పత్రికాధిపతులకు అక్రెడిటేషన్ కార్డు ఎందుకు?

349

ఎడిటర్ల ముసుగులో కార్డులు పొందుతున్న యజమానులు
వామపక్ష నేతలకూ జర్నలిస్టు కార్డులా?
ఈసారయినా ప్రక్షాళన జరిగేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

ప్రెస్ అక్రెడిటేషన్ కార్డు. ఇది జర్నలిస్టులకో గుర్తింపు. అది వారి హక్కు కూడా. కానీ చాలామంది దానిని ఓ ప్రతిష్ఠగా భావిస్తారు. దానివల్ల వచ్చే లాభాలుంటాయా అంటే ఏమీ ఉండవు. ఆర్టీసీ-రైలు ప్రయాణాల్లో రాయితీ తప్ప. ఈమధ్య హెల్త్‌కార్డులిస్తున్నారు. అంతే. అలాంటి దానికోసం బోలెడన్ని పైరవీలు. జర్నలిస్టు సంఘాల సిఫార్సులు, మెహర్బానీలు. కొన్ని పత్రికలయితే, కార్డుకు ఇంత అమ్ముకుంటున్న రోజులివి. చిన్న-మధ్య తరహా పత్రికల్లో అయితే.. జిల్లాల వారీగా చాలామంది ఫ్రాంచేజీలు కొనుక్కునేది కూడా ఇందుకే.

అయితే.. వాటికి ఎడిటర్ల సంతకాలు ఉండవు. జిల్లాల్లో నెలవారీ ఎవరయితే డబ్బులిచ్చి ఫ్రాంచేజీ తీసుకుంటారో, వారి పేర్లతోనే డీపీఆర్‌ఓలకు లేఖలు రాస్తుంటారు. ఆ ప్రకారంగా ఒక్కో కార్డు 5వేల రూపాయల నుంచి, వారి అవసరాల మేరకు అమ్ముడవుతున్న మాట.. మనం మనుషులం అన్నంత నిజం. ఫ్రాంచేజీ తీసుకునే వారికి… ఇలాంటి ఆదాయం వెసులుబాటు ఉందన్న విషయం తెలిసిన, కొన్ని మధ్య తరహా పత్రికల యాజమాన్యాలు, జిల్లా ఫ్రాంచేజీలను 2 నుంచి 4 లక్షలకు అమ్ముతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పత్రికారంగంలో జరుగుతోంది ఇదే. నిజానికి పత్రికా సంపాదకులు లేదా బ్యూరోచీఫ్ సంతకాలు మాత్రమే వాటిపై ఉండాలన్నది నిబంధన. సమాచార శాఖ అధికారులు దీనిని అమలుచేస్తున్న దాఖలాలు లేవు.

సరే.. చిన్న పత్రికలంటే వాటి ప్రాణం తక్కువ కాబట్టి, ఆదాయం కోసం అక్రెడిటేషన్లకు కక్కుర్తి పడ్డాయనుకోవచ్చు. కానీ సొంత ప్రింటింగ్ ప్రెస్సులు, బోలెడంత వ్యవస్థ, సమాచారశాఖ-భూసేకరణ యాడ్స్‌తో కోట్లకు పడగలెత్తిన ఒకస్ధాయి పత్రికా యాజమాన్యాలు కూడా, అక్రెడిటేషన్లలో కక్కుర్తికి పాల్పడటమే రోత. ఈ తరహా పత్రికలకు యజమానులే సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి వారికి జర్నలిజంతో సంబంధం ఉండదు. ఎప్పుడూ ఎక్కడా పనిచేసిన దాఖలాలు అసలే ఉండవు. వాటికి పెట్టుబడిదారులు మాత్రమే. ఓ వైపు ఆర్‌ఓసీ (రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్)లలో వారు, భార్య, పిల్లల పేర్లే డైరక్టర్లు, ఎండీలుగా ఉంటాయి. అందుకు వారు జీతం కూడా తీసుకుంటారు. కానీ, ఎడిటర్ల ముసుగులో అక్రెడిటేషన్ కార్డులు పొందుతున్న దొడ్డిదారి విధానం తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా కొనసాగుతోంది.

