మోడీ దూకుడుకు రైతన్న చెక్

538

ఈ వారం రోజుల్లో రైతు ఉద్యమానికి దేశవ్యాపిత సంఘీభావం విస్తృతమైంది. వివిధ వర్గాల, తరగతుల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆరేళ్ల మోడీ పాలనకు ఇంతటి తీవ్రమైన సవాలు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఒంటి చేత్తో అదుపు చేయగలమనుకున్న నేతలకు ఇప్పుడు ఈ ఉద్యమం చెమటలు పట్టిస్తున్నది. ఊహించని ఈ పరిణామాన్ని ఎదుర్కోలేక రైతాంగ ఉద్యమంపై తప్పుడు ప్రచారానికి దిగింది.

కరోనాతో దేశమంతా అట్టుడికిపోతున్న కాలంలో దొంగదెబ్బ తీస్తూ 3 వ్యవసాయ ఆర్డినెన్సులను మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. వీటికి వ్యతిరేకంగా నాటి నుండి రైతు సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్‌లో వాటిని పార్లమెంటు ఆమోదానికి పెడుతూ…దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వస్తే రైతాంగానికి ఇప్పుడు వచ్చిందని మోడీ గొప్పగా చెప్పుకున్నారు. కానీ తేనె పూసిన కత్తి వంటి ఈ మోసaపూరిత మాటలను రైతులు విశ్వసించలేదు. రాజ్యసభలో అత్యధిక ఎంపీలు దీనిని వ్యతిరేకించినా నిరంకుశంగా ఆమోదించినట్లు ప్రకటించుకుంది. నాడు బిజెపి మిత్రపక్షమైన అకాలీదళ్‌ తిరుగుబాటు చేసి బయటకు వచ్చింది. నాటి నుండి పంజాబ్‌, హర్యానాల్లో రైతులు పెద్దఎత్తున రోడ్ల పైకి వచ్చి దిగ్బంధనాలు చేశారు. రైలు పట్టాలపై రోజుల తరబడి బైఠాయించారు. పంజాబ్‌, హర్యానాలతో పాటు అనేక రాష్ట్రాల్లో నిరసనలు మొదలయ్యాయి. రైతాంగంపై కేంద్రం కక్ష పూని పంజాబ్‌కు వెళ్ళే గూడ్స్‌ రైళ్ళను ఆపివేసింది. తద్వారా రబీ పంటకు ఎరువులు దొరక్కుండా చేసింది. ఖరీఫ్‌ పంట ఎగుమతి కాకుండా ఆపింది. అయినా రైతులు చలించకుండా నవంబర్‌ 26 ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి రైతాంగం పోగైంది. ఇతర రాష్ట్రాలలోనూ ఆందోళనలు మిన్నంటాయి.

బహుశా వర్తమాన భారత చరిత్రలో దేశ రాజధానిని ఇన్ని రోజులపాటు దిగ్బంధనం చేయడం ఇదే మొదటిసారి. శాంతియుతంగా ఢిల్లీకి వచ్చి ధర్నా చేయాలనుకున్న రైతుల్ని సరిహద్దుల్లోనే ఆపివేసి కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఢిల్లీ సరిహద్దుల్నే దేశ సరిహద్దుల్లా భావించి ఆందోళనకు వస్తున్న రైతుల్ని ఉగ్రవాదులుగా చూపెట్టి అణచివేసేందుకు ప్రయత్నించింది. కానీ దేశవ్యాపితంగా వెల్లడైన సంఘీభావంతో కేంద్రం వెనకడుగు వేయక తప్పలేదు.మొదట ఢిల్లీకి అనుమతించబోమని ప్రకటించిన కేంద్రం రైతుల సంఖ్యను, ఒరిపిడిని చూసి చర్చలకు సిద్ధపడింది.

