వీర్రాజు తీరుపై జిల్లా అధ్యక్షుల వీరంగం

1
109

జిల్లా అధ్యక్షులకు తెలియకుండానే రాష్ట్ర కమిటీలు
సమాంతర నేతలను తయారుచేస్తారా?
జిల్లా పదవులపై సోము పెత్తనమేంటి?
 సమావేశంలో అధ్యక్షుడిని స్టాండప్ అంటారా?
ఏపీ జిల్లా కమలదళాల కన్నెర్ర
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘జిల్లా సమన్వయ కమిటీ, జిల్లా కమిటీలను మీరు ప్రకటిస్తే ఇక మేం ఎందుకు? మా జిల్లాల్లో పార్టీ పనికూడా వచ్చి మీరే చేయండి’
‘ ఒక జిల్లా అధ్యక్షుడిని పట్టుకుని అందరి ఎదుట స్టాండప్ అంటారా? సస్పెండ్ చేస్తా అంటారా? ఇదేనా అధ్యక్షుడి తీరు?’ ఇట్లాంటి అధ్యక్షుడిని మేం ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు’
‘ మాకు తెలియకుండానే మా జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ కార్యవర్గంలోకి ఏవిధంగా తీసుకుంటారు? ఇక ఇలాగైతే మాకు విలువేం ఉంటుంది? ఇప్పటివరకూ పనిచేసిన ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వ్యవహరించలేదు. పాత అధ్యక్షుల విలువేమిటో మాకు ఇప్పుడు తెలిసొస్తోంది’
‘ పొద్దున ఒకటి చెబుతారు. రాత్రి ఇంకోటి చెబుతారు? ఒక కార్యక్రమం పూర్తి కాకుండానే మరో కార్యక్రమం ఇస్తారు. అసలు అధ్యక్షుడికి ఏమయింది?’
‘సంఘటనా కార్యదర్శి ఉత్సవ విగ్రహంలా ఉన్నారే తప్ప, నోరు విప్పి మాట్లాడరు. ఏదీ సీరియస్‌గా తీసుకోరు. జిల్లా అధ్యక్షులకు సమాంతర వ్యవస్థ నడిపిస్తుంటే ఆయన అసలు పట్టించుకోరేం?’
– ఇదీ.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై,  జిల్లా పార్టీ అధ్యక్షుల రుసరుసలు. జిల్లా కమిటీలలో కూడా ఆయన పెత్తనమేమిటన్నది ఇప్పుడు జిల్లా నేతల ఆగ్రహం.

జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు, సిపార్సులు, మనోగతంతో సంబంధం లేకుండానే రాష్ట్ర కార్యవర్గ సభ్యులను తీసుకున్న సోము వీర్రాజు నిర్ణయంపై.. బీజేపీలో తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు పార్టీకి పనిచేయనివారు, ఆసుపత్రుల్లో కాంపౌండర్లు, వయో వృద్ధులను రాష్ట్ర కమిటీలో తీసుకున్న వీర్రాజు పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారన్న ప్రశ్నలు, జిల్లా అధ్యక్షుల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల సిఫార్సులను పక్కకుపెట్టి… తాను కొంతమందితో ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక వ్యవస్థ ఇచ్చిన జాబితాను, వీర్రాజు ఆమోదించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా తర్వాత ఇప్పటివరకూ 83 కార్యక్రమాలు జరిగాయని, అందులో పాల్గొనని, ప్రభావం చూపని వారిని కూడా రాష్ట్ర కమిటీలో తీసుకోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.

ఇక ఇటీవల కాకినాడ జిల్లా పార్టీ సమావేశంలో,  వీర్రాజు వ్యవహారశైలి పార్టీలో చర్చనీయాంశమయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిని స్టాండప్ అని అరుస్తూ, ‘నిన్ను తలచుకుంటే సస్పెండ్ చేయగలను. కానీ చేయను. నీ చేతనే నా మనుషులతో పనిచేయిస్తా’ అనడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాను సూచించిన జిల్లా సమన్వయ కమిటీ సభ్యులను ప్రకటించాలని, సభలోనే వీర్రాజు జిల్లా అధ్యక్షుడిని ఆదేశించారు. అయితే, అది నిబంధనలకు విరుద్ధమని, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ దానికి అంగీకరిస్తే… ఇప్పుడే ప్రకటిస్తానని సదరు అధ్యక్షుడు సుత్తిమెత్తగా చురకలు అంటించారట. ‘అన్నీ మీరే ప్రకటిస్తే ఇక మేం ఎందుకు? పార్టీ కార్యక్రమాలు కూడా మీరే చేసుకోండి’ అని అగ్గిరాముడయ్యారట. అందుకు ఆగ్రహించిన వీర్రాజు.. నా మనుషులతో పనిచేయిస్తానని జవాబిచ్చారట.

ఈ విషయం తెలిసిన జిల్లా అధ్యక్షులంతా,  వీర్రాజు ఒంటెత్తు పోకడపై విరుచుకుపడుతున్నారట. తమకు తెలియకుండానే, తమ జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులను  ప్రకటించిన సోము వీర్రాజు.. ఇప్పుడు జిల్లా కమిటీలను తానే ప్రకటిస్తానని చెప్పడంతో,  తిరగబడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక్కో పదవికి ఆరుగురి పేర్లు చొప్పున పంపిస్తే, తానే వారిని ప్రకటిస్తానని వీర్రాజు చెప్పడాన్ని జిల్లా అధ్యక్షులు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారట. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీ నుంచి సస్పెండయిన తెనాలికి చెందిన ఓ నాయకుడిని అడ్డు పెట్టుకుని, అనేక కార్యక్రమాలు నడిపిస్తున్నారన్న  వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

1 COMMENT

  1. This is all YSRCP game plan. Somu veerraju is YSRC nominated person as BJP state president. Like they’re demolishing other constitutional bodies they are destroying BJP also in AP state. Whatever Vijaya Sai reddy says, veerraju says the same as a parrot.