అమరావతి సరే…ఆ సస్పెన్షన్ల సంగతేమిటి?

658

మరి జిల్లాకో రాజధాని ఏమయింది?
సోము, జీవీఎల్ మాటలు తూచ్చేనా?
మరి కేంద్రం మళ్లీ అఫిడవిట్ ఇస్తుందా?
బీజేపీ తాజా  వైఖరిపై శ్రేణుల హర్షం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అనుభవమయితే గానీ తత్వం బోధపడదన్న సామెత ఏపీ కమల దళపతి సోము వీర్రాజు విషయంలో అక్షర సత్యమయింది. గతంలో మూడు రాజధానులుంటే తప్పేమిటని.. కేంద్రానికీ పార్టీకి సంబంధం లేదని, అసలు అమరావతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదని… పలుమార్లు పలు విధాలుగా ప్రకటనలు  చేసిన సోము, జీవీఎల్ వ్యాఖ్యలు ఇప్పుడు యు టర్ను తిరిగాయి. అమరావతిలోనే రాజధాని ఉండాలన్నది ఇప్పుడు బీజేపీ నయా సూత్రీకరణ. మంచిదే. ఆలస్యంగానయినా మంచి నిర్ణయం తీసుకున్న తమ పార్టీ నాయకత్వం… మరి అమరావతిపై ఇదే మాట చెప్పిన,  ఆ ముగ్గురి సస్పెన్షన్ల మాటేమిటన్నది కమలనాధులు సంధిస్తున్న ప్రశ్న. ఇది కూడా చదవండి.. బీజేపీ నేతల మాటలకు అర్ధాలే వేరులే

సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత.. జిల్లాకో రాజధాని ఏర్పాటుచేస్తామని, తమకు అధికారం ఇవ్వండని మీడియాలోనే ప్రకటించారు. అమరావతిని మార్చి మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించిన ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ, లంకా దినరక్‌ను సోము పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు స్వయంగా వీర్రాజు మూడు రాజధానులకు తాము వ్యతిరేకమని, రాజధాని అమరావతిలోనే ఉండాలని స్పష్టం చేశారు. మరి ఆ ప్రకారంగా.. అమరావతిపై మాట్లాడిన ఆయనను కూడా, ఆ ముగ్గురి మాదిరిగానే సస్పెండ్ చేయాలన్న చర్చ తెరపైకొచ్చింది.

అమరావతి అంశానికి- కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని సోము..అసలు అందులో కేంద్రం జోక్యం చేసుకోబోదని,  ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనేకసార్లు కుండబద్దలు కొట్టారు. ఈలోగా రాజధాని అంశంలో,  తాము జోక్యం చేసుకునేది లేదని కేంద్రం కూడా హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దానిపై సోము వీర్రాజు-జీవీఎల్ కూడా పార్టీకి-కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండగా, ఆ పార్టీ తీర్మానించింది. కన్నా సహా అగ్రనేతలంతా, అమరావతిలో రైతులు నిర్వహించిన ధర్నాల్లో పాల్గొని, సంఘీభావం ప్రకటించారు. కన్నా, ఇతర నేతలయితే ఓ అడుగు ముందుకేసి,  మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలోనే మౌన నిరసన దీక్ష నిర్వహించారు. అయితే సోము అధ్యక్షుడయిన తర్వాత అమరావతిపై పార్టీ వైఖరి మారడటంతో గందరగోళం నెలకొంది.

అమరావతిపై పార్టీనే స్వయంగా తీర్మానం చేసినందున,  ఆ అంశంపై అదే పార్టీ వైఖరి అన్న ధోరణిలో.. తిరుపతికి చెందిన సీనియర్ నేత, ఏపీ బలిజనాడు కన్వీనర్ ఓ.వి.రమణ, ఓ దినపత్రికలో అమరావతికి అనుకూల వ్యాసం రాశారు. దానిపై ఆగ్రహించిన వీర్రాజు, ఆయనకు షోకాజ్ ఇవ్వకుండానే సస్పెండ్ చేశారు. వీర్రాజు పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత వేసిన తొలి వేటు రమణదే.  కన్నా, సుజనా, జీవీఎల్, సోము, సునీల్ దియోధర్ చెప్పిందే తాను వ్యాసంలో రాసినందున.. వారిపైనా సస్పెన్షన్ వేటు వేయాలని, రమణ చేసిన డిమాండ్ సంలనం సృష్టించింది. బలిజల హక్కుల సాధన కోసం దశాబ్దాల నుంచి పోరాడుతున్న  ఆయన,  గతంలో జనతాదళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.ఇక ఆ తర్వాత.. అమరావతి అంశంపైనే మాట్లాడిన మరో సీనియర్ నేత, జేఏసీ కన్వీనర్  వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌పై రెండో వేటు పడింది. ఆయన విజయవాడ రూరల్‌లో పార్టీకి, సొంత భూమి ఇచ్చిన నేత కావడం విశేషం. కానీ ఇప్పటివరకూ పార్టీ నాయకత్వం అక్కడ భవన నిర్మాణం చేయలేకపోయింది. దానితో ఆ ప్రాంతంలో భవన సముదాయాలు నిర్మిద్దామనకున్న వెలగపూడికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కారణం మధ్యలో ఉన్న భూమి పార్టీకి ఇవ్వడమే. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన,  వెలగపూడి భూమిని తిరిగి ఇచ్చారా అంటే అదీ లేదు. ఈ విషయంపై ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాకు మెయిల్ పెట్టినా,  ఇంతవరకూ అతీగతీ లేదు.

