పరకాల సత్యాన్వేషణ..రాజధాని విషాదం!

906

(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ఒక రాష్ట్రం కళ్లు తెరిచి ఆరున్నరేళ్లవుతోంది.  అర్థరాత్రి పార్లమెంటు తలుపులు మూసి.. తెలుగు ప్రజ తలపులు పట్టించుకోకుండా.. విభజిత రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన విభజనకూ అంతే వయస్సు.  ఇంతవరకూ దానికంటూ ఒక రాజధాని నగరం లేని దౌర్భాగ్యం. ఆ విషాదాన్ని   సొంతం చేసుకున్న ఆంధప్రదేశ్ ప్రజల దురదృష్టానికి కారణాలు.. ఇకపై ఏం చేయాలో  ఆలోచించాలనే ‘స్పృహ లాంటి చైతన్యం’ కలిగించేందుకు తొలిసారిగా ఓ ప్రయత్నం.  ఈ దుస్థితి నాకే ఎందుకన్న ఆలోచన, సగటు ఆంధ్రుడిలో జనింపచేసే ఓ పెను సంకల్పం. కలసి వెరసి..  ప్రభుత్వ మాజీ సలహాదారయిన డాక్టర్ పరకాల ప్రభాకర్  ఆవేదనాభరిత హృదయం నుంచి ఆవిష్కృతమయినదే ‘రాజధాని విషాదం’.

అమరావతి రాజధాని పూర్వ- ప్రస్తుత స్థితిగతులు, ప్రజాభిప్రాయం-నేతల అంతరంగాలను గుదిగుచ్చి,  ఓ గంటసేపు రూపొందించిన డాక్యుమెంటరీ  చూసిన వారికెవరికయినా.. ‘అమరావతి అంత విషాదంలో ఉందా’ అనిపించక మానదు. అందుకే దానికి పరకాల ‘రాజధాని విషాదం’ అని పేరు పెట్టారేమో?! నిజానికి ఆ డాక్యుమెంటరీ చూపిన వాస్తవ దృశ్యాలు కూడా,   ఆ పేరుకు తగినట్లుగానే ఉంది. దానిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారాయన. మంచిదే. విషాదం-సంతోషం దాచిపెట్టుకోకూడదు. అవి పదుగురితో పంచుకోవలసినవి కదా!

అసలు అమరావతిలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది? ఇకపై  ఏం జరగబోతోంది? ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా భూములిచ్చి గాయపడిన రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయి? రాజకీయ-రైతుసంఘాల నాయకుల మనసులో మాటేమిటన్న ప్రశ్నలను, పరకాల తనతో అమరావతి వరకూ  కారులో వెంటపెట్టుకుని వెళ్లినట్లు కనిపించింది. అది ఒక సత్యాన్వేషి  ప్రయత్నంగానే అనిపించింది.

ప్రధాని మోదీ దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి-నీటిని హోమంలో వేసిన ప్రాంత పరిసరాలను చూపిన ప్రభాకర్.. మళ్లీ అలనాటి అమరావతి నగర భూమిపూజ హడావిడి దృశ్యాలను జ్ఞప్తికి తెచ్చారు. అప్పటి ఆ సంరంభంలో ఆయన కూడా ఒక భాగస్వామి కాగా.. మాలాంటి జర్నలిస్టులంతా సాక్షులం. పరకాల ‘రాజధాని విషాదం’ చూడగానే, తొలుత స్ఫురణకు వచ్చినవి ఆ దృశ్యాలే.

పార్లమెంటులో నాటి కాంగ్రెస్ దర్శకత్వంలో, బీజేపీ సహ నిర్మాణంలో జరిగిన రాష్ట్ర విభజన నుంచి.. నేటి మూడు రాజధానుల అగమ్యగోచర పరిస్థితులను, పరకాల చాలా సహనంతో దృశ్యంగా మార్చడం అభినందనీయమే. హైదరాబాద్ టు అమరావతి వరకూ సాగిన పరకాల ‘రాజధాని విషాద ’ యాత్రలో.. ఉండవల్లి అరుణ్‌కుమార్, అంబటి రాంబాబు, ఐవైఆర్ కృష్ణారావు, వర్ల రామయ్య, ఇంకా రైతులు, సామాజికవేత్తల మనోగతాన్నీ ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ మధ్యలోనే నాటి అధికార టీడీపీ- నేటి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ అగ్రనేతలిద్దరి వైఖరినీ ప్రజల ముందుంచారు.

అసలు ప్రభుత్వాలు మారినా,  అమరావతి తలరాత మారకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నలు సంధించిన పరకాల.. వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తే, ఆయన ప్రయత్నానికి సంపూర్ణత్వం చేకూరేది. ప్రజల ఆవేదన, రైతుల ఆందోళన, ప్రధానంగా మూడుపంటలు పండే భూములిచ్చిన తాము.. ‘పెయిడ్ ఆర్టిస్టులనే బిరుదు’ పొందుతున్న విషాదం.. రాజకీయ నేతల అనుకూల-వ్యతిరేక వాదనలు, ప్రస్తుత శిధిలావస్థలో ఉన్న అమరావతి కట్టడాలు, వాటి భవిష్యత్తు.. వీటికి మించి… ఎంతో ఆసక్తితో, ‘జగన్ ప్రవచిత దక్షిణాప్రికా రాజధానుల’ కథేమిటో తెలుసుకోవాలన్న సంకల్పం..  అక్కడి ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూ.. ఇవన్నీ విభజిత ఆంధ్రప్రదేశ్ విషాదంపై పరకాలకు ఉన్న సానుభూతిని బహిర్గతం చేశాయి.

రాజధాని కోసం రైతులు-ప్రజలు పడుతున్న ఆవేదనలో పాలుపంచుకుని, వాటిని ప్రపంచానికి చాటిన పరకాల ప్రయత్నం స్వాగతించదగ్గదే. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రయత్నం, ఆలోచన ఇంతవరకూ ఎవరూ చేయలేదు కాబట్టి! అయితే.. ఇప్పటి అమరావతి విషాదానికి, పరిష్కారం కూడా సూచిస్తే ఇంకా బాగుండేది. పైగా.. అలనాటి అమరావతి రాజధాని ప్రయత్నంలో,  పరకాల ప్రభుత్వపరంగా ఓ భాగస్వామి కూడా.  అందుకే ఆయన మస్తిష్కం నుంచి జాలువారిన ఈ ప్రయత్నంపై సహజంగా ఎక్కువ అంచనాలుంటాయి. కాబట్టి.. నాటి తెరవెనుక కథలు, గాథలు కూడా ఆవిష్కరిస్తే బాగుండేదనిపించింది.

రాజధాని విషాదం’ ప్రశ్నలు.. ఆవేదన.. వాదన.. విమర్శ.. చరిత్రకే పరిమితం అయిందనిపించింది. చివరకు ఉండవల్లి వంటి నేతలు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి మేధావులు కూడా,  అమరావతిని విషాదం నుంచి తప్పించేందుకు ఏం చేయాలో చెప్పలేకపోవడం కనిపించింది. ఇక పరకాల గళం.. అందులోని తెలుగుతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. అమరావతి విషాదం గురించి అరటిపండు వలిచినట్లు దృశ్యకావ్యం ఇచ్చారు. నిష్ణాతులయిన సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంలో.. ఈ డాక్యుమెంటరీకి నిండుతనం వచ్చింది. అంతా బాగుంది. కానీ అమరావతి విషాదాన్ని ఎంతో శ్రమించి, దృశ్యంగా అందించిన పరకాల.. దానిని హైదరాబాద్‌లో కాకుండా, అదే అమరావతి ప్రాంతంలోనే ప్రివ్యూ వేసి ఉంటే,  మరింత సహజత్వం  ఉండేదన్న మాటలు అక్కడ వినిపించాయి.

ఏదేమైనా,  ఒక ప్రశ్న.. మరొక అవమానం..  ఆంధ్రుడి ఇంకొక సిగ్గుమాలిన తనం..ప్రజల చేతకాని చేవలేనితనాన్ని ‘రాజధాని విషాదం’ ధైర్యంగా ఆవిష్కరించింది. ఇందుకు తొలిసారి గజ్జె కట్టిన పరకాల ప్రభాకర్ అభినందనీయులు. సహజంగానే పరకాల దగ్గర కూర్చుంటే బోలెడన్ని విషయాలు దొరుకుతాయి. అప్పటి అనేక  అనుభవాలు గుర్తుకొస్తాయి.  ఫోన్‌లోనయినా అంతే. అయితే కావలసిందల్లా అంశమే!  అంశం బాగుందనుకుంటే అవి దొంతరలా వచ్చేస్తుంటాయి. విషయ పరిజ్ఞానానికి కొదువ లేని మేధావి అయిన పరకాల.. ఇన్నాళ్లూ అమరావతికి దూరంగా ఉంటూ కూడా, అదే ‘రాజధాని విషాదం’ గురించి ఆలోచించడం..  జన్మభూమిపై ఆయనకున్న మక్కువకు నిలువెత్తు నిదర్శనం.