హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపాం..

622

“అందరికీ హౌసింగ్” పథకం కింద అర్హుల‌ను గుర్తిస్తున్నాం
డీజీపి గౌతం స‌వాంగ్ వెల్ల‌డి

అమ‌రావ‌తి :  ‌హోంగార్డుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు వారి జీవితాల్లో వెలుగులు నింపాయ‌ని ఏపి డీజీపి గౌతం స‌వాంగ్ అన్నారు. 58వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్స‌వం సందర్భంగా డీజీపీ గౌతం సవాంగ్  మాట్లాడుతూ రాష్ట్రానికి హోంగార్డులు అద్బుతమైన నిస్వార్ధ సేవలను అందిస్తున్నారన్నారు. ఈ స్వచ్చంద సేవా సంస్థలో హోంగార్డులు భాగస్వాములై, సమాజసేవలో పోలీసులతో కలిసి పని చేయటం నిజంగా ఇదో  గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో విధులు నిర్వహించటం వారి త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుంది. స్వచ్ఛంద సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడాన్ని అభినందిస్తున్నాను. హోంగార్డుల సంక్షేమంతో పాటు వారి పిల్లల విద్యా, వైద్యం, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలను తీసుకొని అమలుచేస్తున్నామ‌ని తెలిపారు. నెలసరి భత్యం పెంపు, ప్రమాద బీమా వర్తింపుతో హోంగార్డుల జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నెలసరి భత్యం పెంపు బీమా వర్తింపు అమలు చేస్తున్న‌ట్లు చెప్పారు. హోంగార్డు సామాజిక ఆర్థిక స్థితి అనేక రెట్లు పెంచడంతోపాటు ఎన్నడూ లేని విధంగా వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. హోంగార్డుల రోజువారీ భత్యం  రూ.600 నుండి రూ.710 పెంచాం.

ప్రస్తుతం వారు గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకు భత్యం రూ.18 వేల నుంచి రూ.21,300 పొందుతున్నారు. అంత్యక్రియల ఛార్జీలు గతంలో ఉన్న రూ.1000 నుండి రూ10వేలు అందిస్తున్నాం. 15000 హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేయడం జరిగింది.  ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఆకస్మిక మరణం సంభవిస్తే రూ.30 లక్షలకు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో దీన్ని ఇంకా పెంచాలని యోచిస్తున్నాం. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం జరిగింది. హోంగార్డుల సరైన ఆరోగ్య సంరక్షణ కోసం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12005 మంది హోంగార్డులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేయబడ్డాయి. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నాం. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క హోంగార్డుకు ఈహెచ్ఎస్‌, ఆరోగ్య‌శ్రీ అందించ‌డంతో పాటు అందరికీ హౌసింగ్ ప‌థకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

హోంగార్డులు అంకితభావంతో సేవా దృక్పథంతో సగర్వంగా సమాజ సేవకు పోలీసు శాఖతో కలిసి పనిచేస్తున్నారు. వీరి సేవలను సమాజ అభివృద్ధిలో భాగంగా కష్టపడి అంకితభావంతో పనిచేయాలని వారి సేవలను ప్రజలు సమాజం ప్రభుత్వం గుర్తించింది.హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాద్యతలను సేవా భావంతో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలచినట్లు ఎటువంటి క్లిష్టమైన బాధ్యతలు అప్పగించినా పనిచేయడానికి హోంగార్డ్స్ ముందుండాలని, ప్రజాసేవయే త‌మ కర్తవ్యం అన్న విషయాన్ని నిరంత‌రం గుర్తు పెట్టుకోవాల‌ని, హోంగార్డులు తమ విధులును అంకితభావంతో మ‌రింత‌గా అందిస్తూ భ‌విష్యత్తులో అంకితభావం, సేవాధృక్పధంతో ముందుకు సాగుతూ ప్రజల మన్ననలు పొందాలని ఆశిస్తున్న‌ట్లు డీజీపీ గౌతం స‌వాంగ్ పేర్కొన్నారు.