ఎన్నికల ముందు వెంకయ్యనాయుడు, నాటి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆయన ఇంటికి వెళ్లి, వెలగపూడిని పార్టీలో చేర్చుకున్నారు. విభజన తర్వాత బీజేపీకి చోటు లేని పరిస్థితిలో,  వెలగపూడి ధైర్యం చేసి భారీ సంఖ్యలో విజయవాడ  సభ నిర్వహించారు. అమరావతిపై టీడీపీ-వైసీపీ వైఖరిని తొలుత విమర్శించింది ఆయనే. అమరావతి రైతులను బీజేపీ వైపు మళ్లించడంలో వెలగపూడి కృషి ఫలితమే, ఆ పార్టీకి అక్కడ ఇప్పుడు స్థానం లభించింది. అలాంటి నేతను కూడా వీర్రాజు సస్పెండ్ చేయడం విమర్శలకు దారితీసింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా సమక్షంలో  చేరిన లంకా దినకర్‌ను కూడా,  అమరావతి గురించి మాట్లాడినందుకే సస్పెండ్ చేయడం గమనార్హం. పలు జాతీయ వేదికలు, మీడియాలో బీజేపీ విధానాన్ని బలంగా సమర్థించి మాట్లాడే దినకర్‌పై సస్పెన్షన్ వేటుతో,  సోము సస్పెన్షన్ల సంఖ్య మూడుకు చేరింది.  అయితే నద్దా సమక్షంలో చేరిన ఓ.వి.రమణ, లంకాదినకర్.. అప్పటి నేత వెంకయ్యనాయుడు సమక్షంలో చేరిన వెలగపూడిని సస్పెండ్ చేసిన సోము వీర్రాజు… మళ్లీ ఇప్పుడు అమరావతికి అనుకూలమని ప్రకటించడమే విస్మయకరం. మరి ఆ ప్రకారంగా, అమరావతికి అనుకూలంగా మాట్లాడిన ఆ ముగ్గురిపై పడిన సస్పెన్షన్ వేటు ఎత్తేస్తారా? లేక తొందరపడి సస్పెండ్ చేసినందుకు క్షమాపణ చెబుతారా? జిల్లాకో రాజధాని నిర్మిస్తామన్న వీర్రాజు తన వ్యాఖ్యలు ఉప సంహరించుకున్నట్లు ప్రకటిస్తారా?  అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.

అమరావతిలో రాజధాని ఉండాలని ప్రధాని మోదీ ప్రతినిధిగా చెబుతున్నానని,  వీర్రాజు తనకు తాను  ‘కొత్త హోదా’ తగిలించుకోవడం చర్చనీయాంశమయింది. గతంలో కేంద్రానికీ-పార్టీకి సంబంధం లేదు. ‘రాజధాని ఎక్కడ నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. ఆ ప్రక్రియలో కేంద్రం జోక్యం చేసుకోబోదని’ సోము-జీవీఎల్ జమిలిగా చెప్పారు. మరి ఇప్పుడు వీర్రాజు తనను తాను ప్రధాని ప్రతినిధిగా ప్రకటించుకున్నారు. మరి  కేంద్రానికి నాయకత్వం వహించే ప్రధాని.. అమరావతిపై మనసు మార్చుకుని, ఆ మేరకు హైకోర్టులో మరో అఫిడవిట్ ఇస్తారా? లేక ఆ మేరకు వీర్రాజే నడుం బిగించి, మోదీకి చెప్పి  కేంద్రం ద్వారా అఫిడవిట్ ఇప్పించేలా కృషి చేస్తారా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే ప్రధాని ప్రతినిధి అయినప్పుడు ఆపాటి బాధ్యత తీసుకోవాలి కదా?

ఏది ఏమయినా అమరావతిపై,  పార్టీ వైఖరి మారడం సంతోషమేనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే.. ఇదే వైఖరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముందు ప్రకటించి ఉంటే, సీమాంధ్రులు బీజేపీకే జై కొట్టేవారన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. అమరావతిపై వైఖరి ప్రకటించనందుకే, హైదరాబాద్‌లోని సీమాంధ్రులు టీఆర్‌ఎస్‌కు ఒటు వేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.