పేరు పలకలు తెలుగులోనే ఏర్పాటు చేయాలని ధర్నా

216

సరైన విద్యార్హతలు లేకున్నా, ఆస్తిపాస్తులు లేకున్నా, కట్టుబట్టలతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుబెట్టిన వారిని కూడ ప్రజలు ఆదరించారు. ఇప్పుడు కార్లు, బంగళాలు సంపాదించి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఏ రంగంలో లేనంత అత్యధిక పారితోషికాలు పొందుతున్నారు, విలాసవంతమైన జీవితాలను గడుపుతున్నారు. ఇటువంటి నటులు, కళాకారులు, సంగీత దర్శకులు, గాయకులు, మాటల పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలను సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చిన తెలుగు భాషను గౌరవించటంలో, కాపాడటంలో ఘోరంగా విఫలమైనారు. కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న సంఘానికి “ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్” అని పేరు పెట్టుకోవటం చూసి తెలుగు జాతి సిగ్గుపడుతున్నది. ఇటువంటి పనులు చేస్తే అరవ వారు, కన్నడిగులు ఆ సంఘం అంతు చూసేవారు.

యునెస్కో గీటురాళ్ళ ప్రకారం భారత దేశంలో ఏ పెద్ద భాషకు ప్రమాదం లేదు కాని తెలుగు మనుగడ కొనసాగదు. భాషతో పాటు మన, సంస్కృతి, కళలు, పండుగలు, విజ్ఞానం చివరకు జాతే అంతరించిపోతుంది. తాము ఎక్కిన చెట్టును తామే నరుకుతున్నారు సినిమా వారు.
ఇటువంటి తెలుగు ద్రోహ చర్యలను అందరు బయటకు వచ్చి ఎదిరించవలసిన తరుణం వచ్చింది.స్టూడియోల కోసం ఉచితంగా లేక నామమాత్ర విలువలకు ప్రభుత్వాల దగ్గర పొలాలను పొందినా వాటి పేరు పలకలలో తెలుగును ప్రముఖంగా రాయటాన్ని లోకువగా చూస్తున్నారు. మన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు దృశ్య మాధ్యమాలలో ఆంగ్లంలోనే సిగ్గు, శరం లేకుండ మాట్లాడుతున్నారు. టి.వి. కార్యక్రమాలకు బిగ్ బాస్; సినిమాలకు मॉ గంగా నది, HIT, MADHA, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య, అహం బ్రహ్మస్మి, కాలేజ్ కుమార్, యురేక, శివన్ (ఆంగ్లం, సంస్కృతం, హిందీ, అరవం); ప్రాంతాలకు ఫిలింనగర్ అని ఇతర భాషల పేర్లను పెట్టటం తెలుగు తల్లికి అవమానంగా అనుకుంటున్నాం.

Welcome to Filmnagar, Filam nagar cultural center, RAMANAIDU అని పేరు పలకలపై రాయటం చట్టరీత్యా నేరం. ఇటువంటి క్రిమినల్స్ కు తగు బుద్ధి చెప్పాలని చైతన్యవంతులైన తెలుగు వారు అనుకుంటున్నారు.
కన్నడనాట డబ్బింగ్ టి.వి. సీరియల్స్ ఉండవు. కావాలంటే అదే కథలతో కన్నడ నటీనటులతో కొత్తగా సీరియల్ ను తీస్తారు. ఇక్కడ తెలుగు స్త్రీలను ఘోరంగా అవమానిస్తున్నారు. ఇంతకు ముందు తెలుగు వారే ప్రధానంగా కథానాయికలుగ (కన్నాంబ, భానుమతి, వరలక్ష్ములు, సావిత్రి, జమున, కృష్ణకుమారి, జానకి వగైరా) ఉండేవారు. మన దర్శకులకు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు లేకిగా కనపడుతున్నారు.
తెలుగు భాషపై జరుగుతున్న ఈ దాడికి నిరసనగా 7-12-20 న భాగ్యనగరంలోని MAA కార్యాలయం దగ్గర ద్రవిడనాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నాము. తెలుగు భాష, సంస్కృతులపై అభిమానం ఉన్న వారందరూ పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొనమని మనవి.

                                                                                                   – కిన్నెర సిద్దార్థ
                                                                                               జాతీయ అధ్యక్షులు
                                                                                                      ద్రవిడనాడు