పెదవి విప్పని జర్నలిస్ట్ సంఘాలు
మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్ట్ సంఘాలను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన జర్నలిస్టు సంఘాల నేతలు నోరు మెదపకపోవడం విశ్మయాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల జర్నలిస్టులలో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ప్రభుత్వ చర్య కొంతమంది జర్నలిస్ట్‌లకు మోదం.. మరి కొందరికి ఖేదం కలిగించింది.
జర్నలిజమే ప్రధానంగా పనిచేస్తున్న రియల్ వర్కింగ్ జర్నలిస్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగితిస్తున్నారు. జర్నలిస్టు సంఘాలు స్వతంత్రంగా వ్యవహరించకుండా, అధికారంలో ఎవరుంటే వారి దగ్గర కొన్ని సంఘాల నేతలు సాగిల పడి, భజన పరులుగా మారిపోతూ నామినేటెడ్ పదవులను పొందుతూ, జర్నలిస్టుల సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రత్యర్ధి సంఘాల ను రూపు మాపడమే ధ్యేయంగా పనిచేయడం పరిపాటిగా మారిపోయింది. ఇటువంటి చర్యల వలన జర్నలిస్ట్ సంఘాలమధ్య సమన్వయం కొరవడి ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకోవలని చేస్తున్న ప్రయత్నాలవలనే రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.
కొంత మంది సంఘ వ్యతిరేక శక్తులు జర్నలిస్ట్ సంఘాలలో జొరపడి మీడియా మాఫియాను రాష్ట్రంలో సృష్టించారు. డొక్క చింపితే అక్షరం ముక్క రాని వారు సైతం ముఖ్యమంత్రి నుండి జిల్లా కలెక్టర్ల వరకు నిర్వహించే ముఖ్యమైన ప్రెస్ మీట్లలో ముందు వరుసలో కూర్చుని అసందర్భ ప్రశ్నలు సంధిస్తూ, రియల్ వర్కింగ్ జర్నలిస్ట్‌లకు రోత పుట్టిస్తున్న సంఘటనలు రాష్ట్రంలో కోకొల్లలు. అక్రెడిటేషనే ఆయుధంగా కొంతమంది మాఫియా లీడర్లు బ్లాక్‌మెయిలింగ్ ముఠాలుగా ఏర్పడి అన్ని స్థాయిలలో అందిన కాడికి దోచుకు తింటున్నారు.
గతంలో బ్రతకలేక బడిపంతులు అనే సామెతకు బదులు వర్తమానంలో బ్రతకలేక జర్నలిస్ట్‌గా అవతారం ఎత్తాడు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఎందుకు పనికిరాని, పనీ పాట లేని జులాయిలు ఏదో ఒక పేపరు / టి.వి పంచన చేరడం ఆయా యాజమాన్యాలు సెంటర్‌ను బట్టి విధించే నెలవారీ వసూళ్ళ కోసం ప్రజలపై పడడం మనం చూస్తూనే ఉన్నాం. టార్గెట్లను పూర్తిచేయని వారిని వెళ్ళగొట్టడంతో తినమరిగిన కుక్క దారికాచినట్టు స్వంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ను సునాయాసంగా ఏర్పాటు చేసేసుకుని ప్రజలపై పడడం షరా మామూలై పోయింది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ప్రస్థుత కాలంలో కాంప్లిమంటరీ కాపీలకే పరిమితమై పోయిన పలు దినపత్రికలు ప్రభుత్వ పరంగా వచ్చే రాయితీలను దండుకోవడంతో పాటుగా ఉనికిని కాపాడుకోవడం కోసం కొన్ని రెగ్యులర్ దినపత్రికలకు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌లతో ఒడంబడిక చేసుకుని పుంజీడు పేపర్లను ముద్రించి, ఒక్కో జిల్లా కేంద్రంలో పట్టుమని పది కాపీలు కూడా అమ్మలేని స్థితిలో ఉండి కూడా ఒక్కో జిల్లాలో సుమారు 60 నుండి 80 వరకు మీడియా అక్రెడిటేషన్లు పొందుతూ వాటిని విక్రయిస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నాయి. ఇక చిన్న పత్రికలైతే మీడియా అక్రెడిటేషన్ కు ముందు మూడు నెలల పాటు సమాచార శాఖలో హాజరు కోసం అష్టకష్టాలు పడి పేపరును ముద్రించి అరకొర అక్రెడిటేషన్లు పొందిన తరువాత కనుమరుగైపోవడం జగమెరిగిన సత్యం.
