కెసిఆర్ చేసిన తప్పులే..బిజెపి విజయానికి కారణం !

460

హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో – కోటి పైగా జనాభా డెబ్బై లక్షల పైగా ఓటర్లు వున్న మహానగరంలో- కెసిఆర్ ఒక కన్ను లొట్టబడి అతి పెద్ద పార్టీగా మాత్రమే గెలిచాడు, సొంతంగా హైదరాబాదు కార్పోరేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్తితిలో పడ్డాడు . మొత్తం 150 సీట్లలో KCR/ TRS 55,
BJP 48, MIM 44, కాంగ్రెస్సు 2 సీట్లు గెలిచాయి.
గతం కంటే సీట్లతో పాట్లు ఓట్ల శాతం KCR కోల్పోయాడు, అదే పరిస్తితిలో బిజెపి సీట్లతో పాటు ఓట్లను కూడా అనూహ్యంగా పెంచుకుంది. KCR కోల్పోయిన వన్నీ BJP గెలుచుకుంది.
ఈ గెలిచి ఓడిన ఎన్నికల పోరాటంలో  కెసిఆర్ చేసిన తప్పులు వరుసగా……
1. అధికారంలోకి రాగానే తెలంగాణ సాధనలో ముందు వుండి పోరాడిన వుద్యమ సంస్తలను నీరు కార్చి వేయడం, వాటిని రద్దు చేయమని కోరడం.ప్రత్యేక తెలంగాణా సాధన కోసం ప్రజా వుద్యమాలనుండి అనేక రకాల JAC లు
వుద్భవించాయి.తాము అధికారంలోకి రాగానే వాటిని అన్నిటినీ రద్దు చేయాలని కోరారు.
2. వాటిలోని  కొందరు నాయకులకు ప్రభుత్వ పదవులు  ఇచ్చి వారిని మాట్లాడకుండా చేసుకున్నారు.
3. విభేదించే వారిని వేధింపులకు గురి చేశారు.
4. దేశ వ్యాపిత ఖ్యాతి కలిగిన  మేధావి, విప్లవ రచయిత వరవర రావు గారిపైన కేంద్ర పాలకులు పెట్టిన  అక్రమ కేసులపైన, అరెస్టుపైన ఎన్ని విజ్నప్తులు చేసినా పట్టకుండా విననట్లుగా వ్యవహరించారు.
5. ప్రజా వుద్యమాల నుండి వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణా వుద్యమ సాధన నాయకుడుగాతనకు భవిష్యత్తులో పోటీ అవుతాడేమోనని భయపడి , ఆయనను వేటాడి హింసించారు.ఆయన తన ఆత్మ రక్షణ కోసం కాంగ్రెసుతో ఫ్రంటు కట్టేలా చేశారు .
6. కాంగ్రెసు పార్టీ సహాయంతో తెలంగాణసాధించి, ఆ పార్టీని సర్వ నాశనం చేయడం కోసం యమ్ యల్ ఏ లను బుజ్దగించడం, బెదిరించడం , బ్లాక్ మెయిల్ చేయడం వంటి చర్యలతో గాలం వేసి తనలోకి లాక్కున్నారు.  అదే రకంగా టిడిపీ ని కూడా  చేసి ఉనికిలో లేకుండా చేశారు. ఇలాటి విద్యలలో తనకంటే అనేక రెట్లు ఆరితేరిన , బలవంతులయిన కేంద్ర పాలకులయిన బిజెపి ముందు గిజగిజ లాడుతున్నారు.
7. సొంత TRS పార్టీలో అనేక వుద్యమాలలో ముందు వుండిన నాయని నరసింహా రెడ్డి( Late) , ఈటెల రాజెందర్ , కె. కేశవ రావు వంటి సీనియర్లను అనామకులుగా
మార్చి వేశారు.
8. చంద్ర బాబు తన కొడుకు కంటే అనేక రెట్లు సమర్ధుడు , మేనల్లుడు అయిన జూనియర్ యన్టీఆర్ కి వ్యతిరేకంగా పద్మవ్యూహాన్ని నిర్మించి తెలుగుదేశం పార్టీ లోకి అతడు రాకుండా చేయగలిగాను అని సంతోషపడి, తర్వాత పార్టీలో తన తర్వాత పార్టీకి నాయకత్వాన్ని వహించే వారు లేకుండా చేసుకుని పతనావస్తకు స్వయంకృతాపర్ధాలతో చంద్ర బాబు నాయుడు చేరాడు. షుమారుగా అలాగే!
తన కుటుంబానికి , అందులోనూ తన కొడుకు అధికారానికి రాజమార్గం ఏర్పడడానికి తన కొడుకు కంటే శక్తి వంతుడు అయిన మేనల్లుడు హరీష్ రావుని చక్రబంధంలో కెసిఆర్ ఇరికించారు. ఒక దశలో హరీష్ రావు బిజెపి లో చేరబోతున్నారనే వార్తలు వచ్చేదాకా పరిస్తితి తెచ్చుకున్నారు.
9. MlM తో అంటకాగుతూ,  ప్రజల సమస్యలలో నిరంతరం వుండే ఎర్రజండా పార్టీలను , వుద్యమ సంస్తలను నిత్యం అవమానించుతూ వచ్చారు.
10. ప్రజా సమస్యల గురించి చేసిన వాగ్దానాలు, ఎన్నో వాటన్నిటి వూసే ఎత్తకుండామరచారు.
11. భాష పట్ల మమకారం కలిగిన తెలంగాణా ప్రజలను , ఆ భాషకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టి తన అధికార సోపానానికి సాధనగా గెలుపుకోసం వాడుకున్నారు.
