విజయశాంతి…రెండోస్సారి!

176
vijayasanthi-suryaa.co.in

అడవిఅక్క  అద్భుతాలు సృష్టిస్తుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘మళ్లీ పుట్టింటికి తిరిగి వచ్చినట్లుంది’.. ఇలాంటి పడికట్టు, రొటీన్ ప్రకటనలు పార్టీలు మార్చిన ప్రతివారూ ఇచ్చేదే. అందుకు మాజీ హీరోయిన్ విజయశాంతి మినహాయింపేమీ కాదు. ఒకప్పుడు బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి, తర్వాత కాంగ్రెస్‌లో తీర్థం తీసుకుని, మళ్లీ ఇప్పుడు కాషాయ కండువా కప్పేసుకున్న విజయశాంతి నుంచి.. బీజేపీ నాయకత్వం ఏం అద్భుతాలు ఆశిస్తుందన్నదే కమలనాధుల  ఆశ్చర్యం.

ఆమె గతంలో కేసీఆర్ పదో చెల్లెలుగా.. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గా.. తెలంగాణ భవన్‌లో ఒక సెపరేటు గది కూడా కేటాయించుకున్న మాజీ తెరాస నాయకురాలు. అప్పట్లో కేసీఆర్‌తో పొసగక, ఆయన పొడ గిట్టక పార్టీ నుంచి బయటొకొచ్చిన వీరనారి. అప్పటికే భాజపా నుంచి వ చ్చిన ఆమె.. మచ్చుటగా తన మూడవ అడుగు కాంగ్రెస్‌లో వేశారు. రాహుల్‌బాబు సమక్షంలో పారీ కండువా వేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ప్రచార కమిటీకి ఆమెనే నాయకురాలు. ఇదీ క్లుప్తంగా విజయశాంతి గురించి అందరిటీ తెలిసిన ఇంట్రడక్షన్.

మరి ఆమె సేవలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాడుకుందా అంటే లేదనే  చెప్పాలి. విజయశాంతి హీరోయిన్ అయినా.. తెరపై హీరోలకున్న ఇమేజ్ సాధించిన లేడీ హీరో. కాబట్టి సహజంగా హీరోలకుండే ఇగో, ఇతర గోరోజనాలన్నీ ఆమెకూ ఉంటాయి. తమను తాము హీరోలతోనే పోల్చుకుంటారు. సహజంగా సినిమా హీరోయిన్, సెలబ్రిటీ తమకు తాము ఎక్కువగానే ఊహించుకుంటారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ ఇలాంటి వారిని చరిత్రలో చాలామందిని చూసింది కాబట్టి,  విజయశాంతిని కూడా లైట్ తీసుకుంది. అప్పటికీ అలిగిన ఆమెను ఏ ఢిల్లీ వాలాలో అప్పుడప్పుడు బుజ్జగిస్తుంటారు. ఆ రకంగా ఆమె ఇగోను చల్లబరిచి, పని అయిపోయిందనిపిస్తారు.

మరి ఇప్పుడు అలాంటి విజయశాంతి,  ‘రెండోస్సారి’ విజయవంతంగా కమల తీర్ధం పుచ్చుకున్నారు. దుబ్బాక నుంచి మొదలైన బీజేపీ విజయయాత్ర.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొనసాగినందున, ఆ ఊపును కొనసాగించేందుకు రాములమ్మ చేరిక కొంతవరకూ, ఇతర పార్టీల నేతల చేరికకు స్ఫూర్తిదాయకం కావచ్చు. కానీ.. ఇప్పుడు విజయశాంతితో బీజేపీకి వచ్చే అదనపు లాభమేమిటన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. గతంలో ఆమెను విద్యాసాగర్‌రావు పార్టీలో చేర్పించారు. బీజేవైఎంలో ఆమెకు జాతీయ హోదా పదవి కూడా ఇచ్చారు. మరెందుకో ఆమె ఎక్కువకాలం కమలంలో కొనసాగలేకపోయారు. అసలు బీజేపీ తత్వం తెలుసుకోకుండానే కండువా కప్పేసుకోవడమే ఆమె చేసిన పొరపాటన్నది ఆమె అనుచరుల ఆవేదన.