ఇటువంటి వాటికి చెక్ పెట్టడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే సమాచార శాఖ కమీషనర్ ఆధ్వర్యంలో ఒక ఉపసంఘాన్ని పలువురు సీనియర్ జర్నలిస్ట్‌లతో ఏర్పాటు చేయడం, వారిచ్చిన సిఫారసులను అమలు చేయడానికి సమాచార శాఖ ప్రయత్నించింది. కమిటీ సిఫారసులు మీడియా గొంతు నొక్కేవిధంగా ఉన్నాయంటూ జర్నలిస్ట్ సంఘాలు నానా యాగీ చేసాయి. మీడియా అక్రెడిటేషన్ పొదాలంటే కనీస విద్యార్హత పదవతరగతి ఉత్తీర్ణతతో పాటు పలు కఠిన నిబంధనలు ఉన్నాయంటూ రాష్ట్రంలోని యావత్ జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టి ఉప సంఘం సిఫారసులను బుట్టదాఖలాచేయడంలో విజయం సాధించాయి.
ప్రతి ఏటా రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రెడిటేషన్ల పందేరంలో అర్హత ఉన్నా లేకపోయిన అడిగినన్ని అక్రెడిటేషన్లను మంజూరుకు దోహదపడుతూ, ప్రతీ ఏటా తమ ఖజానాలను నింపుకుంటున్న కొంత మంది యూనియన్ నాయకులకు ప్రభుత్వ నిర్ణయం మింగుడు పడడంలేదు.
అక్రెడిటేషన్ల మంజూరు మాట ఎలా ఉన్నా రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా కమిటీలలో సభ్యుడుగా స్థానం కల్పించడానికి లక్ష నుండి రెండు లక్షల రూపాయలకు రేటు పెట్టి మరీ విక్రయాలు సాగించారు కొంతమంది యూనియన్ నేతలు. లక్షలు పెట్టి కొనుక్కున్న అక్రెడిటేషన్ కమిటీ పదవిని అడ్డు పెట్టుకుని ఖర్చు చేసిన డబ్బుకు రెండు రెట్లు సంపాదించడానికి వర్కింగ్ జర్నలిస్ట్‌లను గాలికొదిలేసి గ్యాంబ్లింగ్ లీడర్లు, చోటా పొలిటికల్ లీడర్లకు అక్రెడిటేషన్లను కట్టబెట్టారు జిల్లా స్థాయిలలో ప్రాతినిధ్యం వహిస్తున్న కొంత మంది యూనియన్ నేతలు.
ఇప్పటివరకూ ఏదో ఒక యూనియన్ నేతల ప్రాపకంతో మీడియా అక్రెడిటేషన్లు సంపాదించిన వారి దృష్టి కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార్లను ప్రశన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరి కొంత మంది ఒక అడుగు ముందుకేసి సామాజిక వర్గాల పేరిట అధికార్లను కాకా పడుతున్నట్లు సమాచారం.
నూతన మీడియా అక్రెడిటేషన్ నిబంధనలు రాష్ట్రంలో ప్రచురించే పలు పెద్ద , చిన్న దినపత్రికలతో పాటుగా, శాటిలైట్, కేబుల్ టి.వి లకు అక్రెడిటేషన్ల మంజూరుకు ప్రతిబంధకంగా తయారయ్యాయని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు.
