అమిత్‌షా హవాను అడ్డుకున్న పద్మారావు

271

అమిత్జీ ప్రచారం చేసిన రెండు చోట్లా ‘కమలవిలాపం’
మహానగరంలో మీసం మెలేసిన డిప్యూటీ స్పీకర్
తండ్రి విజయంలో భాగస్వాములైన తనయులు
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చూడ్డానికి బక్క పలచగా.. నోట్లో పాన్‌తో.. మైకుల ముందు పెద్దగా మాట్లాడే అలవాటు లేని.. అసలు చూడ్డానికి నాన్ సీరియస్‌గా కనిపించే.. పబ్లిక్‌తో మజాక్ చేసే  ఆ పురానా పహిల్వాన్.. తన కంటిచూపుతోనే దేశంలో అన్ని పార్టీలను వణికించే అమిత్‌షాకే ఝలక్ ఇచ్చారంటే ఎవరైనా నమ్మగలరా?.. నమ్మితీరాలి. ఎందుకంటే అంతపెద్ద దేశ్ కీ నేతా హవానే అడ్డుకుని, ఆయన ప్రచారం చేసిన రెండు డివిజన్లలో ‘కమలవిలాపానికి’ కారకులయ్యారు కాబట్టి! ఆయనే డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు!!

నిజం. దేశంలోనే అత్యంత శక్తివంతుడైన నేతగా పేరున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హవాను అడ్డుకుని, తన ఇలాకాలో కమలం వికసించకుండా, చక్రం తిప్పిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు,  ఇప్పుడు మహానగరంలో.. టీఆర్‌ఎస్‌ను  మీసం మెలేసేంత గర్వపడే స్థాయికి తీసుకువెళ్లారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నగరంలోని అన్ని నియోజకవర్గాలో కమలం ‘పువ్వు’ను నవ్వించగా, పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒక్క సికింద్రాబాద్ నియోజకవర్గంలో మాత్రమే కన్నీరు తెప్పించారు. మొత్తం ఐదు డివిజన్లలో ‘కారు’ను బ్రేకుల్లేకుండా నడిపి, సక్సెస్‌ఫుల్ రథసారధిగా అధిష్ఠానాన్ని మెప్పించారు.

ముఖ్యంగా..  కేంద్రమంత్రి, బీజేపీలో నెంబర్ టూ అమిత్‌షా సికింద్రాబాద్‌లో ప్రచారానికి వస్తున్నారన్న వార్త… కమలనాధుల్లో సమరోత్సాహం నింపగా, గులాబీ దళాల్లో గుండె దడపుట్టించింది. మరి అమిత్‌షాప్రచారానికి వస్తున్నారంటే మాటలా?  ఆయన ప్రచారానికి వస్తే, దాని ప్రభావం ఏ స్ధాయిలో ఉంటుంది? ఆయన ఇమేజ్ ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? అది కదా అధికారపార్టీ శ్రేణుల అసలు కంగారు!

అనుకున్నట్లుగానే అమిత్‌షా ప్రచారం అదరహో అనిపించింది. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధులు, వారి అనుచరులతోపాటు.. మిగిలిన పార్టీల మాదిరిగానే ‘అనేక మార్గాల్లో’ కమలదళాలు చేసిన జనసమీకరణ.. ఫ్లెక్సీల హడావిడి. ఆ వాతావరణం చూసిన ఎవరికయినా, అమిత్‌షా ప్రచారం చేసిన ఆ రెండు చోట్ల మాత్రమే కాదు. సికింద్రాబాద్ మొత్తం కమలవికాసం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడుతుంది. నిజంగా ‘ఆరోజు వరకూ’ అలాంటి వాతావరణమే కనిపించింది. ఏమాటకామాట. కమలదళాలు ఖర్చు కూడా ఆ స్థాయిలో చేశారు.గ్రేటర్ మేయర్ గా బీజేపీ అభ్యర్దీ కావచ్చు!

అయినా.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు అదరలేదు. బెదరలేదు. ప్రతి వ్యూహాలు పన్నలేదు. మళ్లీ అదే నాన్ సీరియస్‌గా కనిపించే ధోరణి. ఆయన  సైలెంట్ కిల్లర్ మాదిరిగా తన వ్యూహాలు అమలు చేశారు. రాత్రి వేళ పదిరెట్లకు మించి చేసే పాదరసం లాంటి వ్యూహాలకు ఊపిరిపోశారు. ఎందుకంటే పద్మారావు రాత్రి వేళలోనే ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి! ఎక్కడయితే అమిత్‌షా ప్రచారం చేశారో, అదే బౌద్ధనగర్-సీతాఫల్‌మండి డివిజన్లలో, చాపకింద నీరులా తాను అనుకున్న ప్రణాళిక అమలుచేశారు.

రెండు డివిజన్ల బాధ్యతలు తన కుమారులకే అప్పగించారు. తాను ఇంట్లో ఉండి సమన్వయం చేశారంతే! తండ్రి మార్గదర్శనం మేరకు,  తనయులు పాదరసంలా క్షేత్రస్థాయికి దూసుకుపోయారు. క్లీన్‌స్వీప్ చేసి తండ్రి పెదవులపై విజయదరహాసం పూయించారు.  ఆ రెండు డివిజన్లలోనే కాదు. సికింద్రాబాద్‌లోని అన్ని డివిజన్ల బాధ్యతలూ పద్మారావు తనయులే మోశారు.
ఫలితంగా… అమిత్‌షా ఆర్భాటంగా ప్రచారం చేసిన ఆ రెండు డివిజన్లలో బీజేపీ ఓడిపోగా, ‘కారు’ పరుగులు తీసింది. నిజానికి ఆ రెండూ ‘కారు’ కాకుండా ‘కమలం’ ఖాతాలో కలవాల్సిన డివిజన్లు! అలాంటి పరిస్థితిని తల్లకిందులు చేసి, అమిత్‌షాకు ‘చేదుగుర్తు’ మిగిల్చిన పద్మారావు..  నియోజకవర్గంపై తనకున్న పట్టు-పలుకుబడిని మరోసారి చాటుకున్నారు. దటీజ్ పద్మారావు!