జగన్ సర్కారుపై బీజేపీ జంగ్!

246

వైసీపీకి అనుకూలమన్న సంకేతాలకు తెర
ఇక పదిరోజులకోసారి ప్రజా ఉద్యమాలు
జీవీఎల్ ఏపీ ఎంపీయేనన్న వీర్రాజు
సునీల్-సోముపై సీఎం రమేష్ ఫైర్
తెలంగాణ బీజేపీని స్ఫూర్తిగా తీసుకోవాలని మురళీధరన్ చురక
వీర్రాజుపై సునీల్ ప్రశంసల జల్లు
వాడి వేడిగా బీజేపీ సమావేశాలు
‘సూర్య’కు ప్రత్యేకం
( మార్తి సుబ్రహ్మణ్యం-9705311144)

ఏపీలో జగన్ ప్రభుత్వ వైఖరిపై తన విధానమేమిటో భారతీయ జనతా పార్టీ స్పష్టత ఇచ్చింది. తిరుపతిలో రెండురోజుల పాటు జరిగిన బీజేపీ  సమావేశాల చివరి రోజయిన చింతన్ బైఠక్‌లో.. పలువురు నేతలు, ఎంపీల సందేహాల అనంతరం,  ఆ పార్టీ జాతీయ సంఘటనా సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ.. ఆ మేరకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. తిరుపతిలో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక, భవిష్యత్తు కార్యాచరణపై కూడా సతీష్‌జీ దిశానిర్దేశం చేశారు. దానిపై ‘సూర్య’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తిరుపతిలో జరగనున్న లోక్‌సభ ఉప ఎన్నికలో,  పార్టీ విజయం సాధించేందుకు ఉన్న అన్ని మార్గాలు అన్వేషించాలని బీజేపీ తీర్మానించింది. నోటిఫికేషన్‌కు ముందునుంచే, పార్టీ అగ్రనేతలు గ్రామాల్లోకి వెళ్లి మోదీ సర్కారు విజయాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇకపై నేతలంతా తిరుపతిపైనే ఫోకస్ పెట్టాలని తీర్మానించింది.

కాగా,బీజేపీ…. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి, జగన్‌కు అనుకూలంగా ఉందన్న సంకేతాలు వెళుతున్నాయన్న విషయాన్ని,  ఎంపీ సీఎం రమేష్… చింతన్‌బైఠక్‌లో పాల్గొన్న అగ్ర నేతల దృష్టికి తీసుకువెళ్లారు.  ‘మన పార్టీ వైసీపీతో కలసి ఉందన్న సంకేతాలు వెళ్లడం పార్టీ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించేదే. ఇది పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి దీనిపై ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని’ రమేష్ బలంగా వాదించారు. ఏపీని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకోవడం లేదన్న భావన నెలకొన్నందున, దానిని నాయకత్వం తొలగించేలా సంకేతాలివ్వాలన్నారు.  ఆయన వాదనను మరికొందరు నేతలు కూడా బలపరిచారు.  దానిపై జోక్యం చేసుకున్న అధ్యక్షుడు సోము  వీర్రాజు.. మనం ప్రభుత్వాలు-పార్టీలకే  వ్యతిరేకం తప్ప, వ్యక్తులకు వ్యతిరేకం కాదని, వ్యక్తులను నిందించాల్సిన పనిలేదన్నారు.  కాబట్టి …  ఏదైనా, ‘వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలుగానే’  విమర్శించాలని సూచించారు.

అందుకు స్పందించిన సీఎం రమేష్.. మరి అదే  విధానమయితే, మీరు చంద్రబాబును ఎందుకు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ప్రశ్నించడంతో, వీర్రాజు మౌనం వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌పై తొలుత,  సోము వీర్రాజు వ్యంగ్యాస్త్రం సంధించారు.  ‘మీరు అప్పుడప్పుడు చంద్రబాబును కూడా విమర్శించాలండీ’ అనడంతో, రమేష్ ఫైర్ అయ్యారు. ‘నేను జగన్-బాబును కూడా విమర్శిస్తున్నాను’ అని అనడంతో మెత్తబడిన వీర్రాజు.. ‘నేనేదో సరదాగా అన్నానండీ’అని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సునీల్ తీరుపైనా రమేష్ ఫైర్ అయ్యారు. మధ్యలో అడ్డువచ్చిన సునీల్‌ను ఉద్దేశించి,  ‘మీరు వినడం నేర్చుకోండి’ అని రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న సతీష్‌జీ.. వైసీపీతో మనకు ఎలాంటి రాజకీయ స్నేహం లేదని, ఇకపై జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై.. ప్రతి పదిరోజులకోసారి ప్రత్యక్ష ఉద్యమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ మేరకు సమిష్టిగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైసీపీతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని, నేతలు బలంగా జనంలోకి తీసుకువెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.   వైసీపీ సర్కారుతో పోరాడుతున్న రాయలసీమ నేతల రక్షణపై పార్టీ నాయకత్వం దృష్టి సారిస్తే బాగుంటుందని, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ఆ సందర్భంగా ఆయన, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వ ర్గంపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు. అయితే అందుకు స్పందించిన రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్‌దియోథర్.. ఈ సమావేశంలో  వ్యక్తుల గురించి చర్చ వద్దని సూచించారు.

ఇక తిరుపతి ఉప ఎన్నికపై చర్చించిన సమావేశంలో, 11 మంది అభ్యర్ధులను గుర్తించామని చెప్పినప్పటికీ… వారి పేర్లను చర్చించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమయింది. కీలకమయిన చింతన్‌బైఠక్‌లో కూడా అభ్యర్ధులపై చర్చించకపోతే, ఇక ఆ భేటీకి అర్ధం ఏమి ఉంటుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. కరుణాకర్ అనే అభ్యర్ధిని ఎంపిక చేసినట్లు సమాచారం.

తర్వాత మీడియా పాత్రపై చర్చ జరిగింది. ఆ సందర్భంలో టీడీపీ, వైసీపీకి మీడియా ఉన్నందున, బీజేపీకి ప్రాధాన్యం ఉండటం  లేదని కొందరు నేతలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రభకు ఇంగ్లీష్ చానెల్, ‘వార్త’ అధినేత గిరీష్‌సంఘీ బీజేపీలోనే ఉన్నందున,  ఆ రెండు పత్రికలను  ప్రమోట్‌చేస్తే బాగుంటుందని ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి సూచించారు. అయితే దానిపై అగ్రనేతలెవరూ స్పందించలేదు. ఈ దశలో జోక్యం చేసుకున్న సునీల్‌దియోధర్…‘ మీడియా అంటే ఫోర్త్ పిల్లర్. కానీ ఇక్కడ టీడీపీకి ఒక ఫోర్త్‌పిల్లర్. వైసీపీకి ఒక ఫోర్త్‌పిల్లర్ ఉన్నాయి. కాబట్టి మనకు మీడియా అవసరం లేదు. మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లండి’ అని వ్యాఖ్యానించారు.

కాగా ఒక సందర్భంలో..  సునీల్ దియోధర్,  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పొగడ్తలతో ముంచెత్తారు. కొత్త కమిటీ ఏర్పాటులో కొత్త వారికి స్థానం కల్పించిన తీరు చూస్తే, సోము సామర్ధ్యం ఏమిటో తెలిసిపోతుందని అభినందించారు. దీనిపై పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేశారు. అసలు ఎవరికీ తెలియని వారిని ఎంపిక చేశారన్న వ్యాఖ్యలు వినిపించాయి. వెబ్‌సైట్లు, పత్రికలకు పార్టీ వ్యవహారాలు లీక్ చేయవద్దని, అవన్నీ టీడీపీ అనుకూలమైనవేనన్నారు. పార్టీ అంటే కుటుంబం లాంటిదని హితవు పలికారు.  కోర్ కమిటీ సభ్యుల జాబితాలో ఉన్న పేర్లను ప్రస్తావించిన సోము వీర్రాజు.. ఎంపీ జీవీఎల్ నరసింహారావును, విజయవాడ వాసిగా పేర్కొన్నారు.

అంతకుముందు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఇన్చార్జి, కేంద్రమంత్రి మురళీధరన్.. ఏపీ నేతలు ఉద్యమాల విషయంలో,  తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ నేతలకు చురకలు అంటించారు. దుబ్బాక నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వరకూ,  బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ ఎలా పనిచేసిందో చూసి నేర్చుకోవాలన్నారు. మొక్కుబడి ఉద్యమాలు కాకుండా, నిర్మాణాత్మక ఉద్యమాలతో  బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.