జి.ఓ.నెం.142 ప్రకారం దినపత్రికలు కనీసం రెండు వేల కాపీలను విక్రయిస్తేనే అక్రెడిటేషన్లు పొందడానికి అర్హత సాధిస్తాయి. అలాగే పత్రిక సర్య్కులేషన్‌ను నిర్ధారిస్తూ ఆటిట్ బ్యూరో ఆఫ్ సర్య్కులేషన్ లేదా రిజిస్ర్టార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ మంజూరు చేసే సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
ఒక వేళ ఎ.బి.సి, ఆర్.ఎన్.ఐ సర్టిఫికేట్లు సమర్పించ లేకపోయినట్లయితే సర్యులేషన్‌ను నిర్ధారిస్తూ జి.ఎస్.టి రిటర్స్న్తో కూడిన ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
జి.ఎస్.టి పెద్ద, చిన్న పత్రిక పాలిట గుది బండగా తయారైంది. జి.ఎస్.టి. రిటర్న్స్‌లో చందాదారుల వివరాలతో పాటుగా, రోజువారీ ప్రతిక ముద్రణకు కావలసిన న్యూస్ ప్రింట్, సిబ్బంది జీత భత్యాలు, ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్, విద్యుత్ వాడకం, ట్రాన్స్పోర్ట్ తదితర ఖర్చులను రిటర్న్స్‌గా సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓ రెండు మూడు పత్రికలు మాత్రమే జి.ఎస్.టి రిటర్న్స్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
జి.ఎస్.టిని పక్కన పెడితే 75 వేల కాపీలు కన్నా తక్కువ సర్య్యులేషన్ కలిగిన దిన పత్రిక కు ఒక్కో సెంటర్ లో కనీసం రోజుకు వంద కాపీలు అమ్మకాలు జరిగినట్లుగా ఆధారాలు చూపించాలి. మండల స్థాయిలో అక్రెడిటేషన్ పొందాలంటే అక్రెడిటేషన్ పొందే తేదీకి ముందు మూడు నెలలపాటు నెలకు పది పేపర్ క్లిప్పింగ్‌లు సమర్పించాలి. అలాగే మీడియా అక్రెడిటేషన్ పొందేవారు పూర్తి స్థాయి జర్పలిజం వృత్తిలోనే ఉండాలి, ప్రభుత్వ సంస్థలతో పాటగా ఎటువంటి ఇతర సంస్థలలో ఉద్యోగిగా పని చేయరాదు. పత్రికారంగానికి బదులు ఏ ఇతర ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా క్రిమినల్ కేసు నమోదు చేసి మీడియా అక్రెడిటేషన్ పొందడానికి అనర్హుడుగా కమిటీ ప్రకటిస్తుంది.
ఇక న్యూస్ ఛానల్స్ విషయానికి వస్తే నూతన విధానంలో ఆంధ్రప్రదేశ్ నుండి 24 గంటల పాటు తెలుగులో ప్రసారాలు చేసే శాటిలైట్ ఛానల్స్‌కు జిల్లా స్థాయిలో ఇద్దరు రిపోర్టర్లు ఇద్దరు వీడియో గ్రాఫర్లతో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ ఒక వీడియో గ్రాఫర్‌కు అక్రెడిటేషన్లు మంజూరు చేయవచ్చు. ఇక్కడ వరకు బాగానే ఉన్నాఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న శాటిలైట్ ఛానల్స్ బహుసా లేవనే చెప్పవచ్చు. మరి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ప్రసారాలు నిర్వహిస్తూ విజయవాడలో కార్యాలయాలు నిర్వహిస్తున్న శాటిలైట్ ఛానల్స్‌కు నిబంధనల ప్రకారం అక్రెడిటేషన్లు మంజూరు అవుతాయో లేదో వేచి చూడాలి.
ఎ.పి.ఫైబర్, ఎం.ఎస్.ఓ ల పుణ్యమా అని పెట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చిన పలు కేబుల్, క్లౌడ్ చానల్స్‌కు కేబుల్ టెలివిజన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం చూస్తే మీడియా అక్రెడిటేషన్ మంజూరు కష్టంగానే కనిపిస్తుంది. భారత సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వద్ద డిజిటల్ కేబుల్ టి.వి నిర్వహించడానికి మల్టీ సిస్టం ఆపరేటర్ (ఎం.ఎస్.ఓ)గా నమోదైన సంస్థలు స్వంతంగా కేబుల్ టి.వి సేవలను అందిస్తూ ఉంటే మీడియా అక్రెడిటేషన్లు మంజూరు చేయడం జరుగుతుంది.
పోస్టాఫీస్‌లలో ఐదు వందల రూపాయలు చెల్లించి లోకల్ కేబుల్ ఆపరేటర్ (ఎల్.సి.ఓ) గా నమోదు చేసుకుని ఎం.ఎస్.ఓ ల వద్ద నుండి డిజిటల్ సిగ్నల్స్ తీసుకుని వినియోగదారులకు అందించే లోకల్ కేబుల్ ఆపరేటర్ (ఎల్.సి.ఓ) లు ఇప్పటివరకు కేబుల్ టి.వి ల పేరిట మీడియా అక్రెడిటేషన్లు పొందుతూ వచ్చారు.
