నిమ్మగడ్డ రమేష్‌ది మోసమే..!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాష్ట్రంలో నివసించడం లేదని,  కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్‌ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ క్యాంపెయిన్‌), గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ద్వారా తీసుకున్న వేదిక ప్రతినిధులు.. ఆ వివరాల కాపీలను ఫిర్యాదుకు జత చేశారు.
ఉన్నత స్థాయి వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి
గవర్నర్‌కు ఫిర్యాదు అనంతరం వేదిక ప్రతినిధులు జంపాన శ్రీనివాసగౌడ్, కేఎండీ నస్రీన్‌ బేగంలు ఆ వివరాలను సోమవారం ఒక ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. ప్రకటనలో ఏముందంటే..
► రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థాయి పదవులలో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి.
► తాము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్‌ అసలు రాష్ట్రంలోనే నివాసం ఉండడం లేదు.  రాజధాని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలివచ్చినప్పటి నుంచి, ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు.
► రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం కూడా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్‌ మాత్రం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఇప్పటివరకు మారలేదు.
హైదరాబాద్‌లో ఉండడం సమంజసమా?
► స్థానిక ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించాల్సిన కమిషనర్‌ రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో నివాసం ఉండడం ఎంతవరకు సమంజసం?
ఆయన ఎందుకు హైదరాబాద్‌ వీడేందుకు ఇష్టపడడం లేదు?
► హైదరాబాద్‌లో ఉంటున్నా.. ప్రతి నెలా ఇక్కడ ఇంటి అద్దె అలవెన్స్‌ను తీసుకుంటున్నందున, ఇప్పటివరకు ఆయనకు చెల్లించిన ఆ అలవెన్స్‌ మొత్తాన్ని రికవరీ చేయాలి. ప్రభుత్వాన్ని మోసగించి ఇంటి అద్దె పొందుతున్న నిమ్మగడ్డపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami