‘వ్యవసాయ’ విన్యాసాలు చూడతరమా…

0
25

కోరస్ కలిపిన పార్టీలే కదం తొక్కుతున్న వైచిత్రి
గళం మార్చిన పవార్, కేజ్రీవాల్, జగన్, బాబు
తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్టూన్ల యుద్ధం
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

మన రాజకీయ పార్టీలకు రైతులపై టన్నుల కొద్దీ పొంగుకువస్తున్న ప్రేమానురాగాలు చూస్తుంటే.. రైతులంటే వారికి ఇంత  సానుభూతి ఉందా అనిపిస్తుంది. పాపం రైతన్నలు కూడా రాజకీయ పార్టీలు తమ పట్ల ప్రదర్శిస్తున్న మద్దతు, సానుభూతి చూసి మురిసిముక్కలవుతున్నాడు. అంతా కట్టకట్టుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి, దేశమంతా బందు పెట్టినందుకు పాపం ఆ పిచ్చి మారాజులు,  తమ జన్మధన్యమయిందనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు తమకు దన్నుగా ఉన్న ఇవే పార్టీలు.. కొద్దికాలం క్రితం కొత్త చట్టం తెచ్చిన సర్కారుకు, పార్లమెంటు సాక్షిగా సాగిలబడ్డాయన్న నిజాన్ని,  నిలకడమీద గానీ తెలుసుకోలేకపోయారు. నరేంద్రమోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై.. వివిధ రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తే,  ఊసరవెల్లి కూడా సిగ్గుపడక తప్పదేమో?

మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు.. బీజేపీ వాదిస్తున్నట్లు  రైతులకు మేలు చేయవచ్చు. అదే సమయంలో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతు ప్రయోజనాలను అంబానీ- అదానీలకు తాకట్టుపెట్టేలా ఉండవచ్చు. ఎవరి కోణం వారిది. ఎవరి వాదన వారిది. కాబట్టి ఎవరి కోణంలో వారిదే రైటనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారంతా ఏ సమస్యలయినా తమ కళ్లతో చూసి, తమ మెదడుతో ఆలోచిస్తారు కాబట్టి! అయితే.. ఆయా అంశాలపై మొదట వినిపించిన వాణి, ఆ తర్వాత సమయానుకూలంగా మారి,  అవకాశవాద మలుపు తీసుకోవడమే అభ్యంతరం, అనైతికం.  ఒక అంశంపై ప్రాంతీయ-జాతీయ పార్టీలన్నీ నిర్లజ్జగా యూటర్ను తీసుకోవడమే రోత. దేశ ప్రజలంతా చూస్తుండగా, బిల్లుకు మద్దతునిచ్చిన అవే స్వరాలు.. బయటకొచ్చి రంగుమార్చి, అందుకు భిన్నంగా గళమెత్తడమే ఇప్పటి (అ)రాజకీయం!

ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు.. ఆమ్ ఆద్మీ, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలన్నీ సమర్ధించాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే.. బీజేపీ కంటే ఎక్కువగా బిల్లును సమర్థించారు. బిల్లును సమర్ధించని వారంతా దళారీనన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి బిల్లు తీసుకురావలసిన అవసరం ఉందని  సమర్ధించారు. టీడీపీ దానికి కొన్ని సవరణలు చేసింది. మద్దతుధర, కార్పొరేట్ల పెత్తనంతో వచ్చే నష్టం, కాంట్రాక్టు ఫార్మింగు వల్ల రైతులకొచ్చే నష్టం వంటి అంశాలను ప్రస్తావించింది. కానీ  బిల్లును మాత్రం వ్యతిరేకించలేదు.

 ఇప్పుడు మాట మార్చిన వైసీపీ స్వరాన్ని, విజయసాయిరెడ్డి ప్రసంగాలతో కలిపి టీడీపీ మీడియాకు విడుదల చేసింది. ఆ రకంగా ఏపీకి సంబంధించినంత వరకూ,  రెండు ప్రధాన పార్టీలు బిల్లును సమర్ధించాయి. కాకపోతే.. తాము బిల్లుకు సవరణలు ప్రతిపాదించామని వాదించేందుకు,  టీడీపీ ఒక వెసులుబాటు కల్పించుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా బిల్లును సమర్ధించాయి. ఒక్క  టీఆర్‌ఎస్ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా అది రైతులకు మద్దతుగానే రోడ్డెక్కింది. అయితే రైతులకు మద్దతుపై టీఆర్‌ఎస్ వైఖరిని విమర్శిస్తూ బీజేపీ.. ఎన్డీఏ రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ, టీఆర్‌ఎస్…  సోషల్‌మీడియా వేదికగా సంధించుకుంటున్న కార్టూన్ల యుద్ధం ఆసక్తికలిగిస్తోంది.

