రాహుల్, ప్రియాంకకో ప్లాన్ ఉంది!

330

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ తరఫున మోడీ దగ్గరినుంచి అనేక మంది కేంద్ర నాయకులు ఒకరి తరువాత ఒకరు వచ్చారు. మోడీ ఎన్నికల రోడ్ షో నిర్వహించలేదు గానీ…కరోనా వాక్సిన్ రోడ్ షో నిర్వహించారు. ఇందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. ఇతర నాయకులు రోడ్ షోలు నిర్వహించారు. టీ ఆర్ ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావులతో పాటు మంత్రులూ, ముఖ్యనాయకులే గాకుండా- కేసీఆర్  కూడా ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. ఎల్ బీ స్టేడియంలో ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ఎం.ఐ. ఎం. కు ఒవైసీలే అధిష్టానం గనుక- ఆ సోదరులు ఇద్దరూ బాగానే ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ విషయానికి వస్తే- పీ సీ సీ అధ్యక్షుడిగా ఉన్న “ఉత్త”మ్ కుమార్ రెడ్డి ఒక్కరే పెద్ద నాయకుడిగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి- తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఓ రెండు డివిజన్ లు కాంగ్రెస్ కు సాధించి పెట్టారు.
నిజానికి, జాతీయ స్థాయిలో బీజేపీకి మించిన నేతలు ఉన్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకను కాసేపు పక్కన పెడితే….; శశిథరూర్, చిదంబరం, గులాం నబీ ఆజాద్, మోతిలాల్ ఓరా, కపిల్ సిబల్, కమల్ నాధ్, అశోక్ గెహలోత్, సిద్ధ రామయ్య, సచిన్ పైలట్, మాజీ ఐ ఏ ఎస్ రాజు, ఇలా తంబలు తంబలుగా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
అయినా -ఒక్కరు కూడా హైదరాబాద్ ఎన్నికల వైపు తొంగి చూడలేదు.
ఎందుకంటే- కాంగ్రెస్ నేతలతో అత్యధికులు ‘రాజ్యసభ’ బాపతు. ప్రజలలో నుంచి గెలవగలిన సత్తా ఉన్నవారు – వీరిలో బహు తక్కువ శాతం మందే. అయినప్పటికీ- గత 150 సంవత్సరాలుగా ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో పాతుకుపోయి కూర్చున్నారు. వారిని కాదని సోనియా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.
రాహుల్ , ప్రియాంక కూడా వారిని దాటుకుని ముందుకు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో పడిపోయినట్టుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ వృద్ధ నేతలు- రాహుల్ ను, ప్రియాంకను పని చేయనివ్వరు. వారు చేయలేరు.
ఈ పరిస్థితులను గమనించిన అన్నా చెల్లెలు- ఒక వ్యూహం ప్రకారం నడుస్తున్నారేమో అనిపిస్తున్నది.
కాంగ్రెస్ గెలిచినా…గెలవక పోయినా; వారి వ్యక్తిగత స్థాయికి, భద్రతకు ప్రమాదం లేదు. ఆర్ధికంగా ఢోకా లేదు. విదేశాలకు వెళ్లినా రాజ మర్యాదలకు లోపం లేదు.
అందువల్ల, ఓ పదేళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే, వృద్ధ తరం సమస్య ఒక కొలిక్కి వస్తుంది. అప్పుడు తమకు నచ్చిన పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింప చేసుకోవచ్చు. అప్పటికి-అంటే 2029 నాటికి- బీజేపీ డొల్లతనం జనానికి తెలిసొస్తుంది. కనుచూపు మేరలో మరో జాతీయ పార్టీ అనేది లేదు. రాహుల్, ప్రియాంక వైపునే వయసు కూడా ఉంది. ఓ పదేళ్లు వదిలేసినా… బోలెడంత వయసు ఇంకా వారి వైపే ఉంటుంది.
ఈ అంచనా తో వారు ఇప్పుడు – పార్టీ గెలుపు ఓటముల పై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే భావన కలుగుతున్నది. ఇదిగో, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఉత్తంకుమార్ రెడ్డి రాజీనామా చేశారు కదా!ఆ విధంగా ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వృద్ధ జంబూకాల నుంచి కాంగ్రెస్ విముక్తి అయ్యాక, క్రియాశీలకం అవుదామని రాహుల్, ప్రియాంక భావించి ఉంటారు.
అందుకే, వారు హైదరాబాద్ ఎన్నికల వైపు కన్నెత్తి చూసి ఉండరు.
ఓ పదేళ్లు…బీజేపీ దున్నుకోవచ్చు.

-భోగాది వెంకట రాయుడు