కర్షకుల వద్దకు కేసీఆర్ వెళ్లలేదేం?

607

నాడు రైతుదీక్షకు మద్దతుగా సర్కారీ మద్దతు
నేడు ఢిల్లీకి వెళ్లినా కర్షక నేతలను కలవని కేసీఆర్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఎప్పటిమాదిరిగానే విక్రమార్కుడు భేతాళుడిని తన భుజంపై మోసుకుని శ్మశానం వైపు అడుగులేస్తున్నాడు. మధ్యలో భేతాళుడు, రాజా.. నీకు విసుగులేకుండా ఓ కథ చెబుతా విను. సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని రొటీన్ హెచ్చరిక చేస్తాడు. అందుకు నవ్విన విక్రమార్కుడు.. సరే ఇదంతా మనిద్దరికీ రోజూ ఉండే పంచాయితీనే కదా.. ఓకే.. అయితే.. షురూ చెయ్ అంటాడు. వెంటనే అందుకున్న  భేతాళుడు… ఈ కథ  రొటీన్‌కు భిన్నం. అందుకే ముందు ఇంట్రడ్యూసింగ్‌గా ఓ లీడ్ చెబుతా.. ఆ తర్వాత నా ప్రశ్నలుంటాయి. ఓకేనా? అంటాడు. జారిపోతున్న విగ్గును సరిచేసుకుంటూ, ‘అయితే ఓకే’ అంటాడు విక్రమార్కుడు.  భేతాళుడు నోరు విప్పడం ప్రారంభించాడు.

మోదీ సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇది కార్పొరేట్లకు కొమ్ముకాసే చట్టాలని కన్నెర్ర చేశారు. ఢిల్లీకి చేరిన రైతుల ఆందోళనకు, పార్టీ పరంగా మద్దతు ప్రకటించారు. అటు సర్కారు పరంగానూ బంద్‌కు పిలుపునిచ్చారు. దానితో పోలీసుల పర్యవేక్షణలోనే బందు చేయించారు. షాపులు మూయని వారిపై తెరాస కార్యకర్తలు దాదాగిరి చేసి, షట్టర్లు మూయించారు. ఆ సందర్భంగా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎవరైనా ప్రజాజీవనానికి ఆటంకం కలిగించినా, బెదిరించినా వారిపై సెవెన్ ఆఫ్ వన్ క్రిమినల్ అమైండ్‌మెంట్ యాక్ట్, ఐపిసి 341 లాంటి కేసులు నమోదు చేస్తుంటారు. ప్రతిపక్షాలు బందుకు పిలుపునిచ్చిన సందర్భాల్లో ఇలాంటి కేసులే నమోదుచేస్తారు.

కానీ… సర్కారు వారే బందుకు పిలుపునిచ్చి, పోలీసులే సహకరించినందున ఎవరిపైనా కేసులు పెట్టలేదు. అది వేరే విషయం. ఇక కోవిద్ సమయంలో భౌతికదూరం, మాస్కులు ధరించాలన్న నిబంధనలను తెరాస ఆందోళనకారులెవరూ ఖాతరు చేయలేదు. అదొక విచిత్రం. ఎంతయినా చేతిలో అధికారంలో ఉన్న పార్టీ కదా?… భేతాళుడిని భారంగా మోస్తున్న విక్రమార్కుడు కొద్దిగా అనీజీగా కదిలాడు.  రైతు చట్టాలపై ఇంత ప్రేమానురాగాలు, మోదీ తీసుకువచ్చిన ఆ చట్టాలపై ఆ స్థాయి వ్యతిరేకత వ్యక్తం చేసిన కేసీఆర్,  ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ గడ్డకట్టే చలిలోనూ ధర్నా చేస్తున్న కర్షకులను, వారి నేతలనూ కలసి  సంఘీభావం ప్రకటిస్తారని అంతా భావించారు. మెదడున్న ఎవరయినా అలాగే అంచనా వేస్తారు. ఎందుకంటే, వారి ధర్నాకు పార్టీ- ప్రభుత్వ పరంగా మద్దతు ప్రకటించారు కాబట్టి!  కానీ విచిత్రంగా.. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్, రైతు నేతలను మినహా ప్రధాని-కేంద్రమంత్రులు కలసి విస్మయ పరిచారు.

అదొక్కటే కాదు… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ, అంతకుముందు మోదీ సర్కారు విధానాలపై బహిరంగంగానే దునుమానాడారు. వరద సాయం కోరితే మోదీ 13 పైసలు  కూడా ఇవ్వలేదని, ఇచ్చినదంతా తానేనని చెప్పారు. ‘నేను ఢిల్లీకి వెళ్లకుండా బీజేపీ కుట్ర చేస్తోంది. వరద సాయం చేస్తుంటే కిరికిరి పెడుతున్నరు నాకొడుకులు. ఒకడు పత్రం రాస్తడు. తర్వాత రాయలేదంటడు’ అని బీజేపీపై కేసీఆర్ పేల్చిన మాటల తూటాలు అందరికీ ఎరుకే.

source:andhrajyothi (paperclipping)

తనయుడు తారకరాముడు కూడా  ఒంటికాలిపై లేచి బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘  మోదీ నవాజ్‌షరీఫ్‌తో బిర్యానీ తినలేదా? ఇక్కడ మతం నిప్పు అంటించి వెళుతున్నారు. ఇక్కడి బిర్యానీ, ఇరానీ చాయ్ బాగుంటుంది. అది తిని వెళ్లండి. మేం కొత్త సచివాలయం కడితే వాళ్లకు సమస్య. కానీ వాళ్లు కొత్త పార్లమెంటు భవనం కట్టలేదా?’  అంటూ కేటీఆర్ కూడా భాజపాపై అగ్గిరాముడయ్యారు. ఎన్నికల తర్వాత హైదరాబాద్ వేదికగా,  కేసీఆర్.. బీజేపీ-కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా  భే టీకి సన్నాహాలు చేశారు. దానిని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తే, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి.. తనకు కేసీఆర్ ఫోన్ చేశారని ధృవీకరించారు. వింటున్నావా రాజా… అని విక్రమార్కుడిని భేతాళుడు అప్రమత్తం చేశాడు.

మరి ఇంత జరిగిన తర్వాత.. కేసీఆర్ అండ్ కో ఫైర్ చూసిన తర్వాత  .. బంద్ సందర్భంగా  బీజేపీపై,  తెరాసీయుల యుద్ధకాండ అనుభవించిన తర్వాత కూడా, ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ రైతు నేతలను కలవకుండా ఉంటారని ఎలా భావిస్తారు? ఆయన వారి వద్దకు వెళ్లి, సమస్య పరిష్కారమయ్యేంత వరకూ మీ వెంటే ఉంటామని.. కేసీఆర్ మాట ఇచ్చాడంటే తలనరుక్కొనైనా అమలుచేస్తాడన్న భరోసా వారికి ఇస్తారనే కదా ఆశిస్తారు? మీ కోసం రాష్ట్రం మొత్తాన్ని బందు పెట్టిన మేం,  మీ సమస్యల కోసం దన్నుగా నిలవలేమా? మోదీ సర్కారుపై మీరు చేస్తున్న యుద్ధంలో సైనికులం కాలేమా? అని కేసీఆర్ వారిలో తన సహజమైన యుద్ధస్ఫూర్తిని నింపుతారని కదా అందరి అంచనా?.. మరి ఏవీ ఆ హామీలు? ఏవీ ఆ స్పూర్తిదాయక యుద్ధ నినాదాలు?  అసలు ఢిల్లీలోనే బస చేసిన కేసీఆర్, తన బసకు కొన్ని కిలోమీటర్లే దూరంలో ఉన్న రైతుయుద్ధ క్షేత్రానికి ఎందుకు వెళ్లలేదు? ఇదీ.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న చర్చ. ఇప్పుడు చెప్పు రాజా.. నీకు ఇందులో ఏం అర్ధమయింది?

అవును. నిజమే కదా? అసలు ఇందులో ప్రశ్న ఏముంది? ఆన్సర్లన్నీ నువ్వే చెబుతున్నావు కదా.. అని ఎదురు ప్రశ్నించాడు విక్రమార్క. అందుకు ఓ పిచ్చినవ్వు నవ్విన భేతాళుడు… ఓరి నా పిచ్చిరాజా.. గ్రేటర్ ఎన్నికల ముందు అన్ని తిట్లు తిట్టిపోసిన కేసీఆర్, ఇప్పుడు వెంటనే మోదీజీని ఎందుకు కలిశాడు?  అలా కలవడం వల్ల రాంగ్ మెసేజ్ పోతుంది కదా? అసలు లోపల ఆయన ఏం మాట్లాడి ఉంటారు? మీడియాలో వస్తున్నట్లు ఆయనేమైనా మోదీకి సరెండరయ్యారా? అంత అవసరం ఏం ఉంటుందంటావ్? అక్కడి దాకా వెళ్లిన ఆయన రైతుల వద్దకు ఎందుకు వెళ్లలేదు? ఇవి కదా నీ బుర్ర నుంచి రావల్సిన జవాబులు? అంటూ భేతాళుడు, విక్రమార్కుడి నడ్డి మీద ఒక్కటిచ్చుకుంటాడు.  రాజా.. నైట్‌డ్యూటీ వల్ల నీకు నిద్రరొస్తే అలా సరదాగా ప్యారడైజ్ దాకా వెళ్లి చాయ్ తాగొద్దాం పద అన్నాడు భేతాళుడు.

దాంతో ఈలోకంలో వచ్చి పడిన విక్రమార్కుడు… నిజమే కదా సుమీ.. గ్రేటర్‌లో బీజేపీ నేతలను  ‘నాకొడుకులని’ బండ బూతులు తిట్టిన శేఖరన్న, పక్షం రోజులు కూడా కాకముందే మోదీ సాబ్‌ను కలవడం రొటీన్‌కు భిన్నమేకదా? అని బుర్ర బరుక్కునేందుకు ప్రయత్నించాడు. కాసేపు మౌనం తర్వాత.. విక్రమార్కుడు చెప్పడం ప్రారంభించాడు. కేసీఆర్ ఇప్పటివరకూ చెప్పిన ఫెడరల్ ఫ్రంట్ వగైరాలూ వర్కవుట్ కాలేదు కాబట్టి, ఆయనవన్నీ ఉత్తుత్తి అరువుపేనని కేంద్రం భావించి ఉండాలి. లేదా మోదీతో గోక్కుని భంగపడిన బాబు అండ్ అదర్స్ గతేమయిందో గ్రహించారు కాబట్టి, తత్వం బోధపడి మోదీని కలిసి ఉండాలి. గ్రేటర్ పంచాయతీ ముగిసింది కాబట్టి… బీజేపీ నేతల తిట్లకు, తాను తిట్లిన తిట్లకు బరాబరయింది కాబట్టి, ఇక మనమంతా హబ్‌సబ్ ఏక్ హై అని చెప్పడానికయినా మోదీజీని కలసి ఉండాలి. తాను ఎలాగూ హైదరాబాద్‌లో కొత్త సెక్రటేరియేట్ కడుతున్నా కాబట్టి, ఢిల్లీలో కూడా మోదీ అదే పని చేస్తున్నందున అభినందించడానికయినా అయి ఉండాలి. ఇక జనం అంటారా? తాను ఏది చెబితే దానినే గుడ్డిగా నమ్మేస్తారు. వాళ్లు ఆలోచించుకునేలోగా మళ్లీ ఏదో ఒక స్కీము కుమ్మరిస్తాం కాబట్టి, వాళ్లు ఆపనిలో ఉంటారు. అందువల్ల వాళ్ల గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు.

ఏదో పొలిటికల్‌గా కాస్త టెంపో బిల్డప్ చేయాలి కాబట్టి.. రైతుల ఆందోళనకు మద్దతుగా సర్కారీ బంద్ ఇచ్చాం. అప్పుడది వర్కవుట్ కాలేదు కాబట్టి, ఢిల్లీలో రైతు నేతలను కలిస్తే కొత్త నెత్తినెప్పి ఎందుకని, వారిని కలవలేదని అర్ధం చేసుకోవాలి. బీజేపీ బండి సంజయ్ తనను ఎన్ని తిట్లు తిట్టినా, తన జాతకం తీస్తానని హెచ్చరించినా… మోదీ సాబ్ అపాయింట్‌మెంట్ ఇచ్చినందున, ‘దేనిలెక్క దానిదే’నని గ్రహించి స్థితప్రజ్ఞత ప్రదర్శించినట్లు నాకు అర్ధమయిందని విక్రమార్కుడు  చెప్పడం ఆపాడు. దానికి తృప్తి చెందిన భేతాళుడు భుజం మీద నుంచి మాయమయ్యాడు.
ఇక్కడ నీతి ఏమిటంటే… పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేదీ’ సినిమాలో చెప్పినట్లు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మొనగాడు.