అన్నదాతలకే కాదు..అందరికీ ముప్పే

457

నూతన వ్యవసాయ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహకులు తామే న్యాయస్థానాలుగా మారిపోతారు. న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. పెద్ద కార్పొరేట్లకూ, రైతులకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను తాజా చట్టాలు మరింతగా పెంచుతాయి. ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కులకోసం నిలబడ్డారు.
‘‘కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారికి, లేదా దీనికి సంబంధించిన మరే ఇతర వ్యక్తికి వ్యతిరేకంగా ఈ చట్టం కింద సదు ద్దేశంతో చేసిన, చేయాలను కున్న వాటి గురించి న్యాయ పరమైన ఫిర్యాదు, దావాలు ఉండవు.’’ రైతు ఉత్పత్తుల అమ్మకం, వాణిజ్య చట్టం, 2020లోని 13వ భాగంలోని వాక్యాలు ఇవి.

ఇప్పుడు కూడా ఈ కొత్త చట్టాలు రైతులను మాత్రమే ఉద్దేశించినవని మీరు అనుకుంటున్నారా?
సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులు నిర్వహించాల్సిన న్యాయపరమైన బాధ్యతలకు వ్యతిరేకంగా దావా వేయడానికి మినహాయింపునిచ్చే చట్టాలు కూడా ఉన్నాయి. కానీ ఇది దాన్ని ఎన్నో రెట్లు మించిపోయింది. ‘సదుద్దేశంతో’ వాళ్లు ఏం చేసినా దానికి చట్టపరమైన మినహాయింపు ఇవ్వడం మరీ అతిశయం. ‘సదుద్దేశంతో’నే ఏదైనా నేరం చేసి వుంటే వాళ్లను కోర్టుకు ఈడ్వలేకపోవడమే కాదు, ఇతరత్రా వేరే విధమైన చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేనంత రక్షణలో వారున్నారు. పొరపాటున మీరు ఈ అంశం వదిలేసివుంటే గనక, చట్టంలోని 15వ భాగం దాన్ని తిరిగి నొక్కి చెబు తుంది… ఈ అంశాలను విచారించే పరిధి ఏ సివిల్‌ న్యాయస్థానానికి కూడా లేదని.

అసలు ఎవరీ చట్టపరంగా సవాలు చేయలేని, సదుద్దేశంతో పనులు చేసే ‘మరే ఇతర వ్యక్తి’?
క్లూ: నిరసన తెలుపుతున్న రైతుల నినాదాల్లో దొర్లు తున్న బడా కార్పొరేట్‌ సామ్రాజ్యాధిపతులు పేర్లను వినడానికి ప్రయత్నించండి. ఇదంతా కూడా వ్యాపారాన్ని, చాలా చాలా పెద్ద వ్యాపారాన్ని సులభతరం చేయడంలో భాగంగా జరుగుతున్నది. ‘ఏ ఫిర్యాదు, వ్యాజ్యం లేదా మరే ఇతర న్యాయపరమైన చర్యలు ఉండవు’… వ్యాజ్యం వేయలేనిది రైతులు మాత్రమే కాదు, ఎవరూ వేయలేరు. ప్రజాహిత వ్యాజ్యాలకు కూడా ఇదే వర్తిస్తుంది. లాభాపేక్ష లేని గ్రూపులు, రైతు సంఘాలు, లేదా మంచో చెడో ఉద్దేశాలతో ఉన్న ఏ పౌరుడి జోక్యానికి కూడా ఇందులో వీలులేదు. అత్యవసర పరిస్థితి విధించిన 1975–77 కాలంలో తేలిగ్గా అన్ని ప్రాథమిక హక్కులు రద్దయి పోయాయి. మళ్లీ దాని తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు పౌరుడికి లేకుండా చేసిన విష యంలో ఈ చట్టాలు మరీ అతిశయపు మినహా యింపులు ఇచ్చేశాయి.

ప్రతి భారతీయుడి మీద దీని ప్రభావం ఉంటుంది. ఇంకోరకంగా చెప్పాలంటే, ఈ చట్టాల్లో వాడిన భాషవల్ల (తక్కువస్థాయి) కార్యనిర్వాహ కులు తామే న్యాయస్థానాలుగా మారిపోతారు. వాస్తవంగా చెప్పాలంటే, న్యాయమూర్తి, ధర్మకర్త, తలారి కూడా అయిపోతారు. రైతులు మున్ముందు వ్యవహారం చేయాల్సిన పెద్ద కార్పొరేట్లకూ, రైతులకూ మధ్య ఇదివరకే ఉన్న అన్యాయమైన అధికార అసమానతలను ఇది మరింతగా పెంచుతుంది. దీనిమీద ఆందోళన చెందిన ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో ఇలా ప్రశ్నించింది: ‘‘పౌర పరిణామాలకు దారితీసే అవ కాశమున్న వివాదాల్లో పాలన, కార్యనిర్వహణకు సంబంధించిన యంత్రాంగానికి తీర్పునిచ్చే అధికా రాన్ని ఎలా ఇస్తారు?’’ ఈ న్యాయసంబంధ అధికారాలను కార్య నిర్వాహక యంత్రాంగానికి బదిలీ చేయడాన్ని ‘ప్రమాదకరం, మహాపరాధం’ అని ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ అభివర్ణించింది. న్యాయవృత్తి మీద చూపే ప్రభావం గురించి, ‘ఇది ప్రత్యేకించి జిల్లా న్యాయ స్థానాల విధులకు తీవ్రమైన హాని కలిగించడంతో పాటు న్యాయవాదుల ఉనికిని కూడా లేకుండా చేస్తుంది’ అని అభిప్రాయపడింది.

ఇప్పుడుకూడా ఈ చట్టాలు కేవలం రైతులను ఉద్దేశించినవే నని అనుకుంటున్నారా?
కార్యనిర్వాహక యంత్రాంగా నికి న్యాయపరమైన అధికారాలను బదిలీచేయడం ఒప్పందాలకు సంబంధించిన చట్టంలో ఉంది. దీనిలోని 19వ భాగం ఏమంటుందంటే: సబ్‌ డివిజినల్‌ అధికారి, పునర్విచారణ జరిపే అధికారి ఈ చట్టం కింద పూర్తి సాధికారులై నిర్ణయించినదాన్ని నిలిపివేయ గలిగే అధికారం ఏ సివిల్‌ న్యాయ స్థానానికిగానీ మరే ఇతర అధికార యంత్రాంగానికి గానీ లేదు. ఈ వ్యవసాయ చట్టం లోని 19వ భాగపు సారాంశం… రాజ్యాంగపరమైన విచికిత్సకు హక్కు కల్పించే రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్‌ను కొట్టి పడేస్తోంది. ఆర్టికల్‌ 32ను రాజ్యాంగపు ప్రాథ మికమైన నిర్మాణంగా పరిగణిస్తారు.  కచ్చితంగా ఈ ‘ప్రధాన స్రవంతి’ మీడియా (జనాభాలోని 70 శాతానికి సంబంధించిన అంశాలను విస్మరించేదానికి పెట్టిన చిత్రమైన పేరు)కు ఈ వ్యవసాయ చట్టాలవల్ల భారత ప్రజాస్వామ్యా నికి సంభవించే విపరిణామాల గురించి తెలిసే అవకాశం లేదు. కానీ ప్రజాహితం, ప్రజాస్వామ్యం కన్నా ఎక్కువగా వారిని లాభాపేక్ష నడిపిస్తుంది.

ఇందులో ప్రయోజనాల వైరుధ్యం ఏమైనా ఉందా అనే అనుమానాలుంటే అవి వదిలించు కోండి. ఈ మీడియా సంస్థలు కూడా కార్పొరేషన్లే. దేశంలోని అతిపెద్ద కార్పొరేషన్‌ అధిపతి దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థ యజమాని కూడా. చాలా కాలంగానే ఈ ఫోర్త్‌ ఎస్టేట్‌కూ, రియల్‌ ఎస్టేట్‌కూ మధ్య ఉన్న తేడా ఏమిటో చూపలేనట్టు అయిపోయింది. కార్పొరేషన్‌ ప్రయోజనాలను కాదని పౌర ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత లోతుగా ఈ ప్రధాన స్రవంతి మీడియా తన ప్రపంచంలో కూరుకు పోయివుంది. వారి పత్రికల్లో, చానళ్లలో రైతులను రాక్షసులుగా చిత్రించడం జరుగుతోంది– ధనిక రైతులు, కేవలం పంజాబీయులు, ఖలిస్తానీలు, కపటులు, కాంగ్రెస్‌ దేశద్రోహులు, ఇట్లా ఎన్నో రకాలుగా ఎంతో ప్రతిభావంతంగా చూపుతూనేవున్నారు.కాకపోతే ఈ పెద్ద మీడియా సంస్థల సంపా దకీయాలు భిన్నమైన ఎత్తుగడ అనుసరిస్తాయి. మొసలి కన్నీళ్లు కారుస్తాయి. ప్రభుత్వం ఈ విష యంలో మరింత మెరుగ్గా వ్యవహరించాల్సిందని చెబుతాయి. రైతుల మేలు కోరి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వ ఆర్థికవేత్తలు, ప్రధానమంత్రి తెచ్చిన ఈ చట్టాలు చాలా అవసరం, ఆచరించదగ్గవని చెబుతాయి.

కానీ అవన్నీ వేసుకోని ఒక ప్రశ్న: ఇప్పుడే ఎందుకు? కార్మిక చట్టాలు కూడా ఇంత హడా వుడిగా ఎందుకు ముందుకు తెచ్చారు? ఎంతో శ్రద్ధ చూపాల్సిన వేయి అంశాలుండగా ఈ కోవిడ్‌ మహ మ్మారి సంక్షోభ సమయమే ఈ చట్టాలను తేవడా నికి ఎందుకు అనువైన సమయమని బీజేపీ భావిం చింది? కోవిడ్‌ వల్ల తీవ్రంగా దెబ్బతిని, చలనం కోల్పోయివున్న రైతులు, కార్మికులు ఏ రకంగానూ అర్థవంతమైన నిరసన చేయలేరని వాళ్ల అంచనా. కాబట్టి, ఇదే సరైన సమయం. అంటే సమూల సంస్కరణలను ముందుకు జరిపే ‘రెండో 1991 క్షణాన్ని’ వాళ్లు దర్శించారు. మంచి సంక్షోభాన్ని అస్సలు వృథా చేయొద్దని వాళ్లకు తెలుసు.2018 నవంబరులో లక్ష మందికి పైగా రైతులు ఢిల్లీలోని పార్లమెంట్‌ దగ్గర స్వామినాథన్‌ నివేదిక సిఫారసులను అమలు చేయాలని నిరసనకు దిగారు. అందులోని ముఖ్యాంశాలైన రుణమాఫీ, కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందులో కేవలం పంజాబ్‌ రైతులే లేరు, 22 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రైతులు ఉన్నారు.ఇప్పుడు కూడా ప్రభుత్వం ఊహించినదానికి భిన్నంగా రైతులు తమ(మన) హక్కుల కోసం నిలబడ్డారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యవ సాయచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

– పి..సాయినాథ్
( వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయుడు; పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా వ్యవస్థాపక సంపాదకుడు )