వీర్రాజుపై జిల్లా అధ్యక్షుల తిరుగుబాటు?

471

పెత్తనానికి వ్యతిరేకంగా జాతీయ అధ్యక్షుడికి ఫిర్యాదులు?
పంచాయితీలతో జిల్లా ప్రధాన కార్యదర్శుల ప్రకటన వాయిదా?
వారు లేకుండానే రాష్ట్ర కార్యవర్గ భేటీ
          ( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పనితీరుపై ఆ పార్టీకి చెందిన కొంతమంది జిల్లా అధ్యక్షులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారా? జిల్లా అధ్యక్షులను డమ్మీలుగా మార్చి, తనకు నచ్చిన వారిని జిల్లా ప్రధాన కార్యదర్శులుగా  వేస్తున్నారన్న ఫిర్యాదులు ఢిల్లీ దాకా చేరాయా? అందుకే ముందే వెలువడాల్సిన ప్రధాన కార్యదర్శుల ప్రకటన నిలిచిపోయిందా? మొత్తంగా జిల్లా ప్రధాన కార్యదర్శులు లేకుండానే తొలి రాష్ట్ర కార్యవర్గ భేటీ జరగబోతోందా?… ఇటీవల జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే, ఇలాంటి అనుమానాలకు అవుననే జవాబు వస్తుంది.  ఇది కూడా చదవండి… వీర్రాజు తీరుపై జిల్లా అధ్యక్షుల వీరంగం

సహజంగా ఏ పార్టీలోనయినా,  జిల్లా కమిటీల వ్యవహారం ఆయా జిల్లా పార్టీనే చూసుకుంటుంది. బీజేపీలో కూడా ఇదే సంప్రదాయం చాలా కాలం నుంచి కొనసాగుతోంది. జిల్లా ప్రధాన కార్యదర్శులతో సహా, అన్ని పదవులను జిల్లా అధ్యక్షులే ఖరారు చేస్తారు. కానీ, దానికి సోము వీర్రాజు వచ్చిన తర్వాత బ్రేకు పడిందని జిల్లా నేతలు మండిపడుతున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సహా అన్ని పోస్టులకు ఆరుగురు చొప్పున పేర్లు తమకు పంపితే, అందులో కొందరి పేర్లను తామే ఖరారు చేసి ప్రకటిస్తామన్న,  కొత్త నాయకత్వ వింత వైఖరి జిల్లా అధ్యక్షులను ఖంగుతినిపించిందట. ఇప్పటివరకూ ఎంతోమంది రాష్ట్ర అధ్యక్షులుగా చేసినా, ఎవరూ ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అదీకాకుండా.. జిల్లా అధ్యక్షులు సూచించిన పేర్లు కాదని, రాష్ట్ర నాయకత్వమే తమ జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడంపై,  జిల్లా అధ్యక్షులంతా అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. ఈ అంశాన్ని వారు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారు. అందరినీ ఆయనే నియమిస్తే ఇక మేం ఎందుకు? జిల్లా, మండలాల్లో పార్టీ కార్యక్రమాలు కూడా ఆయననే చేసుకోమని జిల్లా నేతలు కన్నెర్ర చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ.. తమను ఉత్సవ విగ్రహాలను చేసి, వీర్రాజు జిల్లాల్లో సమాంతర వ్యవస్థ నడిపించేందుకు వేసిన ఎత్తుగడగా నిర్థారించుకున్నారు.  ప్రస్తుత అధ్యక్షులంతా గత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హయాంలో ఎన్నికయినందుకే, కొత్త నాయకత్వం ఈ దొడ్డిదారి విధానాలకు శ్రీకారం చుట్టిందని జిల్లా నేతలు అనుమానిస్తున్నారు.

దీనితో పలువురు జిల్లా అధ్యక్షులు.. ఒంటెత్తు పోకడలతో గందరగోళ పరిస్థితి సృష్టిస్తున్నారంటూ సోము వీర్రాజుపై,  జాతీయ పార్టీ అధ్యక్షుడు నద్దాకు ఫిర్యాదు చేసినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది ప్రముఖులతో కలసి రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూర్చుని, జిల్లాల్లో తమ వర్గం వారిని ప్రధాన కార్యదర్శులుగా నియమించుకునేందుకు, జాబితా రూపొందించారని తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు.

తమ పనిలో జోక్యం చేసుకుంటున్న ఆయనను నియంత్రించి, తమకు స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం కల్పించాలని వారు మొరపెట్టుకున్నారట. ‘మేము మండల అధ్యక్షులతో ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షులం. ఆయన మాదిరిగా నియమించబడిన అధ్యక్షులం కాదు కాబట్టి,  మాకు స్వేచ్ఛ కల్పించండి’ అని తమ ఫిర్యాదులో పేర్కొన్నారట. రాష్ట్ర పార్టీ ఇన్చార్జి, జాతీయ పార్టీ సంఘటనా కార్యదర్శులకూ ఫిర్యాదు చేసిన ట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఈ ఫిర్యాదు అందిన తర్వాతనే.. జిల్లా ప్రధాన కార్యదర్శుల  ప్రకటన నిలిచిపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశానికి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కూడా హాజరుకావాల్సి ఉంటుందని, ఈసారి వారు లేకుండానే తొలిసారి కార్యవర్గ భేటీ జరగడం విశేషమని పార్టీ నేతలు చెబుతున్నారు.  కాగా.. సూర్య’ వెబ్‌సైట్‌లో వచ్చిన ‘ జిల్లా అధ్యక్షుల వీరంగం’ కథనంపై,  కాకినాడ పార్లమెంటు జిల్లాకు చెందిన వీర్రాజు వర్గీయులు కొందరు ఫోన్లలో వీరంగం వేశారు. అయినా ఈ ఉడత ఊపులు, పిల్లి శాపనార్ధాలకు ‘సూర్య’ బెదిరేది లేదు. అదిరేది లేదు.