తన వాక్చాతుర్యానికి కారణమైన తన తెలంగాణా తెలుగు భాషను తాను అధికారంలోకి రావడానికి వాడు కున్నారు కానీ ఆ భాషకు మేలు ఏమీ చేయలేదు. కొందరు కవులు, రచయితలు, కళాకారులకు తన ఆస్తానంలో పదవులు ఇవ్వడమే తెలుగు భాష ఉధ్దరణగా
మార్చి వేశారు.
12. మన భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాల హక్కుల రక్షణ కోసం చేయాల్సిన పోరాటానికి ఎంతో ప్రాధాన్యత వుంది. పోయిన సంవత్సరం
ఎన్నికలకు ముందు, సమాఖ్య హక్కుల రక్షణ కోసం ఫ్రంటు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.కానీ ఆ పేరుతో బిజెపి ఫ్రంటులోని పార్టీలను మాత్రం కలవకుండా, బిజెపి వ్యతిరేక పార్టీలను మాత్రమే కలసి మాట్లాడి, బిజెపి గెలుపుకు పరోక్ష సహకారం అందించారు.  “బిజెపి బి టీమ్ లీడర్ అని” పేరు తెచ్చుకున్నారు.
13.బిజేపి చేసిన అనేక నిరంకుశ , ప్రజావ్యతిరేక – కార్మిక, రైతు వ్యతిరేక తదితర చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టలేదు. 2016 లో మోడీ నోట్ల రద్దు కార్యక్రమాన్ని ఆ తర్వాత జి యస్ టి చట్టాన్ని ఎక్కడ వెనకపెడతామో అని అందరికంటే ముందుగానే బలపరిచారు.
14. దేశంలో మత సామరస్యాన్ని , మత సహజీవనాన్ని దెబ్బతీసే విభజన వాద రాజకీయాలలో ఆరితేరిన బిజెపి, తాను అధికారంలోకి రావడానికి ఒక్కో రాష్ట్రం తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని చుట్టబెడుతుంటే మాట్లాడకుండా వుండి, ఈ GHMC ఎన్నికల సందర్భంగా మత సహజీవనాన్ని బిజెపి దెబ్బ తీస్తున్నది అని చెప్పడం వలన అతడి మాటలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఒంటి కాలితో వున్న KCR నిజంగా ప్రజా పక్షంగా ఆలోచించ దలచుకుంటే ఈ తప్పులను సరిదిద్దుకోవాలి.
A. తెలంగాణా వుద్యమ కాలంలో చురుకుగా పాల్గొన్న వుద్యమ సంస్తలను గౌరవించాలి, వారిపై  వేధింపులు వెంటనే ఆపాలి.
B. ఎర్రజండా పార్టీలతో శతృత్వాన్ని వీడాలి, వారే నిజమైన ప్రజా పక్ష మితృలుగా భావించాలి!
C. ప్రజా వుద్యమ మేధావి వరవర రావు విషయంలో తన పరిధిలో చేయతగిన సహాయం చేయాలి!
D. ప్రొఫెసర్ కోదండ రామ్ పట్ల చేసిన పొరపాటులను సరిచేసుకుని గౌరవించాలి.
E. పార్టీలోని సీనియర్లకు తగిన బాధ్యతలు ఇవ్వాలి.
F. రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం చిత్తశుద్దిగా కృషి చేయాలి.
G. MIM తో లోపాయికారీ వ్యవహారాలు  మానాలి. వారితో లోపాయికారీ సంబంధాలు బిజెపి పెరుగుదలకు మాత్రమే దోహద పడతాయి.
H. మనువాద , ఫాసిస్ట్ బిజెపి పాలకులకు వ్యతిరేకంగా స్తిరమైన పోరాటం కొనసాగించాలి!
ఆ పోరాటానికి పైన పేర్కొని వున్న మితృ శక్తుల  అందరి సహాయాన్ని తీసుకోవాలి. వారే బిజెపికి స్తిరమైన వ్యతిరేక పోరాట శక్తులుగా గుర్తించాలి!
అలా చేయక పోయినచో  బిజెపి KCR ని ఓడించడమో లేక  AP లో జగన్ లాగా బిజెపికి 100 శాతం సహకరించాల్సిన పరిస్తితి KCR కి ఏర్పడడమో జరుగుతుంది.అనేక పోరాటాల గడ్డ అయిన తెలంగాణా ప్రజల భవిష్యత్తు కోసం
KCR ఏమి చేస్తారో చూద్దాం! తన భవిష్యత్తు నడక ఎలా వుండాలో KCR చేతిలో వున్న పనే!
KCR ఇష్టమే!

                   (రేకా చంద్ర శేఖర రావు)

1 COMMENT

  1. మీకు ఇంకా TRS-BJP కుమ్మక్కు రాజకీయాలు అర్థం కానంత వరకు ఇలాంటి స్టోరీలు రాస్తూనే ఉంటారు. కేంద్రం నుంచి బడా బడా నాయకులు వచ్చి, హిందు ముస్లిం తేడా గురించి చెబుతారు గాని KCR అవినీతి గురించి, అతని పాలన, కోవిడ్ ఎదుర్కోవడంలో వైఫల్యాల గురించి ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ కూడా బీజేపీ మీద అవినీతి ఆరోపణలు ఎందుకు చేయలేదు? లాక్ డౌన్ సందర్భంగా కేంద్రం వ్యవహరించిన తీరు, పెట్టుబడిదారులకు సాగిలపడుతున్న తీరును ఎందుకు విమర్శించలేదు ఎందుకు ?