ఆఖరకు.. జైలుశిక్షలు అనుభవించిన వారు కూడా ఎడిటర్, చీఫ్ ఎడిటర్ల పేరుతో అక్రెడిటేషన్లు సంపాదించడమే విశేషం. అసలు ఆర్‌ఓసీలో కంపెనీ డై రక్టర్లు, ఎండీల పేరుతో నమోదయిన వారికి అక్రెడిటేషన్లు ఎలా ఇస్తారన్నది ప్రశ్న. చివరకు వీరికి తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలు కూడా, కార్డులిస్తుండటం మరో ఆశ్చర్యం. సమాచారశాఖ మంత్రి నాని సహకారంతో.. ఏపీ సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్.. అక్రెడిటేషన్ల విధానాల్లో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు, సానుకూల పరిణామాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్నలిజంతో సంబంధం లేకుండా, ఎడిటర్ల హోదాలో అక్రెడిటేషన్లు పొందుతున్న యజమానులపై దృష్టి సారించాల్సి ఉంది.

ఇక వామపక్ష పార్టీలకు చెందిన కొన్ని పత్రికలు-మీడియా సంస్థలు కూడా, అక్రెడిటేషన్లను దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నా, పట్టించుకునే దిక్కులేదు. కమ్యూనిస్టు పార్టీలు, వాటికి అనుబంధంగా పనిచేసే పార్టీ-విద్యార్ధి-వ్యవసాయ సంఘాల నాయకులకు సైతం.. అక్రెడిటేషన్లు ఇస్తున్న సంప్రదాయం, కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతోంది. 2000 సంవత్సరంలో.. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో, వామపక్షపార్టీకి చెందిన ఓ విద్యార్ధి విభాగం ధర్నా చేసింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

అయితే.. జర్నలిస్టును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, ఓ పెద్ద జర్నలిస్టు సంఘం ప్రకటన పంపింది. నిజానికి అప్పుడు అక్కడ జర్నలిస్టులెవరినీ, పోలీసులు అరెస్టు చేయలేదు. దానితో వారంతా పోలీసుస్టేషన్‌కు వెళ్లి విచారిస్తే… అరెస్టయిన సదరు విద్యార్ధి సంఘ నేత, ఫలానా పార్టీకి చెందిన పత్రికలో స్థానిక విలేకరిగా పనిచేస్తున్నట్లు తేలింది. తాము ఫలానా స్టూడెంట్స్ యూనియన్ నేతగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశామే తప్ప, విలేకరిమీద కేసు పెట్టలేదని సదరు సీఐ తాపీగా, అంతే లాజిక్కుగా బదులిచ్చారు. నిజంగానే మరి.. అది జర్నలిస్టులపై దాడి-అరెస్టు ఎలా అవుతుందన్నది ప్రశ్న. అది వేరే విషయం. ఈవిధంగా ఒకవైపు పార్టీలలో ఫుల్‌టైమర్లుగా పనిచేస్తూ, మరోవైపు జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి సైతం.. సమాచారశాఖ ఏవిధంగా అక్రెడిటేషన్లు ఇస్తుందన్న ఆలోచన, ఇప్పటిదాకా ఒక్క అధికారికీ రాకపోవడమే ఆశ్చర్యం. అయితే.. యాజమాన్యాలిచ్చిన జాబితా ప్రకారమే తాము కార్డులిస్తున్నామన్నది అధికారుల వాదన . సమాచారశాఖ ప్రక్షాళనకు నడుంబిగించిన సర్కారు.. ఈ అవలక్షణాలు, దొడ్డిదారి బాగోతాలకూ తెరదించినప్పుడే.. వారి సంస్కరణలు ఫలితమిస్తాయి.