బాబు ఆ మీడియాకు..బ్రాండ్ అంబాసిడరా?

346

అసెంబ్లీలో జగన్ మీడియాపై దాడి చేయడమా?
తెలంగాణలో శేఖరన్నదీ అదే దారి
ఏపీలో రాజకీయాలు ఎటుపోతున్నాయి?
(మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘‘ జగన్ ప్రభుత్వం కేవలం తన మీడియాకు మాత్రమే ప్రకటనలిచ్చి, మిగిలిన వాటికి ఇవ్వకపోవడం అన్యాయం. ఇంత పక్షపాతమా? సొంత మీడియాకు కోట్ల రూపాయల ప్రకటనలిస్తున్నారు. అసెంబ్లీలో కూడా కొన్ని మీడియా సంస్థలకు ప్రవేశం లేకుండా చేశారు. మేం అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని ఎప్పుడయినా ఆపామా?
– ఇది టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణ.

‘‘ పేరుకు ఈనాడయినా ఆ పత్రిక అన్నీ అబద్ధాలే రాస్తోంది. పెన్షన్లు, వైఎస్సార్ చేయూత పథకాలపై ఎల్లో మీడియా పనిగట్టుకుని విష ప్రచారం చేస్తోంది. పచ్చమీడియా పనిగట్టుకుని గోబెల్స్ ప్రచారం చేస్తోంది. దానిని ఎవరూ నమ్మవద్దు’’
– ఇది అసెంబ్లీలో ఈనాడు పత్రికను చూపుతూ సీఎం జగన్ చేసిన విమర్శ.

టీడీపీ నేతలేమో సాక్షి, దానికి మద్దతునిచ్చే వాటిని ‘బ్లూమీడియా’ అని విమర్శిస్తారు. వైసీపీ నేతలు టీడీపీకి మద్దతునిచ్చే వాటిని, ‘ఎల్లో మీడియా’గా అభివర్ణిస్తారు. ఇక తెలంగాణలో కూడా ఈ విమర్శల జబ్బు విస్తరిస్తోంది. కేసీఆర్- టీఆర్‌ఎస్‌ను సమర్ధించే వాటిని పింక్ మీడియా, పింకీలుగా విమర్శిస్తున్నారు. అటు కేసీఆర్ కూడా, తనను వ్యతిరేకించే మీడియా సంస్థలను విలేకరుల సమావేశాల్లోనే దుయ్యబడతారు. వాటికి కరోనా రావాలని శాపనార్ధనాలు పెడతారు. తెలుగు రాష్ట్రాల్లో పాలకులు-విపక్షాల దృష్టిలో మీడియా పరిస్థితి ఇదీ!

ఆయన పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన అనువశాలి. దేశరాజకీయాల్లో ఆయనంటూ తెలియనివారెవరూ ఉండరు. మరి ఆయన వ్యాఖ్యలు, ప్రసంగాలు ఎంత హుందాగా ఉండాలి? ఆయన విమర్శలు, సూచనలు, సలహాలన్నీ సామాన్యుల కోసం కదా ఉండాలి? కానీ.. సదరు సీనియర్ నేత… ఫలానా మీడియా సంస్థలకు ప్రభుత్వం ప్రకటనలివ్వడం లేదు. అధికార పార్టీ తన సొంత పార్టీ పత్రికకు మాత్రమే ప్రకటనలిస్తోంది. ఈమధ్య ఇలా సాగుతున్నాయి ఆయన విమర్శలు. అదే ఆశ్చర్యం!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఈ తరహా విమర్శలు- వ్యాఖ్యలు, కొన్ని మీడియా సంస్థల కోసం పడుతున్న ఆవేదన చూస్తే.. ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారా? లేక ఆ మీడియా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారా? అన్న సందేహం ఎవరికయినా రాక తప్పదు. జగన్ సర్కారు వచ్చిన తర్వాత, ఈనాడు మినహా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్, టీవీ5 చానెళ్లకు ప్రకటనలు నిలిపివేసింది. ఈనాడు మాత్రం ఇప్పటికీ ఎక్కువ నిధులు పొందుతున్న పత్రికగానే కొనసాగుతోంది. ఒకటి- రెండు స్థానాల్లో ఉన్నందున, ఆ నిష్పత్తిలోనే ఈనాడు-సాక్షి ప్రకటనలు ఇస్తున్నట్లు సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు.

