‘గ్రేటర్’లో పారిన కమల ‘పంచ’ తంత్రం!

429

విజయోత్సాహం కొనసాగిండం కత్తిమీద సాము
అభ్యర్థుల ఎంపిక లోపాలతో 20 స్థానాలు నష్టం
ఫిర్యాదుల పంచాయతీతో ఇంకా నష్టం
పరాజితులకు మళ్లీ  పార్టీ పదవులిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అబ్బో టీఆర్‌ఎస్ హవాను తట్టుకోవడం కష్టం. బీజేపీకి మహా వస్తే 12 సీట్లు రావచ్చు..
బీజేపీ ఊపు కొంచెం పెరిగింది. కాబట్టి దానికి ఓ 18 సీట్లు రావచ్చు..
ఎవరిని అడిగినా బీజేపీనే అంటున్నారు. కాబట్టి ఓ 30 వరకూ రావచ్చు..
-ఇదీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి,  పోలింగ్ వరకూ సాగిన వివిధ వర్గాలు, జర్నలిస్టులు, సర్వే సంస్థల అభిప్రాయం. కానీ అందరి అంచనాలను వెక్కిరిస్తూ .. ఆ పార్టీ అర్ధసెంచరీకి చేరువయి, ఒక్క సంఖ్యతో దానిని చేజార్చుకుంది.
మరి ఇంత అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ.. ఆ సమరోత్సాహాన్ని మళ్లీ ఎన్నికలకు వరకూ కొనసాగిస్తుందా? అలాంటి పరిస్థితి సృష్టిస్తుందా? అందుకు పరిస్థితులు, నాయకులు సహకరిస్తారా? అన్నదే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ముందున్న అతి పెద్ద ప్రశ్న.

నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాంటి అంచనాలు లేకుండానే యుద్ధక్షేత్రంలోకి దిగిన బీజేపీని.. విజయలక్ష్మి సమీపం వరకూ తీసుకువెళ్లిన ఘనత, నిస్సందేహంగా ఆ పార్టీ సారథి బండి సంజయ్‌దే. అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడున్నట్లు.. సంజయ్‌కు జత చేరిన మరో ఎంపి ధర్మపురి అర్వింద్ పేల్చిన మాటల తూటాలు కూడా, కమల వికాసానికి మరో కారణం. వీరిద్దరూ టీఆర్‌ఎస్ శిబిరం ముందు..  గుండె ధైర్యంతో ఎదరునిలిచిన ఫలితమే, గ్రేటర్‌లో అసాధ్యమనుకున్న కమలవికాసం!

ఇక కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తన ఇలాకాలో కమలాన్ని వికసింపచేయకపోయినా, అభ్యర్ధులకు అన్ని వనరులూ సమకూర్చి, యుద్ధానికి సన్నద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన మరో రెండు నెలల ముందే కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసి ఉంటే, తన ఇలాకాలో మరిన్ని సీట్లు సాధించేవారు. ఇక మరో జాతీయ నేత డాక్టర్  కోవా లక్ష్మణ్ ఇంట గెలిచారు. సీటు రాని నేతల ఇళ్లకు వెళ్లి వారి అలక మాన్పించి, యుద్ధానికి సిద్ధం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావుదీ ఈ విజయంలో కీలకపాత్రనే. సొంత వనరులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అమిత్‌షా ప్రచారసభల్లో సందడి, ఏర్పాట్లు అన్నీ ఆయనవే. టీడీపీ నుంచి వచ్చిన ఆయనతో నడిచిన ద్వితీయ స్థాయి నేతలకు, టికెట్లు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు. అయితే వారు ఓడినప్పటికీ, తనతో నడిచిన వారికి న్యాయం చేసిన నేతగా మిగిలారు. ఈరకంగా పంచపాండవుల ‘పంచ’తంత్రం,  గ్రేటర్‌లో బీజేపీని గెలుపుబాట పట్టించింది.

అయితే.. అనూహ్యమైన ఈ విజయాన్ని ఒడిసి పట్టుకుని, మళ్లీ ఎన్నికల వరకూ దానిని కొనసాగించడమే ఆ పార్టీ నాయకత్వానికి కత్తిమీద సాము. కాంగ్రెస్-టీడీపీ బలహీన పడిన విషాదం, టీఆర్‌ఎస్ అభ్యర్ధుల లోపాలను సద్వినియోగం చేసుకున్నందుకే, బీజేపీ ఇంత భారీ విజయం నమోదు చేసుకుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. కార్పొరేటర్లలో చాలామంది మహిళలున్నా, పెత్తనమంతా వారి భర్తలయిన నేతలదే. ఇప్పటికే నగరంలో చాలామంది కార్పొరేటర్లపై ప్రజల్లో ఏహ్యభావం ఏర్పడింది. ఇళ్ల నిర్మాణాల్లో ప్రజలను పీల్చి పిప్పి చేయడమే దానికి కారణం. అందుకు బీజేపీ కూడా మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే అలాంటి వసూళ్ల విషయంలో, బీజేపీ కూడా ఒకటి-రెండు స్థానాల్లో ఉంటుంది. ఇది కొన్నేళ్ల నుంచీ విజయవంతంగా కొనసాగుతున్న ప్రక్రియనే.  ఆ వసూళ్లు, బెదిరింపుల ప్రభావం మళ్ల కొనసాగితే.. అది రానున్న ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్ధులపై చూపించడం ఖాయం. కాబట్టి.. కొత్త కార్పొరేటర్ల నియంత్రణపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ఇక నగరంలో కొన్నాళ్ల నుంచి కొత్తగా తెరపైకొస్తున్న  ఫ్లెక్సీ లీడర్ల వల్ల పార్టీ నేతలు నష్టపోయే ప్రమాదం వచ్చిందన్న ఆందోళన పెరుగుతోంది. కింది స్ధాయిలో పనిచేయకుండా, అగ్రనాయకుల చుట్టూ తిరిగి, వారి ఇళ్ల చుట్టూ ఫ్లెక్సీలు కట్టి.. సన్మానాలు చేసే బ్యాచ్‌ల బుట్టలో అగ్రనేతలు పడిపోతున్న తీరుపై నేతల్లో అలజడి మొదలయింది. ఈ ఫ్లెక్సీ బ్యాచ్ కింది స్థాయిలో పనిచేయకుండా, నిరంతరం అగ్ర నేతల చుట్టూ తిరగడమే పనిగా పెట్టుకుందని చెబుతున్నారు. ‘స్థానికంగా ఓ నలుగురితో ఏదైనా కార్యక్రమం చేయడం, దానిని స్థానిక పత్రికలకు ఇవ్వడం, పత్రికల్లో యాడ్స్, ఫ్లెక్సీ, సన్మానాలు చేయడమే ఈ బ్యాచ్ ఆర్ట్. ఇలా తమను కలిసేవాళ్లంతా పెద్ద నేతలనుకుని,  మా పార్టీ అగ్రనేతలు వారి మాయలో పడుతున్నారు. అసలు ఈ బ్యాచ్‌కు లోకల్‌గా ఎంత పేరుందో ఎవరూ ఆలోచించడం లేద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఇక ఎన్నికలయిన తర్వాత ఫిర్యాదుల పర్వానికి తెరలేచింది. ఇది స్థానికంగా పార్టీకి శిరోభారంగా మారింది. అభ్యర్ధులు తమ ఓటమికి తగిన కారణాలు అన్వేషించకుండా, ఫలానా నేత పనిచేయకపోవడం వల్లనే ఓడాము కాబట్టి, వారిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్లు పార్టీకి మరింత నష్టం తెచ్చేవే. అభ్యర్ధుల ఎంపికలో స్థానిక కార్యకర్తలను సంప్రదించకుండా, ఒత్తిళ్లు-సిఫార్సుల మేరకు ఎంపిక చేయడం నాయకత్వం తప్పు. మెజారిటీ కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా చేసే ఎంపికలెప్పుడూ, ఫలితాల్లో ఇలాంటి చేదు వార్తలే మిగుల్చుతాయి.

పైగా… ఇతర పార్టీల నుంచి చేరి సీట్లు తెచ్చుకున్న అభ్యర్ధులు, తొలి నుంచి పార్టీకి పనిచేస్తున్న నేతలపై ఫిర్యాదు చేయడాన్ని బీజేపీ శ్రేణులు సహించలేకపోతున్నారు. అసలు  సరైన అభ్యర్ధులను ఎంపిక చేయనందుకే, దాదాపు 20 సీట్లు నష్టపోయిందన్నది నేతల వాదన.  ఇటీవలే పార్టీలో చేరిన వాళ్లకు తమపై ఫిర్యాదు చేసే నైతిక హక్కు లేదన్నది, తొలి నుంచీ పార్టీకి పనిచేస్తున్న వారి వాదన. పార్టీలు మారే వారి మాటకు నాయకత్వం ప్రాధాన్యం ఇస్తే, తొలి నుంచి అంటిపెట్టుకుని ఉన్న కార్యకర్తలను అవమానించినట్లేనని, అగ్ర నేతల ముందే కుండబద్దలు కొడుతున్నారు.

‘వాళ్లు ఎటు గాలి వీస్తే ఆ పార్టీలో చేరుతుంటారు. కానీ మేం పార్టీ స్థాపించిన నాటి నుంచీ పార్టీ మారకుండా పనిచేస్తున్నాం. అలాంటిది నాయకత్వం మాకు విలువిస్తుందా? లేక పార్టీ మార్చి టికెట్లు తీసుకున్న వారి ఫిర్యాదులకు విలువిస్తుందా’ అని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇలాంటి ఫిర్యాదుల పంచాయితీ నగరమంతా కనిపిస్తోంది. ఓడిన అభ్యర్ధుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తే..  వచ్చే ఎన్నికల్లో, ఆరోపణలకు గురయిన పార్టీ నేతలు పనిచేయడం కష్టమే. ఎందుకంటే అందరితో పనిచేయించుకోవడం, అప్పుడు అభ్యర్ధులకు కత్తిమీద సామే అవుతుంది.

ఇప్పుడు మళ్లీ పార్టీలో పదవుల పంచాయతీ మొదలయింది. ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులు-వారి భర్తలు,  పార్టీ పదవులు కూడా తమకే ఇవ్వాలని డిమాండ్ చేయటం కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన వారికి, మశ్లీ పార్టీ పదవులు ఎలా ఇస్తారన్నది టికెట్లు రాని నేతల వాదన. ఇలాగయితే తాము పార్టీకి పనిచేయడం మానేసి, వ్యాపారులు చేసుకుంటామని ఖరాఖండీగా చెబుతున్నారు. టికెట్లు రాని వారికే పార్టీ పదవులిచ్చి న్యాయం చేయాలి తప్ప, ఓడిన వారికి మళ్లీ పదవులివ్వడమేమిటి? టికెట్లు తీసుకున్న వాళ్లు పదవులు లేకుండా  ఉండలేరా?  అని నిలదీస్తున్నారు. ఇది అద్భుత విజయం సాధించిన గ్రేటర్‌లో, ఆ పార్టీకి అపస్వరంలా మారింది.