ఢిల్లీ రైతు ఉద్యమంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

248
మోదీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో జరుగుతున్న పంజాబ్, హర్యానా రైతుల ఉద్యమంపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు మొదటిసారిగా ఓపెన్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులు, రైతు సంఘాల ప్రతినిధుల ఏకాభిప్రాయం సాధించాలన్నారు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలని మోదీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలపై రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలని చంద్రబాబు సూచించారు.
అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరపాలని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలన్నారు. బిల్లులను హడావిడిగా ప్రవేశపెట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని హితవు పలికారు. సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలని స్పష్టం చేశారు. ఈ చట్టాల వల్ల అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతులపై మరింత భారం మోపే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కనీస మద్దతు ధర రైతుకు చట్టబద్ధమైన హక్కుగా ఉండాలని చంద్రబాబు అన్నారు. కొందరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండకూడదని చంద్రబాబు అన్నారు. కాగా, ఢిల్లీ రైతు ఉద్యమంలో ఏపీ నాయకులు సైలెంట్‌గా ఉంటున్న తరుణంలో చంద్రబాబు మొదటిసారి ఓపెన్ అయ్యారు. ఈ బిల్లులపై వైసీపీ మొదటి నుంచి అనుకూలంగానే ఉంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రైతుల మేలు కోసమే ఈ చట్టాలు తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంటులో సైతం ఈ బిల్లులపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కోరారు.