కాకపోతే.. కొత్తగా సమాచార శాఖ తన బడ్జెట్ పరిమితి దృష్టిలో ఉంచుకుని, ప్రకటనల రేట్లు నిర్దేశించుకుంది. అందుకు అంగీకరించిన పత్రికలకు మాత్రమే ప్రకటనలిస్తోంది. దానివల్ల కోట్లాది రూపాయల ప్రజాదనం ఆదావుతోంది. ఇక యాడ్ ఏజెన్సీ వ్యవస్థకు చరమగీతం పలికినందున, 15 శాతం కమిషన్ సర్కారే పొందే అవకాశం ఏర్పడింది. ఈ సంస్కరణలన్నీ చంద్రబాబు తన హయాంలో తీసుకురాలేకపోయారు. ప్రజాధనం మిగిల్చినందుకు, ఒక ప్రతిపక్ష నేతగా అభినందించకుండా, విమర్శించడం ఆయన స్థాయికి తగనిపని. ఇది కూడా చదవండి…అవును…ఆడు మగాడ్రా బుజ్జీ!

ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు జరుగుతున్న అన్యాయం గురించి వాపోతున్న బాబు… టీడీపీ అధికారంలో ఉండగా, మరి సాక్షికి అప్పటి నిష్పత్తి ప్రకారం ఎందుకు ప్రకటనలివ్వలేదో చెబితే ఆయన విమర్శలకు నిండుతనం చేకూరేది. అప్పుడు కూడా , ఇప్పటిమాదిరిగానే ఒకటి-రెండు స్థానాల్లో లేని.. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థకు కోట్లాది రూపాయల ప్రకటనలు, అసెంబ్లీ లైవ్ టెలీకాస్ట్ హక్కులు ఎందుకు కట్టబెట్టారు? తనకు అనుకూలంగా ఉన్న చానెల్స్‌కే ఎందుకు విస్తరి వేశారు?

ఒక ఉన్నత హోదాలో ఉన్న నాయకుడు, అది కూడా బాధ్యతాయుతమైన పదవి నిర్వహించిన పాలనాదక్షుడు.. తన హయాంలో ఏం చేశారన్న అంశాన్ని ఆత్మవిమర్శ చేసుకోకుండా… కొన్ని మీడియా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌లా మాట్లాడటం శోచనీయం. అది ఆయన స్థాయి-హోదా-హుందాతనానికి శోభ ఇవ్వవు. రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయి. వాటిపై దృష్టి సారించకుండా, మీడియా సంస్థలకు రావలిసిన వ్యాపార ప్రకటన గురించి మాట్లాడటం వల్ల, దిగజారేది ఆయన పరువేనని టీడీపీ నాయకత్వం గుర్తించడం మంచిది. అయినా.. మీడియాకు సర్కారు చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడుతున్న బాబు.. గత ఎన్నికల సమయంలో అదే మీడియాకు, పార్టీపరంగా ఇచ్చిన ప్రకటనలకు ఇప్పటివరకూ బకాయిలే చెల్లించని తీరును ఏమనాలి? ఏదయినా న్యాయం, తన ఇంటి నుంచే మొదలుపెట్టడమే పెద్దమనుషుల ధర్మం కదా?

ఇక సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా, ఆ తానుముక్క మాదిరిగానే మాట్లాడటం ఆక్షేపణీయం. అసెంబ్లీలో ప్రతి నిమషం-సమయం ఖరీదయినది. నిమిషానికి కొన్ని వేల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుంది. అలాంటి సమయాన్ని ప్రజాసమస్యల పరిష్కారం- సర్కారు చేస్తున్న పనులు చెప్పేందుకు పరిమితం కాకుండా.. తనకు నచ్చని మీడియాను, తిట్టిపోసేందుకు వెచ్చించడం బాధ్యతారాహిత్యం. అసెంబ్లీలో ఆయన ఈనాడు పత్రికను చేత పట్టుకుని చేసిన ప్రసంగం చూస్తే.. జగన్ కూడా మీడియాకు బ్రాండ్ అంబాసిడరయ్యారా? ఈనాడుకు ప్రచారకర్తగా మారారా? అన్న సందేహం తలెత్తక తప్పదు. రాష్ట్రంలో ఈనాడు-ఆంధ్రజ్యోతి-ఏబీఎన్-టీవీ5 మీడియా సంస్థలు జగన్ సర్కారుకు వ్యతిరేకమని..తెలుగుదేశం పార్టీకి సాక్షి వ్యతిరేకమన్నది కొత్తగా చెప్పాల్సిన పనేమీ లేదు. వాటి తీరు కూడా అలాగే ఉన్నప్పుడు.. ప్రత్యేకించి లక్షల రూపాయల ప్రజాధనంతో నడిచే విలువైన సభలో మళ్లీ, వాటి గురించి ప్రస్తావించడం సీఎం స్థాయి వ్యక్తికి తగదు. అది ఆ హోదా స్థాయిని తగ్గిస్తుందని గుర్తించడం మంచిది.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్నే’. కరోనా సమయంలో తన సర్కారు వైఫల్యాలు ఎత్తిచూపినందుకు, కేసీఆర్.. ఆంధ్రజ్యోతి, వీ6 పై అగ్గిరాముడయ్యారు. వారికి కరోనా రావాలని శాపనార్థాలు పెట్టారు. ఆయన కూడా.. శిష్యుడయిన జగన్ తరహాలోనే.. తన అనుకూల-ఆస్ధాన మీడియా మాదిరిగా, అన్నీ సానుకూల వార్తలే రాయాలని- రావాలని తలపోస్తుంటారు. తనకు వ్యతిరేక వార్తలు రాసే వారిని, బహిరంగంగా అవమానించడం ఆయన లక్షణం. ఇటీవల వచ్చిన వరదలో నష్టపోయిన బాధితుల వేదన వెలిబుచ్చిన మీడియాపైనా, తెరాసీయులు బూతులు లంకించుకోవటం అహంకారమే.

