జర్నలిస్టు నేతలూ..సిగ్గుపడండి!

379

కరోనా పేరుతో జీతాలకు కోత
మరి జర్నలిస్టు నేతలు ఏం చేస్తున్నారు?
మంత్రి నాని చెప్పింది నిజమే కదా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఆయన మిగిలిన రాజకీయ నాయకులకంటే కొంత భిన్నం. మరికొంత బోళాతనం. బోలెడంత హుందాతనం.  ఏదయినా ముఖానే మాట్లాడతారు. చాలామందిలా నాన్చుడు, నసుగుడు ఉండదు. అనవసర హైప్ కనిపించదు. అందుకే ఆయనంటే చాలామందికి గౌరవం. చివరకు రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఆయనను మెచ్చుకుంటారు. ఇలాంటి లక్షణాలున్న రాజకీయ నాయకులు మనకు కొద్దిమందే తారసపడుతుంటారు. అందులో ఒకరు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని.

అంతటి శాంతస్వభావుడు, మితభాషికి సైతం జర్నలిస్టులు- వారికి నాయకత్వం వహిస్తున్న జర్నలిస్టు నేతలు-సంఘాలపై చిరాకేసింది. మరి వేయదూ..? న్యాయం చేయాల్సిన పత్రికా యాజమాన్యాలను వదిలేసి, హక్కులంటూ సర్కారుపై స్వారీ చేస్తే, చిరాకేయదూ మరి!  అసలాయనకు చిరాకు, అసహనం ఎందుకు వేసిందో ఓసారి చూద్దాం.

జర్నలిస్టులను కూడా కరోనా వారియర్లుగా గుర్తించాలని, జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులివ్వాలని కొందరు జర్నలిస్టు యూనియన్ నేతలు ఆయనను కోరారు. ఆ మేరకు కొందరు జర్నలిస్టు నేతలు మధ్య ఈ డిమాండును ప్రముఖంగా లేవెత్తుతున్నారు. పైగా.. మంత్రి నాని దన్నుతో, సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి  ఆ శాఖలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు,  ఏళ్ల తరబడి పాతకుపోయిన జర్నలిస్టు సంఘాలకు మింగుడుపడకుండా మారింది.

ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు.. జర్నలిస్టు నేతలకు చెంపపెట్టులా భావించక తప్పదు.
‘కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న జర్నలిస్టులు జీతాలివ్వని తమ యాజమాన్యాలను ఎందుకు నిలదీయలేకపోయారు? జర్నలిస్టుల కష్టాలను నేను స్వయంగా చూశా. నాకూ కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిథిలోనే పనిచేయాల్సి ఉంటుంది. నేను జర్నలిస్టులకు, యూనియన్లకు వ్యతిరేకం కాదు’- ఇవీ  మంత్రి పేర్ని చేసిన వ్యాఖ్యలు. నిజానికి పేర్ని చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన పనిలేదు. నిర్మొహమాటంగా చెప్పినా ఆయన చెప్పింది నిఖార్సయిన నిజం! అయితే జర్నలిస్టు సంఘాల డిమాండ్లలో తప్పేమీ లేదు. కరోనా సమయంలో వార్తల కోసం ప్రాణభయం లేకుండా, విధినిర్వహణ చేసిన జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తించడం ధర్మమే. అందులో చాలామంది జర్నలిస్టులు, విధినిర్వహణలో ఉంటూ కరోనాకు బలయిన వారు కూడా ఉన్నారు. అవును…ఆడు మగాడ్రా బుజ్జీ!

అయితే….. కరోనా పేరుతో అనేక పత్రికలు-చానెళ్ల యాజమాన్యాలు,  జర్నలిస్టులు- నాన్ వర్కింగ్ జర్నలిస్టుల జీతాలలో  అడ్డగోలుగా కతె్తర పెట్టాయి. పైగా దానికి ‘కరోనా కట్టింగ్స్’ అని ముద్దు పేరు కూడా పెట్టాయి. కరోనా సంక్షోభం దాటి, ఇప్పుడు సాఫీగా సాగుతున్న కాలంలో కూడా,  ఇంకా ఆయా యాజమాన్యాలు కరోనా కట్టింగ్స్‌ను విజయవంతంగా అమలుచేస్తుండటమే దారుణం.  ఇప్పుడు కరోనా వారియర్స్‌గా జర్నలిస్టులను గుర్తించాలని,  గావుకేకలు పెడుతున్న జర్నలిస్టు యూనియన్ల నేతలు కూడా.. ఆ కరోనా కట్టింగ్స్ బాధితులే కావడం మరో ఆశ్చర్యం.

సికింద్రాబాద్ కేంద్రంగా వెలువడుతున్న ఓ ఆంగ్ల-తెలుగు దినపత్రికలలో… తెలుగు దినపత్రిక కరోనా మొదలయినప్పటి నుంచీ ఇప్పటి దాకా తెరచుకోలేదు. కానీ విచిత్రంగా కరోనా కారణం చెప్పిన యాజమాన్యం, ఇంగ్లీషు పత్రిక మాత్రం యథావిధిగా నడుపుతోంది. నాటి నుంచీ  ఆ తెలుగు పత్రికలో పనిచేసే వారికి ఇస్తున్న జీతాలు నెలకు 5 వేల రూపాయలట. ఎడిషన్ సెంటర్లకు అదీ గతి లేదు. పత్రిక తెరుస్తున్నారో. మూసివేస్తారో తెలియదు. ఇన్నాళ్ల జీతాలు, పీఎఫ్‌లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు. సక్రమంగా జీతాలివ్వకుండా, పీఎఫ్‌లు ఎగ్గొడుతున్న అనేక తెలుగు దినప్రతికలపై జర్నలిస్టు సంఘాలు యుద్ధం చేసేందుకు ఎందుకు భయపడుతున్నాయి? అసలు నెలవారీ జీతాలు, పీఎఫ్‌లు చెల్లించిన వారికే ప్రభుత్వ ప్రకటనలివ్వాలని ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి చేయవు? వారికి ఉన్న మొహమాటాలేమిటి? ఇది కూడా చదవండి.. పత్రికాధిపతులకు అక్రెడిటేషన్లు ఎందుకు?

మరి ఈ అన్యాయాన్ని  నిలదీసేందుకు  జర్నలిస్టు నేతాశ్రీలకు ఫ్యాంట్లూ, షర్టులు ఎందుకు తడుస్తున్నాయ్? యాజమాన్యాలను ప్రశ్నించే దమ్ము ధైర్యం జర్నలిస్టు సంఘాలకు లేదా? ప్రభుత్వాలు  తేరగా ఉన్నాయని సర్కారుపై స్వారీ చేయడమే జర్నలిస్టు సంఘాల ప్రతాపమా?  తాము ఊడిగం చేస్తున్న యాజమాన్యాలపై హక్కుల కోసం పోరాడటం చేతకాని వారికి, ప్రభుత్వాలను నిలదీసే నైతిక అర్హత, హక్కు ఉందా? సొంత సంస్థల నుంచి వేతనాలు, లైన్ అకౌంట్లు సాధించలేని జర్నలిస్టులు, వారికి మార్గదర్శకులుగా ఉన్న యూనియన్ల మహానేతలు, ఏ ముఖం పెట్టుకుని ప్రభుత్వాలపై ఒత్తిడి చే స్తున్నాయన్నది ప్రశ్న. అక్రెడిటేషన్ కమిటీల్లో ఎవరిని వేశారు? తమను ఎందుకు వేయలేదనే చచ్చు పుచ్చు వాదనలను పక్కకుపెట్టి..  మీడియా యాజమాన్యాల నుంచి రావలసిన బకాయిలు ఇప్పిస్తేనే, జర్నలిస్టు నేతలు మొనగాళ్లవుతారు. మరి మహానేతలూ.. మీరు మొనగాళ్లేనా?