‘గల్లీ’లో ఓడిన..‘ఢిల్లీ’ నేతలు

439

‘గ్రేటర్’ ఎన్నికల్లో సత్తా చూపని కిషన్‌రెడ్డి-రేవంత్‌రెడ్డి
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

వాళ్లిద్దరూ రచ్చ గెలిచి ఇంట ఓడారు. ఫలితంగా… తమ ఇలాకాలో వారి పట్టు సడలింది. పలుకుబడి పలచనయింది. ఢిల్లీ ఎన్నికల్లో వారిని గెలిపించిన ఓటర్లు, గల్లీ ఎన్నికల్లో మాత్రం వారి పార్టీ అభ్యర్ధులను నిర్దాక్షిణ్యంగా ఓడించారు. ఆ రకంగా ఆ ఇద్దరు ఢిల్లీ నేతలు, గల్లీలో ఓడిపోయారన్నమాట.

ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి- మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తమ ఇలాకాలో.. తమ సొంత పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డితో పోలిస్తే, కిషన్‌రెడ్డి మెరుగుగా కనిపిస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ సెగ్మెంట్‌లోని సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవకపోవడం విషాదం. సనత్‌గర్‌లో రెండు, ముషీరాబాద్‌లో 5, అంబర్‌పేటలో 3, ఖైరతాబాద్‌లో 2, నాంపల్లిలో 1 స్థానంలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధులు గెలిచారు. అయితే.. ఇందులో సికింద్రాబాద్ జిల్లా కూడా ఉన్నందున.. సనత్‌నగర్, కంటోన్మెంట్, ముషీరాబాద్ గెలుపు ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్ ఖాతాలో కూడా వెళుతుంది.

ఇక మల్కాజిగిరిలో ఎంపీ రేవంత్ పరిస్థితి మరీ దారుణం. గ్రేటర్ ఎన్నికల్లో మెరిసిన ఆ ఇద్దరూ, ఆయన ఇలాకాలోని కార్పొరేటర్లే. అప్పటికీ రేవంత్, కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారం చేసినా, ఓటర్లు కనికరించలేదు. రేవంత్ కష్టం ఫలితంగానే కాంగ్రెస్‌కు ఆ రెండయినా దక్కాయి. లేకపోతే దారుణ పరాభవం ఎదురయ్యేది. ఎంపీ ఎన్నికల్లో రేవంత్ గెలిచినా, అసెంబ్లీలన్నీ టీఆర్‌ఎస్ అధీనంలోనే ఉండటం, కాంగ్రెస్‌కు ప్రతికూల అంశం. కిషన్‌రెడ్డిదీ అదే పరిస్థితి. అయితే..ఈసారి ఏకంగా 19 నియోజకవర్గాల్లో బీజేపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండటం, ఆ పార్టీకి భవిష్యత్తులో రాజకీయ ప్రయోజనం చేకూర్చేదే. అలాంటి అవకాశం కాంగ్రెస్ లేకుండా పోయింది.

కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నందున, సహజంగానే ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజవర్గాల జయాపజయాలన్నింటికీ ఆయనదే బాధ్యత. టికెట్ల ఎంపికలో ఆయన సిఫార్సులే చెల్లినందున, వారి గెలుపు ఓటములకు ఆయనదే బాధ్యత. అసలు సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బీజేపీ ఖాతా తెరవలేదంటే, అక్కడ ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో, అభ్యర్ధుల ఎంపిక ఎంత లోపభూయిష్టంగా ఉందో స్పష్టమవుతోంది. కార్యకర్తల మనోభీష్టం మేరకు కాకుండా, సిఫార్సులు, ఒత్తిళ్లకు తలొగ్గినందువల్లే ఈ పరాభవం ఎదురయిందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. దీనికి ఫలానా నాయకులు సహకరించలేదని సొంత పార్టీలో వినిపిస్తున్న ఫిర్యాదు, ఆరోపణలు పసలేనివే. చాలా నియోజ వర్గాల్లో సొంత పార్టీలు పనిచేయకపోయినా బీజేపీ అభ్యర్ధులు గెలిచారు. అంటే ఆ ప్రకారంగా.. జనంలో లేని వారిని కిషన్‌రెడ్డి ఎంపిక చేసినట్లు స్పష్టమవుతోందన్నది సీనియర్ల వాదన.

అదీకాకుండా.. కిషన్‌రెడ్డి గెలిచిన తర్వాత ఎక్కువకాలం ఢిల్లీలోనే గడుపుతుండటం, పార్టీ అసెంబ్లీ ఇన్చార్జిలు విఫలమవడంతో.. ప్రజలు-కార్యర్తలకు పార్టీ దూరమయిందని చెబుతున్నారు. ప్రధానంగా కిషన్‌రెడ్డి ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని, గతంలో ఎమ్మెల్యే-పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కాగా.. గతంలో దత్తాత్రేయ చుట్టూ ఎలాగయితే, పైరవీకారులయిన పార్టీ నేతలు చుట్టూ కనిపించేవారో, ఇప్పుడు కిషన్‌రెడ్డి వద్ద కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జనంలో లేని నేతలంతా ఫ్లెక్సీలు, సోషల్‌మీడియా హంగామాతో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇతర అగ్ర నేతల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పుడు ఫలితాల్లో అదే కొంపముంచిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అభ్యర్ధులకు జనంలో ఉన్నారా? లేదా? వారికి కార్తకర్తల్లో బలమెంత? అన్న అంశాలు ప్రాతిపదిక చేసుకోకుండా.. ఎవరు సిఫార్సు చేశారు? ఏ స్ధాయిలో ఒత్తిళ్లు చేశారన్నదే ప్రాతిపదికగా ఎంచుకుని, టికెట్లు ఇవ్వడం వల్లనే కమలం కొంపమునిగిందని ఓ సీనియర్ నేత విశ్లేషించారు.

సికింద్రాబాద్‌లో ఓ నియోజకవర్గ ప్రముఖుడు, కార్పొరేటర్ సీటు కోసం కేంద్రమంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో సిఫార్సు చేయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అదే కేంద్రమంత్రి సిఫార్సుతో సీటు సంపాదించుకున్న సదరు నేత, మళ్లీ ఇప్పుడు తన భార్యకు కార్పొరేటర్ సీటు కోసం కూడా సిఫార్సు చేయించడం ఆశ్చర్యకరం. అంటే .. బీజేపీలో పైరవీరాజ్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి కూడా.. రెండు నియోజకవర్గాల్లో అసలు పార్టీ ఖాతానే తెరవలేకపోవడం, మొత్తం 15 సీట్లు కూడా సాధించకపోవడమంటే.. ఆయన తన పార్లమెంటు పరిథిలో పట్టు-పలుకుబడి కోల్పోతున్నట్టుగానే భావించాల్సి ఉందంటున్నారు.