ఇది ప్రజాస్వామ్యంలో వాంఛనీయం కాదు. ఇవన్నీ ముఖ్యమంత్రుల స్థాయికి అస్సలు తగినవి కానేకాదు. కానీ దురదృష్టవశాత్తూ.. రెండు తెలుగు రాష్ర్టాల్లో అదే ధోరణి కొనసాగుతోంది. విమర్శలు వచ్చినప్పుడే దిద్దుబాటుకు దోవ దొరుకుంది. పాలకులు వాటిని ఒక దిక్సూచి, లోపాలు సరిదిద్దుకునేందుకు ఉన్న వెసులుబాటు కల్పించే ఒక వ్యవస్థగా భావించాలి. అయితే.. అలాగని, మీడియా కూడా.. పనిగట్టుకుని, రాగద్వేషాలు, రాజకీయ ప్రేమానుబంధాలతో ప్రభుత్వాలు-వ్యక్తులపై బురదచల్లే రాతలు కూడా పత్రికాస్వామ్యం విలువ పెచకపోగా, దిగజార్చేవన్నది గ్రహించాలి. ప్రశ్నించడంతోనే లోపాలు బయటపడతాయని- దానితో దిద్దుబాటు చేసుకోవచ్చన్న విషయాన్ని, పాలకులెవరూ గ్రహించకపోవడమే విచారకరం. అయినా.. ఇప్పుడు అన్ని పార్టీలకూ సొంత మీడియా ఉండటంతో, పత్రికాస్వామ్యం ఎవరికోసం పనిచేస్తుందో అర్ధం కాకుండా ఉంది.

ఈ సందర్భంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. ఇటీవల మీడియాపై చేసిన ఆరోపణ -విమర్శ ప్రస్తావించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ, మీడియాకు ప్యాకేజీలివ్వకపోవడం వల్లనే గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓడిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అంటే గ్రేటర్ ఎన్నికల్లో, కేవలం మీడి యా ఆ పార్టీకి అనుకూలంగా రాయకపోవడం వల్లనే ఓడిందన్నది.. రేవంతుడి కవిహృదయమన్న మాట. అసలు మీడియా వల్లే ఈ స్థాయికి ఎదిగిన రేవంతుడి నోటి నుంచే, ఈ మాట రావడం ఆశ్చర్యం.

అదే నిజమయితే.. ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన మీడియాకు రేవంత్, ఎంత ప్యాకేజీలిచ్చారన్న ప్రశ్న.. బుర్ర బుద్ధి ఉన్న ఎవరికయినా వస్తుంది కదా? చిన్న వయసులోనే అన్ని కళలూ అవపోసన పట్టిన రేవంత్.. ఈరోజుల్లో కేవలం మీడియా వల్లనే.. ఒక పార్టీ అధికారంలోకి రావడం, రాకుండా ఉండకపోవడం సాధ్యమవుతుందా అన్న విషయం తెలియకపోవడం మరీ ఆశ్చర్యం. ఇటీవల దుబ్బాక-గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి.. ఏ మీడియా అనుకూలంగా ఉంటే అన్ని విజయాలు సాధించిందన్న ప్రశ్నకు, రేవంతుడి వద్ద జవాబు ఉంటుందా?