తాజాగా  రైతులు రోడ్డెక్కి, ఢిల్లీని ముట్టడించిన అంశంపై అగ్గిరాజుకుంది. దీనితో బీజేపీ మినహా అన్ని పార్టీలూ,  తమ మనుగడ కోసం  రైతుల వెంట నడవటం అనివార్యమయింది. ఫలితంగా మంగళవారం భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో, బీజేపీ మినహా అన్ని పార్టీలూ దానికి మద్దతునివ్వక తప్పని పరిస్థితి. విచిత్రమేమిటంటే… యుపిఏ హయాంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న శరద్‌పవార్..  వ్యవసాయంలో చట్టాలు, సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ మేరకు ఆయన  ఢిల్లీ-మధ్యప్రదేశ్ సీఎం లయిన షీలాదీక్షిత్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖలు కూడా రాశారు. ఇప్పుడు ఆయన పార్టీ కూడా, రైతు ఉద్యమానికి మద్దతునివ్వడం విస్మయకరం. అయితే, తాను ఆ లేఖ రాసిన మాట నిజమేనని ఇప్పుడు అంగీకరించడం కొంత నయం.ఇప్పుడు రైతు సమస్యపై గత్తర చేస్తున్న పంజాబ్ కిసాన్ యూనియన్.. 2008లో దళారుల వల్ల తమకు మద్దతుధర లభించడం లేదని, తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం కార్పొరేట్లకు ఇవ్వాలని నానా యాగీ చేసింది. ఆ మేరకు ప్రతి ఏటా  కేంద్రానికి లేఖ రాస్తూనే ఉంది.  ఆ తర్వాత చాలా ఏళ్లకు మోదీ సర్కారు రైతుచట్టం తెచ్చింది. కానీ విచిత్రంగా అదే పంజాబ్ కిసాన్ యూనియన్,  ఇప్పుడు రోడ్డెక్కిన రైతులకు నాయకత్వం వహిస్తోంది. తాను కోరిన రైతుచట్టాన్నే తెచ్చిన మోదీ సర్కారును దునుమాడుతోంది. ఇక పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతునిచ్చిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులకు అన్నపానీయాలు సమకూరుస్తోంది.  ఇది అవసరార్ధ రాజకీయాలకు పరాకాష్ఠ కాదా?ఇక పార్లమెంటులో బేషరతుగా బిల్లు ఆమోదించిన వైసీపీ…ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పక్షానే బంద్‌కు మద్దతునివ్వడం, అప్పుడు పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించకుండా ఉన్న టీడీపీ కూడా,  రైతన్నకు మద్దతునివ్వడం రోత రాజకీయాలకు పరాకాష్ఠ. అన్నట్లు.. ఓవైపు వైసీపీ ఈ బిల్లును ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే, ఆ పార్టీకి చెందిన నేత పొట్లూరి మాత్రం.. బ్రహ్మాండంగా ఉన్న బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని, ట్వీట్ చేయడం మరో ట్విస్టు.
చిరాఖరుగా బీజేపీ కూడా వ్యవసాయంపై రాష్ట్రానికో రకంగా స్పందించడం మరో వైచిత్రి. రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉప్పత్తులు అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నార. కానీ అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాత్రం తన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులెవరయినా వచ్చి అముకునేందుకు ప్రయత్నిస్తే వారి లారీలు జప్తు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించడం.. బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.  ఈవిధంగా.. వ్యవసాయ బిల్లులో,  రాజకీయ పార్టీల విన్యాసాలు చూసిన వారికెవరికయినా.. ‘స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న’ గిరీశం ఉపదేశం గుర్తుకురావడం ఖాయం!