మిస్టర్ ఇండియా పోటీలకు అమలాపురం కుర్రోడు

599

మోడలింగ్ రంగంలో భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన ‘టాలెంటికా’ సంస్థ నిర్వహించేటువంటి “మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్- 2020” పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి అమలాపురం కుర్రోడు మేడిద నాగేంద్ర ఎన్నికయ్యారు. 22 రాష్ట్రాల నుండి 22 మంది పోటీదారులు ఇందులో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి ఒకరిని మాత్రమే ఇందులో ఎన్నిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి మేడిద నాగేంద్ర ఎన్నికవ్వడం విశేషం. గతంలో టాలెంటికా సంస్థ సౌత్ ఇండియా స్థాయిలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన పోటీలలో నాగేంద్ర టాప్ మోడల్ విజేతగా  నిలిచారు. నాగేంద్ర స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం పట్టణం. ఈ నెల 12 నుండి గోవా రాష్ట్రంలో మొదలవుతున్న ఈ పోటీలలో మేడిద నాగేంద్ర ఆంధ్రప్రదేశ్ వస్త్రాలు అయినటువంటి ఉప్పాడ పట్టు, శ్రీ కాళహస్తి నుండి కలంకారీ మరియు బండారులంక చేనేత వస్త్రాలతో తయారు చేసేటువంటి పూర్తి సాంప్రదాయకమైన వస్త్రాలతో రాంప్ వాక్ చేస్తారు. ఈ వస్త్రాలంకరణ ఫాషన్ డిజైనర్ పూర్ణ నిమ్మన తయారు చేస్తున్నారు. చివరి రౌండ్ ముంబైలో జరుగుతుంది. చిత్ర పరిశ్రమలో మంచి నటుడు కావాలన్నది నాగేంద్ర లక్ష్యం. అందు కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. మిస్టర్ ఇండియా పోటీలలో ముంబయ్ ర్యాంప్ పై తెలుగు వాడి సత్తా చాటాలని, నాగేంద్ర విజేతగా నిలవాలని  కోరుకుందాం.

1 COMMENT