ప(త)ప్పులో కాలేసిన..ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!

3070

గ్రేటర్ ఎన్నికల్లో పారిపోయిన టీడీపీ
బీజేపీ-టీఆర్‌ఎస్‌కు బాబు భయపడ్డారా?
మరి తిరుపతిలో ప్రచారం ఎందుకు?
బాబు జాతీయ పార్టీకి అర్ధాలు వేరులే
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

రాజకీయాల్లో హత్యలుండవు. అన్నీ ఆత్మహత్యలే. ఇది చెప్పిన ఆ మహానుభావుడి మాట, భారత రాజకీయాల్లో నిరంతరం నిజమవుతూనే ఉంది. రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనని.. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను ఎంపిక చేసి, చక్రం తిప్పానని చెప్పుకునే.. చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ, గ్రేటర్ ఎన్నికల్లో చూపిన పలాయనత్వం చూస్తే.. అది మరోసారి నిజమని తేలింది. గ్రేటర్ ఎన్నికల్లో 106 చోట్ల పోటీచేసిన ఆ పార్టీకి, ఎక్కడా ధరావత్తు దక్కకపోవడం ఒక విషాదమయితే, జాతీయ పార్టీ అని చెప్పుకునే అగ్రనేతలెవరూ అక్కడ ప్రచారంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం మరో విషాదం. అయితే.. ఈ విషాదానికి కర్త-కర్మ-క్రియ బాబుగారేనన్నది తెలంగాణ తమ్ముళ్ల వాదన.

సృష్టిలో కొన్ని జంతువులు-కీటకాలు-సర్పాలు తన గుడ్లను తానే మింగేస్తాయి. కానీ రాజకీయాల్లో కూడా అలాంటి వింత పార్టీలుంటాయని, గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పలాయనవాదం చూస్తే ఎవరికయినా స్పష్టమవుతుంది. ఈ ఎన్నికల్లో 106 డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని.. స్వయంగా అధ్యక్షుడయిన చంద్రబాబు గానీ, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శయిన ఆయన తనయుడు లోకేష్ గానీ ఎక్కడా ప్రచారం చేయకపోగా, కనీసం పత్రికాప్రకటన కూడా ఇవ్వకపోవడం బట్టి.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి అసలు ఏమైంది? అన్న ప్రశ్నలు తమ్ముళ్లలో సహజంగానే తలెత్తుతున్నాయి. పేరుకు జాతీయ పార్టీ అయినప్పుడు, జాతీయ నేతలెవరూ ఎందుకు ప్రచారానికి రాలేదు? కనీసం పార్టీ అభ్యర్ధులను ఆర్ధికంగా ఆదుకోకుండా ఎందుకు గాలికి వదిలేసింది? వంటి ప్రశ్నలు తమ్ముళ్లను తొలుస్తున్నాయి.

బహుశా తమ అధినేత అటు బీజేపీ.. ఇటు టీఆర్‌ఎస్‌ను చూసి భయపడే ఎన్నికల్లో అంటీముట్టకుండా, తామరాకుమీద నీటిబొట్టు చందంగా వ్యవహరించినట్లు అనుమానించాల్సి వస్తోందని తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘ ఇవి బీజేపీని దారికి తీసుకువచ్చే కీలకమైన ఎన్నికలు. కనీసం 30 డివిజన్లలో దృష్టి సారించి, అక్కడ అన్ని వనరులు కేంద్రీకరిస్తే కనీసం 2,3 సీట్లు వచ్చేవి. దానితోపాటు, అక్కడ రెండోస్థానంలోనయినా ఉండేవాళ్లం. అది కచ్చితంగా బీజేపీ విజయంపై ప్రభావితం చూపేది. అంటే బీజేపీ ఇప్పుడొచ్చిన సీట్లలో సగం చోట్ల దెబ్బతినేది. అప్పుడయినా ఆ పార్టీకి టీడీపీ విలువేమిటన్నది తెలిసేది. నేను 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నాకే ఇంత చిన్న విషయం తెలిస్తే, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన సార్‌కు ఆ లాజిక్కు తెలియకపోవడమే విచిత్రంగా ఉంది. బహుశా సారు వయసు రీత్యా గందరగోళంలో ఉండి ఉండాలి. లేదా బీజేపీకో, టీఆర్‌ఎస్‌కో భయపడి ఉండాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి మాత్రం పక్కా’ అని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి అభ్యర్ధులకు నయాపైసా కూడా సాయం దక్కలేదంటే, బాబు ఆ రెండు పార్టీలను చూసి భయపడుతున్నారన్న సంకేతమే వెళుతోంది.

