వాళ్ళంతే..మెదడ్లకే మతం రంగు పూస్తారు..!!!

0
63
World Religions Planet Earth Flower World religions - flower icon made of religious symbols and planet earth in center. Isolated vector illustration on white background.

వాళ్ళంతే, సుఖంగా సంతోషంగా ఉన్న దాన్ని దేన్నీ వదలరు. ప్రతిదానికీ మతం రంగు పూసి ఒక అనుమానాస్పదమైన, అవమానకరమైన, అసహ్యకరమైన వాతావరణం సృష్టిస్తారు. అదివారికి అలవాటు. వారి వంకర బుద్దులు అలాంటివి. అలా చేస్తేగాని వారి కండ్లు చల్లబడవు. ఈ మాటలు ఊరికే అనడం లేదు. ఉదాహరణకు మనం ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. మనుషులకు కులాల్ని, వర్గాల్ని, వర్ణాల్ని అంటగట్టి సంతోషకర సామాజిక జీవనాన్ని నిచ్చెనమెట్ల వ్యవస్థగా దిగజార్చారు కదా? దేశంలోని అధిక సంఖ్యాకుల్ని బానిసలుగా మార్చారు కదా? చదువు నేర్పకుండా, తెలివి మీరకుండా చేశారు కదా? అదే మా సంస్కృతి, అదే మా సంప్రదాయం అని చంకలు గుద్దుకున్నారు కదా? ఇకచాలు పక్కకు జరగండి.

ఆలోచనా పరులైన యువతీ యువకులు మీ తప్పిదాల్ని సమీక్షించుకుంటున్నారు. జంతువులకు, వృక్షాలకు దైవత్వాన్ని అంటగట్టి, మనుషుల్ని నీచులుగా, పాపులుగా ముద్రవేసిన మీరు – ఇక తప్పదు,పక్కకు తొలగాల్సిందే. ప్రగతిశీల భావాలతో ఈ తరం యువతీ యువకులు దూసుకొస్తున్నారు. సాహిత్యానికి వేదమని, పురాణమని, భగవంతుని బోధ అనీ, సనాతన చరిత్ర అనీ మూఢత్వాన్ని అంటగట్టారు. ఏం అవి జీవితాల్ని చైతన్యవంతం చేసి, కాలం విలువను గ్రహింపజేసి, మానవుడి ఔన్నత్యాన్ని పెంపొందించాయా? ‘దౌర్బాగ్యులారా.. ఆపై వాణ్ణి నమ్ముకుంటూ బతకండిరా’ – అంటూ మనిషి గౌరవాన్ని దిగజార్చాయి తప్పితే, ఎప్పుడైనా, ఎక్కడైనా మానవీయ విలువల్ని, నైతికతను పెంపొందించాయా?

వ్యాయామానికి యోగా అని, ప్రాణాయామమని, కుండలి అని, తపస్సనీ పేర్లు పెడతారు. ఇందులో కొన్ని వ్యాయామాలైతే, మరికొన్ని కండ్లు మూసుకుని భ్రమల్లో తేలమని చెప్పేవి. మరికొన్ని విశ్రాంతిగా నిద్రపోయేవి. వేల వేల సంవత్సరాలుగా తపస్సు చేసినవారు ఈ దేశంలో ఉంటే, వారు ప్రజలకు ఉపయోగపడే జీవన సూత్రంగాని, సిద్ధాంతంగాని ఎందుకు చెప్పలేకపోయారు. పనికొచ్చే పరికరమేదీ ఎందుకు తయారు చేయలేకపోయారు. ఉపయోగించే ఉపకరణమేదీ తయారు చేయలేని వారి ఊకదంపుడు బోధనలు – ఎవరిక్కావాలీ? ఎందుక్కావాలీ?

కుటుంబ సమేతంగా వెళ్ళి ప్రకృతి అందాల్ని ఆస్వాదించే విహార స్థలాలకు అంటే కొండలకు, కోనలకు, గుట్టలకు, మిట్టలకు, నదీ తీరాలకు, సముద్ర తీరాలకు – తీర్థ స్థలాలని, మఠాలని, పీఠాలని, దర్శనీయ స్థలాలకు – పేర్లు మార్చి జనాన్ని ఏ మార్చారు కదా? చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడనీయకుండా ఏదో ఓ దేవుడి పేరు చెప్పి,మనసులో కోర్కెల చిట్టా పెట్టి, మనుషుల కాలాన్ని,శక్తిని, సామర్థ్యాన్ని మొత్తానికి మొత్తంగా జీవితాల్ని ఎంత వృధా చేశారో అంచనా వేయగలరా? ఆరోగ్యకరమైన భోజనానికి శాఖాహారమని, మాంసాహారమని సాత్వికమని, తామసమనీ పేర్లు పెట్టి విడగొట్టారు. జనాన్ని విడగొట్టినట్టే ఆహారాన్ని కూడా విడగొట్టారు. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్ల గురించిన పరిజ్ఞానం వీరిలో ఎందుకు లేదూ? అని మనం ఆలోచించాలి. జనంలో ద్వేషం పెంచి, ఘర్షణలు జరిపించడానికి వీరు ఆహారాన్ని కూడా వదలరు. ఒక్కోచోట దానికి ‘ప్రసాదం’ అని పేరు పెడతారు. అది తిన్నవారికి ఎవరికైనా రోగాలు మాయమై ఆరోగ్యం చేకూరిందా? మూఢ విశ్వాసాలు బలపడటానికి పనికొచ్చింది తప్ప – ఎవరికీ ఎప్పుడూ మేలు జరగలేదు. ప్రసాదం పేరుతో పెట్టే ఆ కొంచెం – ఆకలిని ప్రేరేపిస్తుందే తప్ప, ఆకలి తీర్చదు.

వాళ్ళంతే – మెదడ్లకే మతం రంగు పూస్తారు. వీరి తెలివి తేటలు ఏ స్థాయిలో ఉంటాయంటే బయటి దేశాల నుంచి వచ్చిన విజ్ఞానాన్నంతా వాడుకుంటారు. అన్ని శాస్త్ర సాంకేతిక పరికరాలు ఇతరుల కంటే వీరే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. పైగా, ఇవన్నీ తమ ముత్తాత – ముత్తాతల కాలంలోనే వాళ్ళవాళ్ళు కనిపెట్టారని ప్రగల్భాలు పలుకుతారు. ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో ఉన్నవాళ్ళకు తమ ‘సంజీవని’ తెచ్చి ఎందుకు ప్రాణం పోయరు? దేభ్యం ముఖాలేసుకుని ఎందుకు వైద్యుల మీద ఆధారపడతారూ? దయచేసి విజ్ఞాన శాస్త్రాన్ని మంత్ర తంత్రాలకు మారకం వేయకండిరా బాబూ!

మీ పిట్టల దొర కోతలు ఆపి, వాస్తవాలు అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోండి! చివరకు ఈ దేశాన్ని నాలుగు చేతులున్న ఓ వింతమాతగా భ్రమించుకున్నారు కదా? లేనిదేవుడికి, అంటే మీ భ్రమల్లో ఊహించుకున్న దేవుడికి భజనలు చేస్తున్నారంటేనే మీకు నిజాయితీ లేదని తేలిపోతుంది కదా? ఇక మీరు నీతి గురించి ఏం మాట్లాడతారు? అబద్ధాన్ని నిజం అనేవాడికి నీతి, నిజాయితీ ఉన్నట్టు ఎలా అవుతుందీ? దబాయింపులు కాదిక్కడ కావల్సింది. ఓపిగ్గా, వివరంగా, అర్థవంతంగా తగిన కారణాలు, ఆధారాలు చూపి, మంచి మాటలతో చెప్పి ఒప్పించాలిరా బాబూ! అది మీతో కానప్పుడు, ఎదుటివారు చెపుతున్న దాంట్లో సహేతుకతమైంది ఏమైనా ఉందా? – అనైనా ఆలోచించాలి.ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఈ దేశవాసులే. ఇందులో ఎవరూ ఎక్కువాకాదు. ఎవరూ తక్కువా కాదు. మానవ జాతి అంతా ఒకటేనన్న స్పృహ లేని వాళ్ళు, మానవ శ్రేయస్సు గురించి ఏం మాట్లాడతారూ?

హిందుత్వ రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి తాజ్‌మహల్‌పై జరిగిన రాద్ధాంతం ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే బాబ్రీమసీదు వివాదం పాతబడిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువడింది. ఆ జడ్జిని వెంటనే తీసుకెళ్ళి తమ రాజ్యసభ మెంబరుగా కూర్చోబెట్టుకున్నారు. ఇక ఆ అంశం మీద ఓట్లు అడిగితే అబ్బే – బాగుండదు. జనానికి కూడా ఆ విషయం మొహం మొత్తింది. కాబట్టి వారికి ‘హిందువుల్ని మభ్యపెట్టడానికి ఎప్పటికప్పుడు ఓ కొత్త వివాదం కావాలి. ఒక విషయంలో హిందుత్వవాదుల్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే జనాన్ని అబద్దాలతో నమ్మించడం ఎలాగో వారికి మాత్రమే తెలుసు. బాబ్రీమసీదు కాకపోతే మరొకటి వారి అబద్దాల భాండాగారంలోంచి ఎప్పటికప్పుడు ఒక కొత్త విషయం బయటికి తీస్తారు. తాజ్‌మహల్‌ వివాదమే కాదు, కాశీ, మధుర, వారణాసి, హైదరాబాదు లాంటి చోట్ల కూడా వివాదాలు సిద్ధం చేసుకున్నారు. సమయానుకూలంగా వాటిని బయటికి తీస్తారు.

హైదరాబాద్‌లో చార్మినార్‌ను ఆనుకుని భాగ్యలక్ష్మి గుడి ఉంది. ఇటీవల దేశ హౌంమంత్రి వచ్చి పూజలు చేసి పోయిన గుడి! భారీపోలీసు బందోబస్తు మధ్య ముస్లిం ప్రాంతమైన చార్మినారు దగ్గరికి సాహసోపేతంగా వెళ్ళారు. జనం పట్టే అవకాశం లేని వారాసిగూడ ఇరుకు సందుల్లో రథయాత్ర చేసి, మహానగరమంతా తనకు ఘనస్వాగతం చెప్పిందని మురిసిపోయారు. 2012లో ఈ భాగ్యలక్ష్మిగుడి వివాదం వెలుగులోకి వచ్చింది.”అక్కడ చార్మినార్‌ కట్టకముందు నుంచే గుడి ఉంది. దాన్ని ఆక్రమించే చార్మినార్‌ కట్టారు. అందువల్ల అక్రమంగాకట్టిన చార్మినార్‌ని కూల్చేయాలి.

భాగ్యలక్ష్మి గుడి విస్తరణ చేపట్టాలి” అన్నది వారి వాదన. దానిమీద టెలివిజన్‌ చానళ్ళు కొన్ని రోజులు చర్చలు పెట్టాయి. పత్రికలు కూడా ఆ విషయం ప్రముఖంగా ప్రచురించాయి. ఈ రాద్దాంతాలకు ‘ద హిందూ’ ఇంగ్లీషుదినపత్రిక అడ్డుకట్ట వేసింది. నూటయాభై సంవత్సరాల చరిత్ర గల హిందూ దినపత్రిక తన ఆర్కివ్స్‌లోంచి చార్మినార్‌కి సంబంధించిన పాత ఫొటోల్ని ప్రచురించింది. దానితో తెలిసిందేమంటే1962కు ముందు ఉన్న ఏ ఫొటోలో కూడా చార్మినార్‌ను ఆనుకుని ఏ నిర్మాణమూ లేదు. 1962 తర్వాతే, ఓ చిన్న రాతి శిల్పంతో మొదలై క్రమ క్రమంగా పెరిగి, ఎలా విస్తరింస్తూ వచ్చిందో చూపే విధంగా వివిధ కాలాలలో తీసిన ఫొటోల్ని 2012 నవంబర్‌ 20నాడు ఫ్రంట్‌ పేజీలో ‘ద హిందూ’ దినపత్రిక ప్రచురించింది.

మహ్మద్‌ కులీ కుతుబ్‌షాపరిపాలనా కాలంలో చార్మినార్‌ 1591లో నిర్మాణమైన కట్టడం. అంటే 430 సంవత్సరాల క్రితం కట్టింది. ఇండో ఇస్లామిక్‌ ఆర్కిటెక్ట్‌ అయిన మీర్‌ మోమిన్‌ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. గ్రానైట్‌, సున్నపురాళ్ళతో సుమారు 160ఫీట్ల ఎత్తున ఉన్న ఈ కట్టడం, మక్కా మసీద్‌ సమీపంలో ఉంది. దీనికి పశ్చిమాన లాడ్‌ బజార్‌ ఉంది. చార్‌మీనార్‌ అంటే నాలుగు స్తంభాలు కట్టడానికి పైన, నలువైపులా నాలుగు ఎత్తయిన స్తంభాలు పైకిలేచి ఉండడం మనం చూస్తాం. ఇది సర్వే ఆఫ్‌ ఇండియా వారి పర్యవేక్షణలో ఉంది. ప్రస్థుతం చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి గుడి సర్వే ఆఫ్‌ ఇండియా పర్యవేక్షణలో లేదు. అసలు జరిగిందేమంటే – 1960లో చార్మినార్‌ పక్కన ఒక ప్రతిమను పెట్టారు. అంటే, చార్మినార్‌ నిర్మాణం అయిన తర్వాత 370 సంవత్సరాలకు అక్కడ ఒక పత్రిమను పెట్టి, నీడ కోసం రేకులు వేశారు. కాలక్రమంలో దాన్ని విస్తరిస్తూ, అభివృద్ధి చేస్తూ వచ్చారు.

1960కి ముందు అక్కడ హిందూ దేవాలయమేదీ లేదని హైదరాబాదుకు చెందిన చరిత్రకారుడు నరేంద్ర లూథర్‌ రాశారు. పరమత సహనం ఉన్నందువల్లనే అక్కడ ఆ గుడి అభివృద్ధి కాగలిగిందని ఆయన అన్నారు. అందుకు మరొక ఉదాహరణ కూడా ఉంది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న తెలంగాణ హైకోర్టు భవనం ఆవరణలో కూడా ఒక చిన్న దేవాలయం ఉంది. నిజాం కాలం నుంచే ఉంది. దాన్ని అక్కడి నుంచి కదిలించగూడదని నిజాం రాజు చెప్పడంతో, అది ఇప్పటికీ అక్కడ అలాగే ఉంది. అంటే మత సహనానికి ఇలాంటివి ఉదాహరణలుగా నిలుస్తున్నాయన్నది గ్రహించాలి. ప్రజల్లో మత విశ్వాసాలు రెచ్చగొట్టడానికి ఎవరూ వీటిని ఇంత వరకు ఉపయోగించుకోలేదు. ఆ మాటకొస్తే మతాలన్నీ వదిలేయ దగ్గవే. మానవ ప్రగతికి అవి అవరోధాలుగా ఉన్నాయి. మళ్ళీ అది వేరే విషయం.

మైనార్టీలకు చెందిన ముస్లిం పార్టీ తమ ఆత్మరక్షణ కోసం రెచ్చపోయి మాట్లాడితే, మెజార్టీలో ఉన్న హిందుత్వ పార్టీ అధికార బలంతో అహంకారంతో మాట్లాడుతుంది. సామాన్య జనానికి ఈ రెండు ధోరణులు ప్రమాదమైనవే. ఇవి భావోద్వేగాలతో చెలగాట మాడటమే తప్ప, సమాజ ప్రగతికి పనికొచ్చేవి ఎంత మాత్రమూ కావు. వాళ్ళంతే! దేన్నీ సక్రమంగా ఉండనీయరు. దేశంలో నగరాల పేర్లన్నీ మార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదు పేరు భాగ్యనగర్‌గా మార్చుతామంటున్నారు. అభివృద్ధి గురించి, నిధుల గురించి, వారి అండదండలతో బ్యాంకులు దోచుకుపోయిన వారి గూర్చి, వారి ఆశీర్వాదంతో ఆగడాలకు పాల్పడుతున్న బాబాలు, స్వాముల గూర్చి వీరు పొరపాటున కూడా మాట్లాడరు. ప్రభుత్వ సంస్థల్నే కాదు, ఏకంగా దేశాన్నే అమ్మడానికి సిద్ధపడుతున్నారు ”బీజేపీ ఒక రాజకీయపార్టీ కాదు, గుండా గుంపుల కేంద్రం.

చదువు మధ్యలో వదిలేసిన అజ్ఞానుల బ్రెయిన్‌ వాష్‌ చేయబడ్డ మూర్ఖుల సంస్థ” అని ప్రశంసించింది ఎవరో కాదు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మార్కండేయ ఖట్జూ.. నమ్మకాలు, విశ్వాసాలు, మనోభావాల పేరుతో మూఢత్వాన్ని ప్రోత్సహించేవారు ఏమతస్తులైనా సరే – వారు సామాన్యులైనా, సంపన్నులైనా, మతాధిపతులైనా, మంత్రులయినా… ఆర్టికల్‌ 51ఎ(హెచ్‌) ప్రకారం అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది! సామాజికంగా అది ప్రజలను వంచించడమే అవుతుంది! మనిషిని మంచి మార్గంలో నడిపించడానికి దేశంలో, ప్రపంచంలో ఇన్ని మతాలు, వేల వేల దేవుళ్ళు నిజంగానే కాచుకుని ఉన్నారని – ఊరికే అనుకుందాం.. ఒక క్షణం – అయితే మరి రోజూ ఇనిన్ని నేరాలు – ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయీ? సమీక్షించకునే పని లేదా? ఆలోచించుకునే పనిలేదా?

– డాక్టర్‌ దేవరాజు మహారాజు (వ్యాసకర్త:సుప్రసిద్ధ సాహితీవేత్త,జీవశాస్త్రవేత్త.)