గ్రేటర్ మేయర్ గా బీజేపీ అభ్యర్దీ కావచ్చు!

551

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో గల 150 డివిజన్ లకు గానూ బీజేపీ 48 డివిజన్లు గెలుచుకుంది. టీ ఆర్ ఎస్ 55 డివిజన్లు గెలుచుకుంటే….;మజ్లీస్ 44 స్థానాలు గెలుచుకుంది. మజ్లీస్ మద్దతు లేకుండా…టీ ఆర్ ఎస్ ఎలా మేయర్ స్థానాన్ని గెలుచుకుంటుందో మేమూ చూస్తామని బీజేపీ నాయకులు టీ ఆర్ ఎస్ కు సవాలు విసురుతున్నారు.
టీ ఆర్ ఎస్ కు మద్దతు ఇస్తే మా కేంటిట అంటూ మజ్లీస్ మడత పేచీకి దిగడం ఖాయమే నంటూ మీడియా లో విశ్లేషణలు , డిబేట్ లు జోరుగా సాగుతున్నాయి.టీ ఆర్ ఎస్, మజ్లీస్ ప్రత్యక్షంగా గానీ; పరోక్షంగా గానీ భుజాల మీద చేతులు వేసుకుని తిరిగినట్టు కనబడితే చాలు….వాటి మీద విరుచుకు పడాలని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. 2023 ఎన్నికలకు- బీజేపీ కి తెలంగాణ లో అదే బ్రహ్మాస్త్రం.
సిటీలోనూ ,తెలంగాణ రాష్ట్రం లోనూ ముస్లిం జనాభా గట్టిగా ఉండడం; ఆ వర్గాలలో ఎం.ఐ. ఎం కు గణనీయంగా గల పలుకుబడే- బీజేపీ కి ప్రధాన ఇంధనం. అందువల్ల, ఈ రెండు పార్టీలు ఏదో ఓ రకంగా చేతులు కలపాలని బీజేపీ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారికి దణ్ణం మీద దణ్ణం పెట్టుకుంటున్నారు.కానీ, అక్కడ ఉన్నది కే సీ ఆర్. కేసీఆర్ కు నిలువెల్లా వ్యూహ చతురతే.ఆయనను తక్కువ అంచనా వేశారో….బిళ్ళబీటుగా వెళ్లి మూసీ నదిలో పడినట్టే.
ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ఎక్స్-అఫిషియో సభ్యుల సాయం అవసరం లేదు అని అనుకుంటే….76 సభ్యుల మద్దతు అవసరం, మెజారిటీ కి. ఇప్పుడు ఏ పార్టీ కి అంత మెజారిటీ లేదు.టిఆర్ఎస్ కు 55 స్థానాలే ఉన్నాయి. ఒక వేళ – మేయర్ ఎన్నిక రోజున మజ్లీస్ గైరు హాజరు అయింది అనుకుంటే- మిగిలేది 106గురు కార్పొరేటర్లు. వారిలో సగం 53. టిఆర్ఎస్ కి మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు తేలికగా లభిస్తాయి. కానీ, ఆ రోజు నుంచే బీజేపీ విరుచుకు పడిపోతుంది…టిఆర్ఎస్ మీద.
ఒక వేళ టిఆర్ఎస్ గైరుహాజరైతే-మిగిలేది 95 మంది. బీజేపీ కి 48 మంది ఉన్నారు. మేయర్ పదవి, డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవచ్చు.టిఆర్ఎస్, మజ్లీస్ రెండూ గైరుహాజరు అయితే- మిగిలేది 51 మంది.బీజేపీ – మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను హ్యాపీ గా గెలిచేసుకుంటుంది.
మరుసటి రోజునుంచి బీజేపీ కష్టాలు మొదలవుతాయి. గ్రేటర్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలుకు….మొత్తం తెలంగాణ రెండేళ్ల బడ్జెట్ కూడా సరిపోదు.
తెలంగాణ లో ఉన్న వరంగల్, ఖమ్మం, కరీమ్ నగర్, నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ వంటి పలు మునిసిపల్ కార్పొరేషన్ల లో హైద్రాబాద్ ఒకటి. ఏ మునిసిపల్ కార్పొరేషన్అయినా…మనుగడకు రాష్ట్రప్రభుత్వ దాయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడాలి. లేకపోతే, సిబ్బంది జీతాలకు కూడా కటకటలే. హైదరాబాద్ ఇందుకు మినహాయింపు కాదు. ఓ నెల రోజులు తిరిగేసరికే…బీజేపీ వాగ్దానాల లోని ఇబ్బందులు ఏమిటో జనానికి తెలిసిపోతాయి. బీజేపీ కార్పొరేటర్లు గానీ…బీజేపీ నేతలు గానీ జనం లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. రోజూ ఎక్కడోచోట టిఆర్ఎస్ కార్యకర్తలో…మజ్లీస్ కార్యకర్తలో… వాగ్దానాలు అమలు చేస్తారా…చస్తారా అంటూ బీజేపీ ని ఉక్కిరిబిక్కిరి చేయడం మొదలు పెడితే…దాక్కోడానికి బీజేపీకి చోటు కనపడదు. అధికార యంత్రాంగం, పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం అదుపులో ఉంటారు.
నోముల నరసింహయ్య మృతి తో ఖాళీ అయిన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేలోపు- నగరం లో బీజేపీ ని టిఆర్ఎస్ ఒక పట్టు పట్టవచ్చన్నది  ఒక అభిప్రాయం. అప్పుడు, బీజేపీ పని – అదేదో ముతక సామెతలాగా తయారవుతుంది. అవతల ఉన్నది కేసీఆర్ అనే స్పృహతో…జాగ్రత్తగా మెలాగడం బీజేపీ కే మంచిది.

-భోగాది వెంకట రాయుడు