ఎందుకంటే.. రేవంత్‌రెడ్డి చెప్పినట్లు… బీజేపీలో చేరికల వ్యవహారం గమ్మతుగా ఉంటుంది. తొలిరోజు వారికి నద్దా, అమిత్‌షా వంటి అగ్రనేతలే కండువా కప్పేస్తారు. అక్కడితో వారి వైభోగం ముగుస్తుంది. ఢిల్లీ నుంచి హైదరాబాదో, బెజవాడనో వచ్చిన తర్వాతనే వారికి సినిమా కష్టాలు మొదలవుతాయి. రాష్ట్ర నేతలెవరూ వారిని పట్టించుకోరు. సమాచారం ఇవ్వరు. పార్టీ ఆఫీసుకు వెళితే కనీసం కుర్చీ  కూడా ఇవ్వరు. ఉత్సాహపడి ప్రెస్‌మీట్ పెడతామంటే అనుమతించరు. దానితో పార్టీలో ఎందుకు చేరామా అని తలపట్టుకోవలసి వస్తుంది. పాపం తలుపులు వేసుకుని ఏడవటం ఒక్కటే తక్కువ!
అటు వైపు ప్రముఖులకు తమ సెలబ్రిటీ హోదా గుర్తుకువస్తుంది. ఇటేమో పార్టీ ఆఫీసులోఅటెండరు కూడా పట్టించుకోని దయనీయం. నాగం జనార్దన్‌రెడ్డి అనే సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్రంలో హవా సాగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆయన చెప్పిందే శాసనం. బాబు సర్కారులో మూడు, నాలుగవ స్థానంలో ఉండేవారు. అలాంటి నేత బీజేపీలో చేరితే, పట్టించుకున్న దిక్కు లేదు. చివరకు ప్రెస్‌కాన్ఫరెన్స్‌ను   ప్రెస్‌క్లబ్‌లో పెట్టుకోవాల్సిన దయనీయం. ఈ ఊపిరిరాడని, అవమానకర పరిస్థితికి తాళలేక, విధిలేక కాంగ్రెలో చేరాల్సి వచ్చింది.

ఇప్పుడు విజయశాంతి పార్టీలో చేరారు. ఆమె కంటే ముందుగానే… మరో సీనియర్ నటి కవిత బీజేపీలో చేరారు. ఆమెను పార్టీలో చేరాలని.. అప్పట్లో ఏపీ పార్టీ సంఘటనా కార్యదర్శిగా ఉన్న రవీంద్రరాజు, నేటి అధ్యక్షుడయిన సోమువీర్రాజు హైదరాబాద్ వచ్చి, ఆమెను కోరారు. రాష్ట్రంలో ఆమె పర్యటించడానికి, ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడయ్యారు. మరి తనకు ఇచ్చిన హామీ సంగతేమిటని కవిత ఇప్పటి అధ్యక్షుడికి ఫోన్లు చేస్తే ఆయన, ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారట. ఇప్పుడు ఆమెకు పార్టీలో ఏ హోదా లేదు. ఆమెకే కాదు. హైదరాబాద్‌లో ఉండే ఏపీ నేతలకెవరికీ పదవుల్లేవు. కానీ ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. తర్వాత కవిత కు కన్నా రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చారనుకోండి. అది వేరే విషయం.

ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరి, టిజి వెంకటేష్, సీఎం రమేష్‌ను రాష్ట్ర నాయకత్వం పట్టించుకునే దిక్కులేదు. వీరిలో సీఎం రమేష్ మాత్రమే, తన తెలివితో రాజ్యసభలో ఫ్లోర్ కోర్డినేషన్‌తో, ఇతర పార్టీలను సమన్వయం చేస్తూ, అమిత్‌షా గుడ్‌లుక్స్‌లో ఉన్నారు. అయినా ఆ ముగ్గురికీ రాష్ట్ర నాయకత్వం ఇసుమంత విలువ కూడా ఇవ్వడం లేదు. వారు మాత్రమే కాదు. టీడీ పీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని అసలు పట్టించుకునే దక్కులేదు. అందులో కమ్మవారుంటే అసలు వారిని దగ్గరకే రానీయడం లేదు. పైగా.. వారిని సస్పెండ్లు చేస్తున్న వైచిత్రి.

తెలంగాణలోనూ దాదాపు అదే పరిస్థితి. తెలుగుదేశం-కాంగ్రెస్ నుంచి చేరిన వారంతా తొలిరోజు అగ్రనేతల వద్ద నవ్వుతూ కనిపిస్తారు. ఇక రెండో రోజు నుంచీ వారికి విషాదమే. టీడీపీలో ఎంపీగా ఉన్న గరికపాటి మోహన్‌రావుకు మళ్లీ ఎంపీ ఇస్తామన్న హామీతో పార్టీలో చేర్చుకున్నా, ఇప్పటికీ అతీగతీ లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచార కమిటీలో ఆయనకు కో కన్వీనర్ ఇచ్చి, ఆయన సిఫార్సు చేసిన కొంతమందికి సీట్లిచ్చారు. అది కొంతలో కొంత ఊరట. అన్ని వనరులు ఉన్నందున, ఆయనకు ఆ పాటి గౌరవమయినా దక్కింది. ఇక మిగిలిన వారి పరిస్థితి మరీ దయనీయం. మోత్కుపల్లి నర్శింహులు, పెద్దిరెడ్డి, బోడ జనార్దన్  వంటి మాజీ మంత్రులు, చాడ సురేష్‌రెడ్డి వంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అద్వానం. వారికి ఏ కమిటీలో చోటు లేదు.

ఇలా  చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాండత అవుతుంది. మరి వీరికే గతి లేనప్పుడు, కొత్తగా పార్టీలో చేరిన రాములమ్మ ఉద్ధరించేదేమిటన్నది ప్రశ్న. పైగా ఆమెకు ఇప్పుడు హీరోయిన్‌కున్న ఇమేజ్ లేదు. మునుపటి మాదిరిగా ఆమె ఇప్పుడు జనార్షణ నేత కూడా కాదు. స్వయంగా ఆమె పోటీ చేసిన చోటనే దారుణంగా ఓడిపోయింది కాబట్టి!  ఈ మధ్య ఆమె కూడా ట్విట్టర్ రాణిగానే మారారు. ముద్ద ముద్దకు బిస్మిల్లా అన్నట్లు.. కాంగ్రెస్‌లో మాదిరిగా అలిగినా, బుజ్జగించేందుకు బీజేపీలో ఎవరూ ఉండరు. నలుగురితో పాటు నారాయణ మాదిరిగా ఉండాల్సిందే తప్ప, ఆమెకెలాంటి ప్రాధాన్యం ఉండదు.

మరి భవిష్యత్తులో విస్తరాకుల లెక్కకు ఆమెను చేర్చుకుందా?.. లేక పార్టీ విస్తరణకే రాములమ్మను పార్టీలో చేర్చుకుందా అన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అనే రెండు కిరాయి ఇళ్లు మారి, ఎట్టకేలకు సొంత గూటికి చేరిన రాములమ్మ సాహసాన్ని అభినందించాల్సిందే. కాకపోతే.. ఎలాగూ సొంత ఇంటికి ఎప్పుడైనా రావచ్చన్న నిజం తెలిసింది కాబట్టి, ఈ సొంత గూటిలో ఎన్నాళ్లు సర్దుకుంటారన్నదే ప్రశ్న.