ఖాకీ టోపీలు పోయి..శాంటాక్లాజ్ వచ్చె!

731

విజయవాడలో ట్రాఫిక్ పోలీసు వైచిత్రి
టోపీలు తీసి క్రిస్మస్ వేడుకలు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

వరహాలరాజు. ఒకప్పుడు ఆయన హైదరాబాద్‌లో దమ్మున్న పోలీసోళ్లలో ఒకడు. నక్సలైట్లతో యుద్ధం చేసిన ఆజానుబాహుడయిన ఓ ఇన్‌స్పెక్టర్. ఎవరినీ ఖాతరు చేసే అధికారి కాడు. నిఖార్సయిన పోలీసు ఆఫీసర్. అయితే ఆయన అయ్యప్ప భక్తుడు. అప్పట్లో బేగంపేటలోనే ఎయిర్‌పోర్టు ఉండేది. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌గా, అక్కడ ఆయన వీఐపి డ్యూటీలో ఉన్నారు. ఆయన అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ, సఫారీలో ఉన్నారు. కాకపోతే కాళ్లకు బూట్లు వేసుకోలేదు. దీక్ష కదా? అందుకు! వరహాలరాజు అయ్యప్పమాలలో ఉన్నారని తెలిసినా, అక్కడకు వచ్చిన  ఓ ఉన్నతాధికారి, బూట్లు లేకుండా ఎలా డ్యూటీ చేస్తావని ప్రశ్నించారు. దానిని అవమానంగా భావించిన వరహాలరాజు,  సమీపంలోని షూమార్ట్‌కు వెళ్లి అప్పటికప్పుడు 12 వేలు పెట్టి బూట్లు కొన్నారు. ఇప్పుడాయన జీవించిలేరు. కానీ ఇప్పుడు ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఏసీపీ స్థాయిలో పనిచేస్తున్న  ప్రతి పోలీసు అధికారికీ, అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉన్న నాలాంటి జర్నలిస్టులకూ  ఆయన పేరు సుపరిచతం… ఇది దాదాపు పదహారేళ్ల క్రితం నాటి ముచ్చట.

ఇక వర్తమానంలోకి వద్దాం. భారతదేశం లౌకికరాజ్యం. అన్ని కులాలు, మతాలు, భాషలు అంతా సమానమే. ఇది మనం చదువుకునే పుస్తకాల్లో కనిపిస్తుంది. రాజకీయ నేతలు, పాలకుల మాటల్లో వినిపిస్తుంది. ప్రజల ద్వారా ఎన్నికయిన ప్రభుత్వాలు అధికారికంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తాయి. ఉద్యోగులయితే వారికి ప్రార్ధన కోసం కొంత సమయం వెసులుబాటు కల్పిస్తుంది. పాలకులే సర్కారు సొమ్ముతో ఇఫ్తార్ విందులిస్తున్నాయి. క్రిస్మస్  వేడుకలు కూడా అధికారికంగానే నిర్వహిస్తుంది. ఏపీ లాంటి రాష్ట్రాల్లో అయితే మసీదు, చర్చి పెద్దలకు గౌరవ వేతనాలిస్తూ వారిని గౌరవిస్తున్నాయి. కానీ,  సెమీ క్రిస్మస్ వేడుకలు, ముస్లింలకు ఇఫ్తార్ ఇచ్చినట్లు.. హిందువుల పండుగల సందర్భంగా ప్రభుత్వం,  అధికారిక కార్యక్రమాలు మాత్రం నిర్వహించిన దాఖలాలు చరిత్రలో కనిపించవు. ఎందుకంటే ఇది సెక్యులర్ దేశం కదా?!

రెండురోజుల క్రితమే.. గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని రొంపిచర్ల గ్రామంలో సర్కారు ఖర్చుతోనే, చర్చి నిర్మాణానికి శ్రమదానం చేసిన   ఉత్తర్వు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. సంతోషం. అంతకుముందు.. ప్రకాశం జిల్లా కురచిపాడు మండలం, దొనకొండ గ్రామంలో 12 వ శతాబ్దం నాటి శ్రీవల్లీ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూమిలో.. స్థానిక క్రైస్తవులు ముచ్చటపడి, చర్చి కట్టుకునేందుకు నడుం బిగించారు. అందులో శిలువలు కూడా ఏర్పాటుచేసుకున్నారు. దీనిపై స్థానికులు ప్రకాశం జిల్లా కలెక్టరు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దానిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేసిన ట్వీట్ కూడా,  సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అది ఏమయిందో ఎవరికీ తెలియదు.

తాజాగా క్రిస్మస్ సందర్భంగా.. విజయవాడ ట్రాఫిక్ పోలీసులు,  ఏకంగా తమ నెత్తిన  టోపీలు పక్కన పెట్టి, శాంటాక్లాజులు ధరించి క్రిస్మస్ వేడుకల్లో సామూహికంగా పాల్గొన్నారు. క్రిస్మస్ పాట తర్వాత, కేక్ కట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సంతోషం. క్రైస్తవుల పండుగను ఆయా మతాల వారు నిర్వహించుకోవడం ఆనందదాయకమే. అందుకు ఎవరికీ ఆక్షేపణలు అవసరం లేదు. కానీ, ఇక్కడ విచిత్రమేమింటే.. వారంతా విధి నిర్వహణలో ఉంటూ, శాంతా క్లాజులు పెట్టుకోవడం!

సహజంగా అయితే, అది ఉద్యోగుల కాండక్టు రూల్స్‌కు విరుద్ధం. యూనిఫాం సర్వీసులో ఉన్న ఎవరైనా, విధి నిర్వహణలో ఉండగా ఏ మతానికి సంబంధించిన చిహ్నాలు గానీ, ఆచారాలు గానీ పాటించకూడదు. ఒకవేళ అలా చేస్తే పోలీసు కాండక్ట్ రూల్స్ ప్రకారం వారంతా శిక్షార్హులు. మరి శాంటాక్లాజ్‌తో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న,  విజయవాడ ట్రాఫిక్ పోలీసులపై ఖాకీ బాసులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఎవరి మత విశ్వాసాలు వారు పాటించడాన్ని ఎవరూ ఆక్షేపించకూడదు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉండగానే,  క్రైస్తవ పండుగ చిహ్నాలు వాడినందున.. శబరిమలలోని అయ్యప్ప యాత్రకు వెళ్లే పోలీసులు కూడా, రేపు నలుపు దుస్తులతో అయ్యప్ప పడిపూజలో పాల్గొనవచ్చా? అన్నది ప్రశ్న. ఎందుకంటే ఇప్పటిదాకా శబరిమలకు వెళ్లే పోలీసులకు, దుస్తులు, పూజల  విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవు. అవసరమైతే సెలవు పెట్టుకోవాల్సిందే. ఈ విషయంలో ఉన్నతాధికారుల నుంచి.. అయ్యప్పమాల ధరించిన కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులకు,  అనేక అవమానాలు ఎదురయిన వార్తలు చూసినవే.

రేపు సంక్రాంతి రోజు హిందువులయిన పోలీసులు.. విజయవాడ ట్రాఫిక్ పోలీసుల మాదిరిగా, పంచెలు కట్టుకుని రోడ్డుపై దేవుడి పటాలకు పూజలు చేస్తే.. పోలీసులు బాసులు ఇప్పటిమాదిరిగానే,  మౌనంగా ఉంటారా అన్నది మరో ప్రశ్న.
అంతేనా.. ఏ రంజాన్ రోజునో, ఏ బక్రీద్ రోజున ముస్లిములయిన  పోలీసులు.. తలపై టోపీ పెట్టుకుని, ప్రార్ధన చేస్తే ఇదే పోలీసు బాసులు అంగీకరిస్తారా?
సిక్కులు కూడా పోలీసు డ్రస్సుమీదనే, తలపై పోలీసు టోపీ పెట్టుకోకుండా, వారి సంప్రదాయం ప్రకారం తలపాగా  పెట్టుకుని, ఏ గురునానక్ జయంతో నిర్వహిస్తే పోలీసు శాఖ ఊరుకుంటుందా? అన్న ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారు? అన్ని మతాలను గౌరవించాల్సిందే. ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలూ గొప్పవే. మరి అలాంటప్పుడు కొన్ని మతాలకే మినహాయింపులెందుకో?