మూడు దఫాలుగా జరిగిన చర్చలు ప్రతిష్టంభనకు గురవడంతో మరలా శనివారం (5వ తేదీ) కూర్చోవాలని నిర్ణయించారు. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై చలిలో రైతులు అక్కడే వండుకొని తింటూ నిరసన తెలియజేస్తున్నారు. అలాంటి సమయంలో చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే మంచినీళ్ళను కూడా ముట్టుకోవడానికి రైతు ప్రతినిధులు నిరాకరించారు. ఈ వారం రోజుల్లో రైతు ఉద్యమానికి దేశవ్యాపిత సంఘీభావం విస్తృతమైంది. వివిధ వర్గాల, తరగతుల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ ఆరేళ్ల మోడీ పాలనకు ఇంతటి తీవ్రమైన సవాలు ఎప్పుడూ ఎదురు కాలేదు. ఒంటి చేత్తో అదుపు చేయగలమనుకున్న నేతలకు ఇప్పుడు ఈ ఉద్యమం చెమటలు పట్టిస్తున్నది. ఊహించని ఈ పరిణామాన్ని ఎదుర్కోలేక రైతాంగ ఉద్యమంపై తప్పుడు ప్రచారానికి దిగింది. తమ చేతిలో ఉన్న సోషల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాని ఉపయోగించుకొని మోడీ-షా అండ్‌ కంపెనీ గోబెల్స్‌ తరహా అబద్ధ ప్రచారానికి తెరలేపింది. ఆ ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేసి అణగదొక్కాలని చూస్తున్నది.

మోడీ-షా అండ్‌ కంపెనీ చేస్తున్న దుష్ప్రచారంలో కొన్ని అంశాలు పరిశీలిద్దాం.

1) ఈ ఉద్యమంలో రైతులు ఎవరూ లేరు, అంతా కిరాయి జనమే.
వారు రైతులే కాకుంటే ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చిస్తున్నదా? కిరాయి మూకలను పోగేసి అల్లర్లు సృష్టించే సంస్కృతి బిజెపిది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు అవినీతి బిజెపికి ప్రజా ఉద్యమాలు కూడా అవినీతికరంగానే కనిపిస్తాయి. అన్యమతస్తుల పేరుతో తమ వారికే వేషాలు వేయించి మత ఘర్షణలు రెచ్చగొట్టే చరిత్ర ఉన్న బిజెపి ఇలాంటి ఆరోపణలు చేయడంలో వింతేమీ లేదు. కిరాయి మూకలు ప్రాణాలకు తెగించి పోరాడలేవు. తమ వ్యవసాయ అస్తిత్వానికి ముప్పు ముంచుకొచ్చిన తరుణంలో రైతులు మూకుమ్మడిగా కదిలారు. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ఏ వ్యక్తిని పలకరించినా ఈ విషయం స్పష్టమవుతుంది. ఆరుగాలం కష్టపడే రైతు ఆక్రోశం అది.

2) ఇది పంజాబ్‌కే పరిమితమైన ఉద్యమం.
ఒక్కో ఉద్యమం ఒక్కో సమయంలో ఒక్కో చొట మొదలవుతుంది. ప్రపంచ చరిత్ర అధ్యయనం చేసినవారికెవరికైనా ఇది సులభంగా అర్ధమవుతుంది. ఏ ఉద్యమం దేశమంతా ఒకే స్థాయిలో జరగదు. జరగలేదు. ఎమర్జెన్సీకి ముందు జయప్రకాష్‌ నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం మొదట గుజరాత్‌, బీహార్‌ల లోనే ప్రారంభమైంది. ఆ తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సకలపక్షాలు ఏకమై దేశమంతా వ్యతిరేకించాయి. మొదట కమ్యూనిస్టుల పైనే దాడి మొదలైంది. అందరిపై దాడి జరిగే సరికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడడానికి ఎమర్జెన్సీ వ్యతిరేక పక్షాలన్నీ సిద్ధమయ్యాయి. నాడు ఇందిరాగాంధీ ఈ పోరాటాన్ని విదేశీ కుట్రగా ప్రచారం చేసింది. కానీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయింది. ఈ అనుభవం నుండి బిజెపి పాఠం నేర్చుకుంటుందా?
పంజాబ్‌లో మొదట వరి, ఆ తర్వాత రెండో పంటగా గోధుమ వేస్తారు. ఈ రెండు పంటల్ని ప్రభుత్వం మద్దతు ధరలకు మార్కెట్‌ యార్డుల్లో అమ్ముకుంటారు. కొత్త చట్టాలు ఈ పద్ధతిని రద్దు చేయడంతో రైతులు అస్థిరత్వానికి గురవుతున్నారు. అందుకే పంజాబ్‌ రైతులు అందరికన్నా ముందు తెగించి ఈ పోరాటం లోకి వచ్చారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయంపై వారికి మోజు లేదు. టమాటో వేసి కార్పొరేట్‌ కంపెనీల చేతుల్లో మోసపోయిన అనుభవం వుంది.