నూతన నిబంధనల ప్రకారం దేశంలో కేబుల్ టి.వి లను డిజిటలైజేషన్ పేరిట కండీషనల్ యాక్సెస్ సిస్టం పేరిట నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో టెలివిజన్ ప్రసారాలు నిర్వహించడానికి విధిగా భారత సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ వద్ద డిజిటల్ కేబుల్ టి.వి నిర్వహించడానికి మల్టీ సిస్టం ఆపరేటర్ (ఎం.ఎస్.ఓ)గా రిజిష్టర్ అయ్యి స్వంత డిజిటల్ టి.వి నెట్వర్క్ తప్పనిసరి. అక్రెడిటేషన్ల మంజూరుకు శాటిలైట్ ఛానల్స్‌కు ఒక నిబంధన అడ్డంగా మారుతూ ఉంటే కేబుల్ టి.వి లకు మరో నిబంధన ప్రతిబంధకంగా మారుతుంది.
ఇన్ని కఠిన తరమైన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జి.ఓ 142 విడుదల చేస్తే ఘనత వహించిన జర్నలిస్ట్ సంఘాలు అక్రెడిటేషన్ కమిటీలలో స్థానాల కోసమే తాపత్రయ పడ్డారు కాని, కఠిన తరమైన నిబంధనలతో తయారైన జి.ఓ 142 చదివి ఉండకపోవచ్చంటున్నారు పలువరు జర్నలిస్టులు.
వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమాల పేరిట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగి ప్రభుత్వాధినేతల ప్రాపకంతో ఆయా ప్రభుత్వాలలో అత్యున్నత పీఠాలను అదిరోహించిన జర్నలిస్టు నేతలు ఎక్కడా అంటూ వెదుకుతున్నారు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్‌లు.
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్‌లకు ప్రతి ఏటా మంజూరు చేసే మీడియా అక్రెడిటేషన్ల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో జర్నలిస్ట్‌లకు ప్రభుత్వ పరంగా అందాల్సిన హెల్త్ ఇన్య్సూరెన్స్ తదితర రాయితీలు అందక పలు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు.
గతంలో రాష్ట్ర, జిల్లా స్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీలలో ప్రాతినిధ్యం వహించిన 5 జర్నలిస్టు సంఘాలకు బదులుగా రాష్ట్రంలో సంఖ్యా పరంగా పెద్ద సంఘాలైన రెండు సంఘాలకు కమిటీలలో చోటు కల్పించి, మిగిలిన మూడు సంఘాలకు సమాచార శాఖ రిక్త హస్తాలు చూపడంతో మనుగడకోసం మిగిలిన సంఘాలు ఆత్మరక్షణలో పడ్డాయి.
మీడియా కమిటీలలో చోటు దక్కించుకున్న కొంత మంది యూనియన్ల నేతల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. తమ కత్తులకు రెండు వైపులా పదునన్నట్టు రాష్ట్రంలోని చిన్నా చితక పత్రికల యాజమాన్యాలతో పాటుగా, జర్నలిస్టులు తమ కనుసన్నలలో మెలిగేలా పావులు కదపడం మొదలు పెట్టారు.
దీనిపై చిర్రెత్తుకొచ్చిన రియల్ వర్కింగ్ జర్నలిస్ట్‌లు ప్రభుత్వ దృష్టికి ఆయా సంఘాల నేతల వికృత చేష్టలను తీసుకుని వెళ్ళారు. జర్నలిస్ట్ సంఘాల మధ్య విభేదాల కారణంగా మీడియా కమిటీలలో మిగిలి ఉన్న యూనియన్ల ప్రాతినిధ్యాన్ని కూడా తొలగిస్తున్నట్లు సమాచార శాఖ ప్రకటిస్తూ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను కేవలం అధికార్లతో ఏర్పటుకు సంబంధించిన అనుబంధ జి.ఓ ను విడుదల చేసారు. దీనితో రాష్ట్రంలోని జర్నలిస్టులను తమ చెప్పు చేతలలో పెట్టుకుని ఆడిందల్లా ఆటగా వ్యవహరించాలనుకున్న యూనియన్ నేతలకు చెక్ పెట్టినట్లయ్యింది సమాచార శాఖ నిర్ణయం.
జర్నలిస్టుల ఈతి బాధలు జర్నలిస్టులకే తెలుస్తాయి. కాబట్టే అక్రెడిటేషన్ కమిటీలలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాధాన్యత ఇవ్వడం వలన రియల్ వర్కింగ్ జర్నలిస్ట్‌లకు నష్టం వాటిల్లకుండా పెద్దా చిన్నా తారతమ్యాలు లేకుండా పనిచేసే వారందరికీ అక్రెడిటేసన్ మంజూరు జరుగుతాయనేది ఒక వర్గం జర్నలిస్ట్ ల వాదన.
జర్నలిస్టుల ప్రాతినిధ్యం లేని కమిటీలలో అధికారులే మీడియా సంస్థల అర్హతలను నిర్ధారించడం వలన రాష్ట్రంలో సుమారుగా 95 శాతం మీడియా సంస్థలకు నూతన విధానలు అమలైతే అక్రెడిటేషన్లు గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తుంది. జి.ఓ లోని కఠినతరమైన నిబంధనలను అధికారులు తూఛ తప్పకుండా పాటించకుండా గత కమిటీలలానే జర్నలిస్ట్ సంఘాలు / రాజకీయ నేతల సిఫారసు లేఖలతో అనర్హులకు అక్రెడిటేషన్లు గాని మంజూరు చేసినట్లయితే – రేపటి రోజున నిబంధనలకు విరుద్ధంగా మీడియా అక్రెడిటేషన్లు మంజూరు చేసారని ఎవరైనా కోర్టులను ఆశ్రయిస్తే కమిటీకి సారధ్యం వహిస్తున్నఅధికారుల మెడకు ఉచ్చు బిగిసుకుంటుంది.
గతంలో పలు మీడియా సంస్థలు నిబంధనలు పాటించకపోయినప్పటికిన్నీ కమిటీలోని యూనియన్ ప్రతినిధుల చొరవ, రాజకీయ నాయకుల సిఫారసు లేఖలతో కావలసిన వారికి కావలసినన్ని అక్రెడిటేషన్లు దక్కించుకునేవారు. నూతన జి.ఓ పుణ్యమా అని ఇప్పుడు ఆదారులు మూసుకు పోయాయి.
మెడలో లైసెన్స్ (అక్రెడిటేషన్ కార్డు) బిళ్ళ వేసుకుని కొన్ని సందర్భాలలో అధికార్లకు ముచ్చెమటలు పట్టించిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే లైసెన్స్ బిళ్ళ మంజూరు చేయడానికి ఆ అధికార్లకే అధికారం చేజిక్కడంతో కొంత మంది జర్నలిస్టుల పరిస్థితి అడకత్తెర లో పోక చెక్క చందాన తయారయ్యింది. మరికొంత మంది ఒక అడుగు ముందుకేసి కమిటీలోని అధికార్లను సామాజిక వర్గాల పేరిట ప్రశన్నం చేసుకుని అక్రెడిటేషన్ లు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
జర్నలిజం వృత్తిపైనే ఆధారపడిన కొన్ని చిన్న పత్రికలు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతూ పత్రికను నిర్వహిస్తూ ఉంటే వాటికి నిబంధనల పేరిట అక్రెడిటేషన్ల మంజూరులో మోకాలడ్డేసి, అక్రెడిటేషన్ నిబంధనల ప్రకారం పరిశీలనార్హానికి నోచుకోని దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంప్లిమెంటరీ దిన పత్రికలకు ఒక్కో దానికి మాత్రం జిల్లాకు సుమారు 60 అక్రెడిటేషన్లు మంజూరు చేయించుకోవడంలో యూనియన్ నేతల కృతకృత్యులయ్యేవారు. ఇప్పుడు నూతన అక్రెడిటేషన్ నిబంధనల ప్రకారం చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అక్రెడిటేషన్లు మంజూరు చేస్తే తమకు అభ్యంతరం లేదంటున్నారు జర్నలిస్ట్‌లు. అంతేకాని పెద్ద పత్రికలకు నిబంధనలు సడలించి, చిన్న పత్రికలకు మొండి చెయ్యి చూపిస్తే మాత్రం ప్రతిఘటనకు సిద్ధమౌతున్నారు చిన్న పత్రికల యాజమాన్యాలు. నిబంధనలు సడలిస్తే మాత్రం అందరికీ సమన్యాయం పాఠించాలని కోరుతున్నారు జర్నలిస్టులు.
ఇప్పటికే యూనియన్ నేతల అరాచకాలపై చిర్రెత్తుకొచ్చిన కొంత మంది రియల్ జర్నలిస్ట్‌లు 2021-22 సంవత్సరానికి మంజూరు చేసే మీడియా అక్రెడిటేషన్ల విధానంలో జి.ఓ. నెం.142 విధి విధానాలను తూఛ తప్పకుండా అమలు చేయకపోతే న్యాయ పోరాటానికి సిద్ధమౌతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
– మోజెస్ బాబు పోలిమెట్ల✍️
సీనియర్ జర్నలిస్టు
కాకినాడ.