సరే.. చంద్రబాబు నాయుడు వయసు రీత్యా, కరోనా కారణంగా ప్రచారానికి వెళ్లలేదనుకుందాం. మరి ఆయన తనయుడు లోకేష్ యువకుడే కదా? ఆయనకేమైంది? గత ఎన్నికల్లో నేను చెడ్డీలు వేసుకుని తిరగానని, నిఖార్సయిన హైదరాబాదీనని చెప్పిన యువనేత, ఇప్పుడెందుకు ప్రచారానికి వెళ్లలేదన్నది తమ్ముళ్ల ప్రశ్న. మరి జాతీయ నేతలెవరూ ప్రచారానికి రానప్పుడు.. అసలు జాతీయ అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులే కాడి కిందపడేసినప్పుడు, ఇక పార్టీకి జాతీయ హోదా ఎందుకన్నది మరికొందరి ప్రశ్న. ఏదో అరవిందకుమార్ గౌడ్ వంటి నేతలే తిప్పలుపడి, సొంతగా చేతిచమురు వదిలించుకుంటే, పాపం 106 చోట్ల అభ్యర్ధులను వెదికేందుకు సాయిబాబా వంటి మరో అగ్రనేత నానా పాట్లు పడాల్సి వచ్చిందట. ఇదీ రాజధానిలో టీడీపీ దుస్థితి.

గత గ్రేటర్ ఎన్నికల్లో ఒక సీటు, 4,39,047 ఓటు, 13.11 శాతం సాధించిన టీడీపీ.. ఇప్పుడు అసలు ఒక్క సీటు కూడా లేకుండా కేవలం 55,662 ఓట్లతో అత్యల్పంగా 1.66 శాతం తెచ్చుకున్న తమ పార్టీని ఇంకా జాతీయ పార్టీ అనే అంటారా? అన్నది ఆ పార్టీ సీనియర్ల ప్రశ్న. ఇంతోటి దానికి అసలు పోటీ చేయకుండా ఉంటేనే సరిపోయేది కదా? వైసీపీ కూడా టీడీపీ మాదిరిగానే జాతీయ పార్టీ అయినప్పటికీ, అది స్థిత ప్రజ్ఞత ప్రదర్శించి పోటీకి దూరంగా ఉందని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

‘‘కనీసం అభ్యర్ధులకు ఒక్క రూపాయి సాయం కూడా చేయకపోతే, ఇక భవిష్యత్తులో పార్టీని ఏం నడిపిస్తారు? ఆర్ధిక వ్యవహారాల్లో లోకేష్ వ్యవహారశైలి మారకపోతే ఆయన పార్టీని నడిపించడం కష్టమే. రాజకీయ పార్టీని కూడా కార్పొరేట్ కంపెనీలా చూస్తే , పనిచేసేవారెరూ మిగలరు. బాబు గారిలా పార్టీని నడిపించాలంటే, లోకేష్ ఇంకా చాలా నేర్చుకోవాలి. డబ్బుల విషయంలో పట్టువిడుపులుంటేనే ఏదైనా ఫలితాలొస్తాయి. ఆ విషయంలో ఎన్టీఆర్‌లా ఉంటే మాత్రం లోకేష్ ఎప్పటికీ నాయకుడు కాలేరు. సార్‌లా ఉంటేనే నిలబడగలుతార’ని నల్లగొండకు చెందిన ఓ సీనియర్ నేత నిర్మొహమాటంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా.. ఆర్ధిక వ్యవహారాలన్నీ చంద్రబాబు చేతి నుంచి కుటుంబసభ్యుల చేతికి వెళ్లాయన్న అభిప్రాయం రెండు రాష్ట్రాల్లోని టీడీపీ నేతల్లో బలంగా నెలకొంది. దానిపై అగ్రనేతలు సైతం బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నిజం ‘నారా’యణుడికెరుక!

అయితే గ్రేటర్‌లో ప్రచారం చేయని చంద్రబాబు, తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మాత్రం ఎందుకు ప్రచారం చేస్తారన్న, కొత్త చర్చ ఆ పార్టీలో మొదలయింది. జాతీయ పార్టీకి రాష్ట్రానికో విధానం ఉండదు కాబట్టి, ఆ ఎన్నికలను కూడా.. గ్రేటర్‌లో మాదిరిగానే, తిరుపతి జిల్లా స్థానిక నాయకత్వానికే అప్పగిస్తారేమోనంటున్నారు. గ్రేటర్ ఎన్నికలలో రూపాయి ఇవ్వనందున, అదే విధానం తిరుపతిలోనూ పాటించడం ఖాయమంటున్నారు. అసలు ప్రాంతీయ పార్టీలంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. అవన్నీ కుటుంబసభ్యుల దయాధర్మాలపైనే ఆధారపడి మనుగడ సాగిస్తుంటాయి. రాజకీయాలంటేనే ఓ వ్యాపారం. ముందు పెట్టుబడి పెట్టడం. తర్వాత సంపాదించుకోవడం. కానీ ఇప్పటితరం యువనేతల భావన అందుకు భిన్నం. లాభం లేని వాటికి పెట్టుబడి ఎందుకన్న భావన. అర్ధం చేసుకోరూ….

 

3 COMMENTS