రైతుల్ని రారాజులు చేయనక్కర్లేదు…రాజకీయం చేయకండి చాలు..!

922

క్రితం వారం దేశ రాజధాని లో రైతులకు సంబంధించిన ఒక వార్త చాలా వైరల్ అయింది… ఆందోళన చేస్తున్న రైతుల్ని కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంలో విరామ సమయంలో కేంద్ర మంత్రి రైతుల్ని ‘టీ’ కోసం పిలిస్తే రైతుల సమాధానం: “ఈ సమయంలో మీ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నందుకు క్షమించండి… మీరంతా మేము ఆందోళన చేస్తున్న ప్రాంతానికి రమ్మని కోరుతున్నాం… అక్కడైతే, మీ అందరికీ టీ తోపాటు వేడి వేడి జిలేబి , పకోడీ కూడా అందిస్తాం… దయచేసి అందరూ అక్కడికే రండి”. ఈ సమాధానం తో కేంద్రమంత్రి ఖంగు తిన్నారట…! చర్చలు జరిగినన్నాళ్లు రైతులంతా తమతో తెచ్చు కున్న ఆహారం, స్నాక్స్ మాత్రమే, అదీ కింద కూర్చునే తిన్నారట… కనీసం పచ్చి నీళ్లు కూడా ప్రభుత్వం సొమ్ము ముట్టలేదట…!

రైతుల గురించి తెలిసిన వాళ్లెవరకీ ఇది ఏమీ ఆశ్చర్యం కలిగించే విషయం కాదు… రైతు ఎప్పుడూ అనంతమైన విలువల్ని, అంతులేని ఆత్మాభిమానాన్ని , రాజీ లేని ఆత్మ గౌరవాన్ని ఆలంబన గా బతుకుతాడు… లేకపోతే, ఇప్పటికీ వ్యవసాయాన్నే నమ్ముకు బతుకుతున్న రైతు ‘ఎక్కడో’ ఉండేవాడు…! ఓట్ల కోసం, నోట్ల కోసం ఎప్పటికప్పుడు రైతుల జీవితాల్నే రాజకీయం చేస్తున్న మన ఘనత వహించిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తిలాపాపం తలా పిడికెడూ  పంచుకుంటున్నాయి… ఇప్పుడు సమస్య రైతులకు ఈ కొత్త చట్టాలు ఎంతవరకు ఉపయోగం… లేక… రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెడతాయేమో !!! అని  కాదు.

రైతుల్ని రాజకీయం చేయటం గురించి…  కొన్ని రోజులుగా రైతులు అమ్ముడు పోయారని, రైతులు కొందరు కమీషన్ ఏజెంట్ల చేతుల్లో పావులుగా మారిపోయారని… కొందరు రైతులు దేశ ద్రోహులని… మరి కొందరు రైతులు  ఉగ్రవాదులని… ప్రతిపక్షాల చేతుల్లో రైతులు కీలు బొమ్మలని… ఇంకొందరు రైతులు విశ్వాస ఘాతకులని… వాళ్ళకెంతో చేస్తున్నా ఇంకా ఇలా చేస్తున్న కొందరు రైతులు నమ్మక ద్రోహులని… ఇలా ఎన్నో , ఎన్నెన్నో, నిరాధార.. అసత్య… అసమంజస… అహేతుక ఆరోపణలను అమాయకులైన రైతుల పై చాలా అక్రమంగా, చాల అన్యాయంగా విచక్షణా రహితంగా చేస్తున్నారు. ఇవన్నీ ఖండనార్హం… హేయమైన ఇలాంటి ఆరోపణలను చేసిన-చేస్తున్న నీచ-నికృష్ట  రాజకీయ నాయకులంతా రైతులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.

అసలు సమస్యలో కొద్దాం… ఇప్పటికే ఎందరో మేధావులు , చదువుకున్నోళ్ళు, తెలివైనవాళ్లు, విజ్ఞానులు, పెద్దమనుషులు సమస్య లోతుల్లోనికి వెళ్లి లాభ- నష్టాలు విపులీకరించి, విశ్లేషించి వివరించి ఉన్నారు… అందువల్ల మళ్ళీ చర్చ, విశ్లేషణ-వివరణ  అనవసరం… రైతుల్లో కూడా ఎందరో పైన పేర్కొన్న జ్ఞాన-విజ్ఞానవంతులందరూ ఉన్నారు గాబట్టి రైతులకు వచ్చే లాభ – నష్టాల గురించి విచక్షణ, వివేచనా వాళ్ళకుంది… రాజ్యాంగ భద్దంగా, చట్ట భద్దంగా, న్యాయబద్ధంగా ఎవరికైనా తమ అసంతృప్తినీ, తమ అసమ్మతినీ ప్రకటించే స్వేచ్చ-స్వతంత్రం ఈ పవిత్ర భారత దేశం లో ఉన్నాయి కదా…? రైతులు చాలా అహింసాయుతం గా, శాంతియుతంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తమ నిరసన వ్యక్తం చేస్తుంటే… రైతులపై ఇంత నీచమైన-నికృష్టమైన రాజకీయ దాడి. సోషల్ మీడియా వేదికగా కొందరు, అమ్ముడు పోయిన దిగజారిన ఒక  మీడియా వర్గం సహకారం తో మరి కొందరూ ఒక పధకం ప్రకారం రైతులపై విష ప్రచారం చేస్తున్నారు… ఇది క్షమార్హం కాదు…

మీరు రైతులకోసమే ఈ చట్టాలు చేసి ఉంటే మీకు ఎందుకింత అసహనం…? రైతులకు మీరు అవే విషయాలు విపులంగా, వివరంగా ఎందుకు వివరించరు…?  రైతుల అభ్యున్నతే మీ ధ్యేయం ఐతే మీ లక్ష్యమైన రైతులకే  మీరు ఎందుకు నమ్మకం కల్పించలేక పోతున్నారు…?… పార్లమెంట్లో మొత్తం బలం-బలగం మీదైనప్పుడు అదే పార్లమెంటు సాక్షి గా మీరు ఒక విస్తృతమైన చర్చ చేసి మీరనుకున్న సర్వసమ్మతి, అనుకూలత సాధించలేరా…? మీకు ఎందుకింత తెంపరితనం… మీకు దేశం లో ఇప్పుడు ఎదురే లేదు కదా… మీరు అన్ని వర్గాలని సంఘాలని సంఘటిత పరిచి మీరు చేస్తున్న మంచిని రైతులకు అర్ధమయ్యే రీతిలో చెప్పొచ్చు కదా…? మీకు ఎందుకు ఇంత పిడివాదం…? మీ సోషల్ మీడియా, మీకు అనుకూలమైన ఒక వర్గం మీడియా ల ద్వారా కూడా మీరు రైతులకు చేస్తున్న-చేయబోతున్న ఉపయోగాల గురుంచీ ప్రయోజనాల గురుంచీ విస్తృతం గా మంచి ప్రచారం చేసుకోవచ్చు కదా…? ఆలా కూడా అందర్నీ ఒప్పించొచ్చు కదా…? రైతులపై ఇంతటి అన్యాయ-అధర్మ విష ప్రచారాలేంటి…???

దయచేసి రైతుల్ని రాజకీయం చేయవద్దు… వారిని మీరు రాజాలు, రాజులు , రారాజులు అంతకంటే  చేయనక్కర్లేదు… కేవలం వాళ్ళు ఎంతో శ్రమకోర్చి పండించే పంటలకు కనీస ధర… ఒక మద్దతు ధర… ఒక భరోసా… మాత్రమే రైతులు ప్రభుత్వాల నుండి  కోరుకొంటారు… రైతులు పక్కా వ్యాపారులు కారు… కాలేరు … రైతులు అల్ప సంతోషులు… రైతు కొద్ది పాటి లాభం తోనే ఏంటో సంబరపడిపోతాడు… సంతోషపడిపోతాడు… ఎందుకంటే మళ్ళీ పంట వేయచ్చు కదా అని… వ్యవసాయం అదో పెద్ద వ్యసనం… ఒక రకంగా ఇదొక పెద్ద జబ్బు … ఈ వ్యసనానికి మందు లేదు… డ్రగ్ ఎడిక్షన్, రీహాబిలిటేషన్ సెంటర్లు, ట్రీట్మెంట్లు కూడా ఈ జబ్బు కు లేవు… సంపాదన లేకున్నా, నష్టాలు వస్తున్నా వ్యవసాయాన్ని రైతు మానడు… నష్టాలు మరీ ఎక్కువైతే “ఉరి” కైనా రైతు సిద్ధపడతాడు తప్ప ఎందుకో వ్యవసాయాన్ని మాత్రం మానడు… రైతులకు పట్టిన అతి పెద్ద వ్యసనం ఈ వ్యవసాయమే… ఇది నిజం… ఒక రైతు బిడ్డ గా చెబుతున్నా… ఇది ఒక పచ్చి నిజం… Save farmer’s to save India..

– పెన్మెత్స రవి ప్రకాష్ అశోక వర్మ,
 శృంగవృక్షం,Near భీమవరం,
పాలకోడేరు మండలం,
పశ్చిమ గోదావరి జిల్లా,ఆంధ్ర ప్రదేశ్