‘సారు’ది స్వయంకృతమే!

535

చెప్పినా విననందుకు చేదు ఫలితాలు
సిట్టింగులను మార్చమన్నా బేఖాతరే
ఎమ్మెల్యేల సూచనలకు విలువేదీ?
కాంగ్రెస్‌ను బలహీనం చేసినందుకే ఈ దుస్థితి
తలసాని సంకేతాలు అర్ధం చేసుకోలేని నాయకత్వం
బీజేపీని బాహుబలిని చేసిన కేసీఆర్
తెరాస నేతల అంతర్మథనం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కర్ణుడి చావుకు వంద కారణాలు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ ఘనంగా ప్రచారం చేసుకున్న వంద సీట్లు తెచ్చుకోలేక, 60 లోపే చతికిలపడేందుకు కారణాలు మాత్రం వెయ్యి. అందుకు తెరాస రథసారధి, తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంకృతాపరాధమేనన్నది ఇప్పుడు, ఆ పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తున్న ఏకాభిప్రాయం. అయితే..ఈ పరాజయం ఒకరకంగా తమకు మంచిదేనని, నాయకత్వ నేత్రాలు మళ్లీ భూమ్మీద పెట్టేందుకు.. ఈ ఎన్నికలు దోహదపడినట్లు భావించాలన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.

రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్తగా పేరున్న కేసీఆర్.. చావుకు-లంఖణానికీ ఒకే మంత్రం అన్న చందంగా వ్యవహరిస్తుండటమే, ఇటీవలి పరాజయ పరంపరకు ప్రధాన కారణమన్న విశ్లేషణ ఆ పార్టీ సీనియర్లలో వినిపిస్తోంది. ఏటికి ఎదురీది, లక్ష్యాన్ని చేరుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు. ఒక్కోసారి ఎదురయ్యే అలలు ఎక్కడికి తీసుకువెళ్లి, ఎక్కడ పడేస్తాయో కూడా తెలియదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాల అమలు-ఆలోచన కూడా ఇటీవలి కాలంలో ఇలాగే కనిపిస్తోందంటున్నారు. ఆయన వ్యూహాలు ఇటీవలి కాలంలో, కాలానుగుణంగా ఉండటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గ్రేటర్‌లో కమలం సమరోత్సాహానికి కారణమయిన, దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ ముందుచూపు లేకుండా చేసిన అభ్యర్ధి ఎంపికనే… ఇప్పటి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బాహుబలిగా నిలిచేందుకు దారితీసింది. దుబ్బాకలో మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబసభ్యులపై ప్రజల్లో ఏమాత్రం సానుభూతి లేకపోగా, వ్యతిరేక ఉందన్న విషయం కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసు. అయినా తన ముఖం-ఇమేజ్‌తోనే ఏ అభ్యర్థులయినా గెలుస్తారన్న మితిమీరిన అంచనా-అతి ఆత్మవిశ్వాసమే దు బ్బాకలో దెబ్బేసింది. అప్పటికీ అక్కడ హరీష్‌రావు పనిచేయబట్టి.. 1100 ఓట్ల తేడాతో ఓడిపోవలసి వచ్చింది. ఆయన కూడా లేకపోతే మరింత పరాభవం ఎదురయి ఉండేది. నిజానికి అక్కడ శ్రీనివాసరెడ్డికి సీటు ఇచ్చి ఉంటే, కనీసం 15 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించేవారు. కానీ మృతి చెందిన ఎమ్మెల్యే భార్యను నిలబెట్టడంతో, ఓటర్లు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు పనితీరును పోల్చుకుని, ఆయనకు జైకొట్టారు. ఇది కేసీఆర్ స్వయంకృతాపరాధమే.

పోనీ.. దానిని గ్రేటర్ ఎన్నికల్లో సమీక్షించుకున్నారా అంటే అదీ లేదు. అదే అతి విశ్వాసం. అదే ఏకపక్ష నిర్ణయం. ఫలితమే బీజేపీ బాహుబలి అవతారం! అసలు వరద సాయంలో తన సర్కారు వైఫల్యం చెందిందన్న బాధితుల ఆందోళన, వ్యతిరేక ఓటుగా మారుతుందన్న కనీస అంచనా-ఆలోచన కేసీఆర్‌కు లేకపోవడమే ఆశ్చర్యం. నిఘా వర్గాలు కూడా, ఆ మేరకు నివేదిక ఇవ్వకపోవడం మరో ఆశ్చర్యం. అయితే.. నిఘా వర్గాలు నిజమయిన నివేదికలిచ్చినా, వాటిని కేసీఆర్ పాటించారా? లేదా అన్నది వేరే విషయం.

వరద ప్రాంతాల బాధితులంతా, విపక్షాల ఆరోపణల కారణంగా ఆగ్రహంతో ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. అందుకే ఎన్నికలు వచ్చే ఏడాది జరిపించాలని, ఆ లోగా వరద గొడవ మర్చిపోతారని ఎమ్మెల్యేలు సూచించినా ఖాతరు చేయలేదు. ఎల్‌ఆర్‌ఎస్ అంశం అసంతృప్తి కూడా ఉందని చెప్పినా వినలేదు. పార్టీ గెలుపు ఖాయమని, తన వద్ద అన్ని సర్వే నివేదికలున్నాయని చెప్పి, కేసీఆర్ ప్రజాప్రతినిధులు, నేతల నోళ్లు మూయించారు. ఇక తమ వద్ద సిట్టింగులను మార్చమని కొంతమంది ఎమ్మెల్యేలు మొత్తుకున్నా కేసీఆర్ ఖాతరు చేయలేదు.పట్టుపట్టి మార్చుకున్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను గెలిపించుకోగా, ఆ శక్తి లేని వారు అశక్తులయి, పరాజితుల జాబితాలో చేరారు. వీటికిమించి..నగరంలో 46 మంది సిట్టింగులపై విపరీతమయిన ఆరోపణలున్నాయి. మరో 15 మంది అసలు అందుబాటులో ఉండరన్న పేరుంది. అయినా వారినే కొనసాగించి చేతులుకాల్చుకున్నారు. ఇది కూడా కేసీఆర్ స్వయంకృతాల్లో ఒకటి.

ఇక ప్రధానంగా.. బీజేపీని ప్రత్యామ్నాయశక్తిగా చూపించిన కేసీఆర్, అందుకు మూల్యం చెల్లించుకున్నారు. బీజేపీ నైజం, వ్యూహం, రాజకీయ బలమేమిటో తెలిసికూడా బీజేపీని ప్రత్యామ్నాయంగా చూపించారు. ఇలా పరోక్షంగా కాంగ్రెస్‌ను బలహీనం చేసినందుకే, ఈ దుస్థితి దాపురించిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదం పసిగట్టిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే.. తమకు కాంగ్రెస్ పార్టీనే పోటీ అని ప్రచారంలో ప్రకటించారు. కానీ, కేటీఆర్ మాత్రం బీజేపీనే పోటీ అని చెప్పడంతో, కథ అడ్డం తిరిగింది. ఒకసారి బీజేపీ పాతుకుపోతే, ఇక అక్కడ దానిని కదిలించడం కష్టం. ఆ చిన్న లాజిక్కును అంత పెద్ద వ్యూహకర్తయిన.. కేసీఆర్ ఎలా విస్మరించారన్నది పార్టీ సీనియర్లకూ అంతుపట్టకుండా ఉంది.