3) కాంగ్రెస్‌, ప్రతిపక్షాలు డబ్బులిచ్చి పోషిస్తున్నాయి.
ఏ ఉద్యమానికైనా డబ్బులు అవసరమే. కానీ డబ్బులతో ఏ ఉద్యమమూ రాదు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చలిలో గజగజ వణుకుతూ నిద్రిస్తుంటే దేశభక్తులెవరైనా స్పందిస్తారు. దేశద్రోహులే విషం చిమ్ముతారు. బిజెపి ప్రచారం నేడు ఈ రెండో తరహాకు చెందింది. దేశవ్యాపితంగా రైతులకు సంఘీభావం వెల్లడవుతోంది. స్వచ్ఛందంగా విరాళాలు పంపిస్తున్నారు. వారు తమ తిండి తమతో తెచ్చుకోవడంతోపాటు తమను కొట్టడానికి వచ్చిన జవాన్‌లకు సైతం పెడుతున్నారు. బిజెపి డబ్బులిచ్చి సోషల్‌ మీడియా కార్యకర్తలను, మోటార్‌ సైకిల్‌ బ్యాచీలను పోషిస్తోంది. వాళ్ళ కంటికి ఇతరులూ అలాగే కనిపిస్తుంటారు. డబ్బుతో ఏదైనా కొనగలమనే కార్పొరేట్‌ దురహంకారానికి బిజెపి దుష్ప్రచారం ఓ మచ్చుతునక.

4) చైనా – పాకిస్తాన్‌ ఏజెంట్లు వీటిని రెచ్చగొడుతున్నారు.
ప్రతిదానికీ విదేశీ ముద్ర వేయడం పాలకులకు మొదటి నుండీ అలవాటే. రైతుల నుండి వస్తున్న ప్రతిఘటనను తట్టుకోలేక విదేశీ ముద్ర వేసి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నది. నిజానికి ఈ ఉద్యమానికి ఏ దేశం నుండైనా మద్దతు వచ్చిందంటే అది కెనడా లాంటి దేశాల నుండే. ఆ దేశం ఎందుకలా స్పందించిందో బిజెపియే సమాధానం చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్న భారతీయులంతా ఈ ఉద్యమాన్ని ఆసక్తితో గమనిస్తున్నారు. మద్దతూ తెలియజేస్తున్నారు. వారినందరినీ దేశద్రోహులు అనలేం. ఇలాంటి వారి మద్దతు తోనే మోడీ అధికారం లోకి వచ్చారన్న విషయాన్ని మరచిపోలేం. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ట్రంప్‌ వంటి అమెరికా పాలకుల చేతిలో పెట్టిన చరిత్ర మోడీది. ట్రంప్‌ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న బిజెపికి ఇప్పుడు దిమ్మతిరిగి అన్నింటా విదేశీ శక్తులే కనిపిస్తున్నాయి.

5) ఖలిస్తానీ ఉగ్రవాదులు దీనిని నడుపుతున్నారు.
ఇప్పటి వరకు పాకిస్తాన్‌ లేదా ముస్లిం ఉగ్రవాదుల గురించి గొంతు చించుకున్న బిజెపికి ఇప్పుడు కొత్తగా ఖలిస్తానీ ఉగ్రవాదులు దొరికారు. సిక్కులూ హిందువులే అనే బిజెపి ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని ఏమని పిలుస్తుందో చెప్పాలి. ఒకవేళ వారూ హిందూ ఉగ్రవాదులైతే అలాంటి ఉగ్రవాదం ఎందుకు పుట్టుకొచ్చిందో బిజెపి సమాధానం చెప్పాలి. ఒక మహా ఉద్యమంగా సాగుతున్న రైతు సమరంలో అక్కడో ఇక్కడో ఒకరు సిక్కు మత జెండాలు పట్టుకుంటే వారంతా ఉగ్రవాదులైపోరు. నిన్న మొన్నటి వరకు అకాలీదళ్‌తో చెట్టాపట్టాలు వేసుకొని ఇప్పుడు సిక్కు ఉగ్రవాదం గురించి మాట్లాడుతోంది. కాశ్మీర్‌లో ముఫ్తీ పార్టీతో కలిసి ఇప్పుడు ఉగ్రవాదం పేరుతో ఆమెనే జైల్లో పెట్టిన ఘన చరిత్ర బిజెపిది.

6) వ్యవసాయ మార్కెట్‌ లోని దళారుల ఉద్యమం ఇది.
వ్యవసాయ మార్కెట్లు నిర్వహించేది ప్రభుత్వం. అక్కడ దళారుల్ని ప్రోత్సహించేదీ ప్రభుత్వాలే. మద్దతు ధరకు ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేస్తే దళారులు ఎక్కడి నుండి వస్తారు? రైతు సొమ్ము కాజేయడానికి పాలక పార్టీల నుండే దళారులు పుట్టుకొస్తున్నారు. బిజెపిలో అలాంటి వారికి కొరత లేదు. ఇప్పుడు చిన్నపాటి దళారుల స్థానంలో అంబానీ, అదానీ లాంటి పెద్ద కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టడానికే ఈ చట్టం తెచ్చిందన్నది వాస్తవం.

7) రైతుకు మంచి ధర వస్తుందంటే ఓర్చుకోలేక పోతున్నారు.
ఈ ఆరేళ్ళలో రైతుకు మంచి ధర ఎందుకు ఇప్పించలేకపోయారో ముందు బిజెపి సమాధానం చెప్పాలి. మద్దతు ధరలు ఎత్తేసి కార్పొరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై గిట్టుబాటు ధర పొందమని ఈ చట్టాలు తెచ్చారు. వీటిల్లో ఎక్కడా మద్దతు ధరకు కొనాలనిగానీ, అలా కొనకపోతే శిక్షిస్తామనిగానీ, కార్పొరేట్‌ కంపెనీలు ఇవ్వకపోతే ప్రభుత్వమే ఇస్తుందనిగానీ లేదు. పైగా 2017 నుండి స్వామినాథన్‌ సిఫార్సులకనుగుణంగా గిట్టుబాటు ధరల చట్టం తేవాలని ఎఐకెఎస్‌సిసి ఆందోళనలు చేస్తూ వస్తోంది. ఒక నమూనా చట్టాన్ని కూడా తయారు చేసి ఇచ్చింది. బిజెపి ప్రభుత్వం దీన్ని చెత్తబుట్టలో వేసి అదానీ, అంబానీ రూపొందించిన వ్యవసాయ చట్టాలను తెచ్చింది.

8) రైతులకు స్వేచ్ఛనిస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి.
రైతులు కోరుతున్నది రక్షణ. స్వేచ్ఛ పేరుతో ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకొని మార్కెట్‌ అనే అడవిలో కార్పొరేట్‌ కంపెనీలనే పెద్ద పులులకు బక్కచిక్కిన రైతుల్ని మేకల్లాగా బలివ్వడానికి సిద్ధమైంది. అందుకే ఈ చట్టానికి రైతుల, వ్యాపారస్తుల స్వేచ్ఛ అని పేరు పెట్టింది. ఆచరణలో దోచుకునే స్వేచ్ఛ కార్పొరేట్లకు, బలిపీఠంపై ఎక్కే స్వేచ్ఛ రైతులకు వస్తుంది. ఈ చట్టాలతో వ్యవసాయం ఉంటుంది. కానీ రైతు మిగలడు. ఇక స్వేచ్ఛకు అర్ధం ఏమిటి?

9) మార్కెట్‌ యార్డులు మూత పడతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఇది తప్పుడు ప్రచారం కాదు. నిజం. మార్కెట్‌ యార్డులు మూత పడతాయనడంలో సందేహం లేదు. అది చట్టంలో స్పష్టంగా ఉంది. రాష్ట్రాల్లోని మార్కెట్‌ యార్డుల చట్టాలన్నింటినీ సవరించాలని ఈపాటికే ఆదేశాలు పంపింది. మార్కెట్‌ సెస్సులను కూడా రద్దు చేసింది. ప్రభువును మించిన ప్రభు భక్తి ప్రదర్శిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం వీటి అమలుకు కూడా పూనుకుంది. ప్రతి సంవత్సరం ఈ పాటికి రూ.550 కోట్లు వచ్చే మార్కెట్‌ సెస్సు ఈ సంవత్సరం రూ.50 కోట్లు కూడా రాలేదంటేనే మార్కెట్‌ యార్డుల పతనం ఆరంభమైనట్లే అర్ధమవుతుంది. మార్కెట్‌ యార్డులను ఎత్తేయడం ద్వారా దళారుల ఇష్టారాజ్యానికి తెరలేపింది మోడీ ప్రభుత్వం.

10) బ్లాక్‌ మార్కెట్‌ రద్దవుతుంటే దళార్లు ఓర్చుకోలేకపోతున్నారు.
ఈ చట్టాలతో బ్లాక్‌ మార్కెట్‌ వైట్‌ మార్కెట్‌గా మారుతుంది. గతంలో పెద్ద నోట్ల రద్దు చేసి బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చినట్లు ఇది కూడా జరుగుతుంది. నిత్య జీవితావసరాల సరుకుల చట్టసవరణ ఇందుకు ఉదాహరణ. బడా వ్యాపారస్తులు ఎంత సరుకైనా ఎంత కాలమైనా నిల్వబెట్టుకోవచ్చు. తద్వారా రైతుకు లాభసాటి ధర కోసం బేరమాడే శక్తి లేకుండా చేస్తారు. రిలయన్స్‌ ఫ్రెష్‌ లాంటి షాపులు పచ్చగా ఉంటాయి. రైతు నోట్లో మట్టి పడుతుంది.

11) ముస్లిం ఉగ్రవాదులు సిక్కు వేషాలు వేసుకొని వస్తున్నారు.
బిజెపికి ప్రతి ఉద్యమంలోనూ ఉగ్రవాదుల హస్తమో, ముస్లింల కుట్రో కనిపిస్తుంటుంది. సిక్కుల వేషం వేసుకొస్తున్నారని చెప్పడం నీచమైన ప్రచారం. మోడీ లాగా రోజుకో వేషం వేయగలిగే శక్తి రైతులకు లేదు. ఈ ఉద్యమం లోనూ రైతు రైతు లాగే ఉన్నాడు. మహత్తర రైతు ఉద్యమానికి మతం రంగు పులిమి అవమానించడ మంటే భారతీయతను అవమానించడమే.
ఇలాంటివే పలు రకాల కథనాలు సోషల్‌ మీడియాలో సంఘపరివారం వండి వడ్డిస్తోంది. ఇందులో ఏ ఒక్క వాదనకీ సత్తా లేదు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుగా బిజెపి ముసుగు తొలగి అసలు రూపం బయటపడుతున్నందుకు ఉక్రోషం పట్టలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చారిత్రాత్మకమైన ఈ రైతాంగ పోరాటాన్ని తప్పుడు ప్రచారాలతో దొంగదెబ్బ తీయాలనుకుంటే అది సూర్యుడిపై ఉమ్మి వేయడం లాంటిదే. రైతు నాయకుల మధ్య చీలికలు తెచ్చి బలహీనపర్చాలని కుట్రలు పన్నుతున్నారు. ఉద్యమిస్తున్న రైతుల పట్టుదల ముందు అది సాగడం లేదు. ఇప్పటికైనా కేంద్రం మూర్ఖంగా ముందుకు పోకుండా ఈ మూడు చట్టాలను, విద్యుత్‌ బిల్లు-2020ని ఉపసంహరించుకోవడం ఒక్కటే ఉత్తమ మార్గం.

                                                                                          –  వి. శ్రీనివాసరావు
(సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు)