మార్గశిర మాస విశిష్టత

879

మాసానాం మార్గశీర్షోహం – అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ.

కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పాటు స్వయం భగవానుముఖతః ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం.
ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ, కొన్ని అగ్రగణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపమనీ చెప్పాడు. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం వంటిది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది.

లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతీరోజూ శుభప్రదమైనదే. తొలిరోజు కార్తీకమాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదలుటతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాల పుణ్యప్రదం. కుదరనివారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం.
ప్రతీరోజూ శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం.
మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది.అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో, మరి కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు.మార్గశిర శుద్ధషష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునే వారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలూ, ఉత్సవాలూ, నాగప్రతిష్టలూ జరుగుతాయి.

మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవావతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంది కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కచూస్తుంటాడు. శునకం కాలభైరవస్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి, గారెలు వండి, దండగా గ్రుచ్చి, శునకం మెడలో వేస్తుంటారు.
మార్గశిర శుద్ధేకాదశి *శ్రీమద్భగవద్గీత లోకానికి అందినరోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా *మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా, సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతీ ఒక్కరికీ కర్మయోగం, భక్తియోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్టానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచెప్పాడు. భగవద్గీత నిత్యపారాయణ, నిత్య ఆచరణా గ్రంథమైనప్పటికీ, విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్టానం చేయాలి.మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో తోలి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు.

మార్గశిర శుద్ధపూర్ణ శ్రీ దత్తజయంతి. దీనినే కోరలపూర్నిమ, నరక పూర్ణిమ అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశగా అత్రి, అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు, మౌనముద్రతోనే ఉపదేశం చేసి, పరమగురువయ్యాడు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యనభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్త్వాన్ని లోకానికి ఎరుకపరచి గురువులకే గురువైన అవధూత. ఈనాడు దత్తచరిత్ర పారాయణ చేసి, ఆ పరమగురువుని స్మరించుకుంటారు.
మార్గాశిరమాసంలో వచ్చే లక్ష్మివారం(గురువారం) నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్త్యనుసారం ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.
ఇంకా మార్గశిరమాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది.