నవాబుల నగరంలో కాషాయోత్సవం..!!

దుబ్బాక గెలిచాం..!
గ్రేటర్లో సత్తాచాటాం..!!
నాగార్జున కొండ మీద కాషాయ జెండా ఎగరేద్దాం..!!
2023లో తెలంగాణ తోటలో కమలాన్ని పూయిద్దాం..!!
బీజేపీ వాళ్లు ప్రస్తుతం ఈ పాట పాడుకోవచ్చు..!
భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పలేని ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే వారు కూడా ఊహించని విజయమిది. హైదరాబాద్ సరస్సులో కమలం విరబూసింది. గులాబీ కోటను కమలనాధులు బద్దుల కొట్టారు. కారును కంగుతినిపించడమే కాదు, మజ్లిస్ కంటే ఎక్కువ సీట్లు సాధించి భవిష్యత్తు తమదే అంటూ ఉత్సాహంతో పండగ చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. దుబ్బాక పూర్తిగా రూరల్ ప్రాంతం కానీ..చైతన్యవంతమైన ఏరియా. ఒకప్పుడు అన్నలు ఆటలు , పాటలతో మారుమోగిన దుబ్బాకలో ఇప్పుడు భారతమాతకు జై అనే నినాదాలు వినిపిస్తున్నాయి.
యువత కాషాయ వస్త్రాలు ధరించి, కమలం పువ్వును చేత పట్టుకుని జై మోదీ అంటూ నినదిస్తుంది. దుబ్బాకలో విజయం బీజేపీకి టర్నింగ్ పాయింట్.
ఆ ఊపును అర్బన్ ప్రాంతమైన జీహెచ్ఎంసీలో కూడా బీజేపీ చూపించింది.టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందని దుబ్బాక తెలియజేస్తే, చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని జీహెచ్ఎంసీ ఫలితాలు స్ఫష్టం చేశాయి. గత ఐదేళ్లుగా విశ్వనగరం అనేది నినాదానికే పరిమితమైంది. వరద వస్తే అంతే సంగతులు అన్నట్లు హైదరాబాద్ తయారైంది. తీగలు వంతెనలు ఓట్లు రాల్చవనే విషయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలి. హైదరాబాదీలకు ఏం కావాలో తెలుసుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తండ్రీ,కొడుకులు మాటలకే పరిమితమయ్యారనే వాదన హైదరాబాదీల్లో బలంగా ఉంది. టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, వరదలు, హైదరాబాద్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హిందూ సెంటిమెంట్‌ను కమలనాధులు క్యాష్ చేసుకున్నారు. తెలంగాణలో బీజేపీ టార్గెట్ మజ్లిస్, తరువాతే టీఆర్ఎస్.
మజ్టిస్ను ఢీకొనడంలో వచ్చే ఆనందం కమలనాధులకు కారుతో పోటీ పడటంలో రాదు. హైదరాబాదీలు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ ముసుగు తీసేలా ఉంది.ఇన్నాళ్లు తమకు ఎంఐఎంకు సంబంధంలేదని చెప్పుకున్న గులాబీ దళం ..ఇప్పుడు మేయర్ సీటు కోసం మజ్లిస్‌తో కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగేతే 2023 బీజేపీ ఎజెండా సిద్దంగా ఉందనే చె ప్పుకోవాలి. బీజేపీకి కావాల్సింది కూడా టీఆర్ఎస్ – ఎంఐఎం కలవడమే. అప్పుడు హిందూత్వ ఎజెండాకు మరింత పదును పెట్టవచ్చు అనేది కమలనాధుల వ్యూహం.
జీహెచ్ఎంసీలో 48 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు కూడా అంచనా వేసి ఉండరు. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే చాలా విచిత్రమైన తీర్పును ప్రజలు ఇచ్చారు . డిసెంబర్ 1న జరిగిన పోలింగ్‌లో 46 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 54 శాతం మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మెజార్టీ ప్రజలు రాజకీయ పార్టీలను తిరస్కరించి వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంత మంది కోవిడ్ వలన ఇంటి నుంచి రాకపోవచ్చు. మరికొంత మంది నాలుగు రోజుల వరుస సెలవులు రావడంతో సిటీ రిసార్ట్స్, అవుట్ కట్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ 31.43 శాతం ఓట్లతో 48 సీట్లను కైవసం చేసుకుంది.
ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ 30.79 శాతం ఓట్లతో 55 సీట్లను గెల్చుకుంది. ఎంఐఎం 15.97 శాతం ఓట్లతో 44 స్థానాలను గెల్చుకుని తమకు తిరుగులేదని నిరూపించుకుంది. బీజేపీకి 12లక్షల 13వేల900 ఓట్లు పోలుకాగా, టీఆర్ఎస్కు 11లక్షల 89వేల 250 ఓట్లు పోలయ్యాయి.2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 3లక్షల 46 వేల 253 ఓట్లతో సరిపెట్టుకున్న కమలనాధులు ఈ ఎన్నికల్లో 8.67 లక్షల ఓట్లు పెంచుకున్నారు.
2016 ఎన్నికలతో పోల్చుకుంటే టీఆర్ఎస్ 2.79లక్షల ఓట్లను కోల్పోయింది. 2016లో నాలుగు సీట్లు మాత్రమే గెల్చుకున్న కమలదళం ఈ ఎన్నికల్లో 48 సీట్లు గెల్చుకుని టీఆర్ఎస్ -ఎంఐఎంలకు భవిష్యత్తు హెచ్చరికలు జారీ చేసింది. బీజేపీకి కలిసి వచ్చిన అంశం టీడీపీతో పొత్తు లేకపోవడం. టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చి ఉండేవి కావు. 2016లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రంగంలొకి దిగిన బీజేపీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెల్చుకుంది. ఈ ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ ఎక్కడా కూడా డిపాజిట్లు దక్కించుకోలేక సైకిల్‌కు పంక్చర్ చేసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి చాలా అంశాలు కలిసి వచ్చాయి.
1.టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత 2. కేసీఆర్ – కేటీఆర్‌లను మాటల మాంత్రికులగానే చూడటం 3.ఎంఐఎంతో రహస్య అవగాహన ఉందని హిందూత్వాన్ని బలపరిచే ఓటర్లు నమ్మడం 4. ఎన్టీఆర్ – పీవీ ఘాట్లు కూలగొట్టాలంటూ అ క్బరుద్దీన్ వ్యాఖ్యలు 5. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా జీహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ బలహీనపడటం 6.టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని ప్రజలు చూడటం. 7.ఎంఐఎం దూకుడును అడ్డుకోవాలంటే బీజేపీయేని ఒక వర్గం ఓటర్లు బలంగా నమ్మడం 8. కూకటిపల్లి మినహా సెటిలర్లు బీజేపీకి ఓటు వేయడం. ఇవన్నీ కూడా బీజేపీ కలిసి వచ్చిన అంశాలు. అంతేకాకుండా ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ నేతలు భావోద్వేగాలను రెచ్చగొట్టారనే చెప్పాలి. ఎన్టీఆర్,పీవీ ఘాట్లను కూలగొట్టాలని అక్బరుద్దీన్ అంటే దారుస్సాలాంను కూలగొడతామని బండి సంజయ్ విరుచుకు పడటం ప్రజల్లో ఒక్కసారిగా భావోద్వేగాలు పెంచాయి. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చాయనే చెప్పుకోవాలి.
దక్షిణాదిలో ఇప్పటికే కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా ఎగరేయాలి అనేది బీజేపీ పట్టుదల.అందుకు తగ్గ సాంస్కృతిక వాతావరణం, చారిత్రక నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని కమలనాధులు గ్రహించారు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు రచించుకున్నారు. ఆ ప్రణాళికలు ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ను తొలగించి బండి సంజయ్‌ను నియమించడంతోనే తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చింది. ఆ ఊపును బండి సంజయ్ ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు తీసుకెళ్లారు. టీఆర్ఎస్తోనే కాదు ఎంఐఎంతో కూడా ఢీ అంటే ఢీ అన్నారు కమలనాధులు. ఈలోగా తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడటం కూడా కమలనాధులకు బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్‌లో ఒక వర్గం ఓట్లు బీజేపీకి పడుతూ వచ్చాయి. దుబ్బాక, గ్రేటర్లో జరిగింది ఇదే. గ్రేటర్ఫలితాలు టీఆర్ఎస్ కే కాదు ఎంఐఎంకు కూడా హెచ్చరిక.
గ్రేటర్ ఫలితాలు తెలంగాణ రాజకీయ చిత్ర పటాన్ని మార్చబోతున్నాయి. ఇది చాలా వేగంగా జరగబోతుంది. కేసీఆర్ వ్యతిరేక శక్తులు అన్ని బీజేపీకి సహకరించడానికి సిద్దమయ్యాయి. తెలంగాణలోని కేసీఆర్ వ్యతిరేక శక్తులను బీజేపీ కాషాయ గూటి కిందకు తీసుకు రాగలిగితే తమ 2023లో అధికారంలోకి రావాలన్న బీజేపీ ప్రయత్నాలు మరింతగా ఊపందుకుంటాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా బీజేపీ గూటి కిందకు తీసువస్తే తెలంగాణలో సోషల్ ఇంజినీరింగ్ మారిపోతుంది. బీసీ -అగ్రవర్ణాల సోషల్ ఇంజినీరింగ్‌తో 2023పై కమలనాధులు గురి పెట్టవచ్చు. తెలంగాణలో చాలా వరకు బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్‌కు సోషల్ ఇంజినీరింగ్ ఓట్లు తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక..మోదీ హవా, కేంద్ర విధానాలతో న్యూట్రల్ ఓటర్ చాలా వరకు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. కొన్ని నెలలుగా చైనాపై మోదీ వ్యూహాత్మక దాడి, పీఓకేలో పాక్ సైనికులను తరిమి కొట్టడం లాంటివి విద్యావేత్తలు, న్యూట్రల్ ఓట్లు బీజేపీకి పడేలా చేశాయనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికలకు – జాతీయ – అంతర్జాతీయ విధానాలకు సంబంథం లేనప్పటికీ కొంత మంది ఓటర్లు వీటితో ప్రభావితం అవుతారనే చెప్పాలి.
దుబ్బాకలో ప్రారంభమైన బీజేపీ జైత్రయాత్ర గ్రేటర్ మీదుగా నాగార్జున సాగర్ వరకు కొనసాగుతుందా ? లేదా ? అనేది కూడా చూడాలి. దుబ్బాక వేరు, గ్రేటర్ డిఫరెంట్, ఇక నాగార్జున సాగర్‌లో బీజేపీకి జెండా కట్టేవారు ఉన్నారా? లేదా ?అనేది చూడాలి. అక్కడ జానా రెడ్డి బలమైన నేత. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్య చనిపోవడంతో సాధారణంగానే సానుభూతి ఉంటుంది. అదిగాక నోముల నరసింహయ్య వామఫక్ష బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. దుబ్బాక ఫలితం చూసిన కేసీఆర్ నోముల నరసింహయ్య సతీమణికి టికెట్ ఇస్తారా ?లేదా అనేది చూడాలి. దుబ్బాకలో టీఆర్ఎస్ రూ.200 కోట్లు పంచిందని టాక్. అయినా ..రఘునందన రావు చేతిలో ఓడిపోయారు.
గ్రేటర్ దెబ్బతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీని నాగార్జున సాగర్‌లో ఢీ కొట్టాలంటే టీఆర్ఎస్ దుబ్బాక కంటే ఎక్కువుగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాగార్జున సాగర్‌లో బీజేపీకి జెండా కట్టేవాడు లేకపోయినా…రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌లో అధిక శాతం బీజేపీకి పడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ మీద వ్యతిరేకత, జానా రెడ్డి ప్రాబల్యం తగ్గడంతో న్యూట్రల్ ఓటర్ బీజేపీ వైపు మొగ్గే అవకాశముంటుంది. ఇప్పటి నుంచే బీజేపీ నాగా ర్జున సాగర్‌లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే దక్షిణి తెలంగాణలో జెండా పాతి 2023కు మార్గం సుగుమం చేసుకోవచ్చు. కానీ..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు ఉన్నారనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు పెట్టుకుని మాట్లాడి, వ్యూహ రచన చేసుకుంటేనే 2023లో సానుకూల ఫలితాలు వస్తాయనే విషయాన్ని కమలనాధులు గుర్తు పెట్టుకోవాలి.
( వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ )