల ప్రసారాలను అందిస్తున్న కేబుల్ టీవీ ఫ్రాంచైజీలకు (ఆపరేటర్లకు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

కేబుల్ టీవీ ద్వారా చానెళ్లు అందించేటప్పుడు టీవీ-5, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానెళ్ల ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం అనధికారికంగా ఆదేశాలు జారీచేసింది.ఈ ఆదేశాలను కాదని ఎవరైనా ఎక్కడైనా ఆ రెండు చానెళ్లను ప్రసారం చేసినట్లు తెలిస్తే విద్యుత్ స్తంభాల మీదుగా ఉన్న టీవీ కేబుళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో కేబుల్ ఆపరేటర్లు చేసేదేమీలేక ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారు. ఆ చానెళ్లు ఎందుకు రావడం లేదని వినియోగదారులు తమ కేబుల్ ఆపరేటర్లను అడిగితే ఈ విషయం తెలిసింది. వినియోగదారులు అడిగారని ఆ చానెళ్లను ప్రసారం చేస్తే మొదటికే మోసం వస్తుందని, తమ పేరు చెప్పొద్దని కేబుల్ ఆపరేటర్లు వాపోయారు. వీ-6 కూడా చాలా కాలంగా రావడం లేదు.అయితే డిష్ కనెక్షన్ల విషయంలో ప్రభుత్వ పెద్దల నిర్ణయం అమలు చేసే అవకాశం లేదు. అందువల్ల టాటా స్కై, ఎయిర్ టెల్, సన్ నెట్వర్క్, జియో తదితర సంస్థల ప్రసారాల్లో ఆ రెండు చానెళ్లు వస్తున్నాయి.

గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా టీవీ-9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విషయంలో ఇలాంటి చర్యలే తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత టీవీ-9 క్షమాపణలు చెప్పడంతో ఆ చానెల్ ప్రసారాలు పునరుద్ధరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సుప్రీంకోర్టు లో పిటిషన్ వేస్తే తీర్పు చానెల్ కు అనుకూలంగా వచ్చింది. అయినా ప్రభుత్వం తన చేతుల్లో లేదంటూ తప్పించుకుంది.
కేబుల్ ప్రసారాల్లో ఆ రెండు చానెళ్లు ఆగిపోవడం వల్ల వాటికి ప్రకటనలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆదాయం లేక సతమతమవుతోంది. జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోవడం లేదా జీతాల్లో కోత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాల‌ వైఖరి భావ‌ స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు. పత్రికా స్వాతంత్య్రానికి ప్రమాదకరం.