పువ్వు..నవ్వింది!

624

గ్రేటర్‌లో ‘కమల’వికాసం
‘సంజయ’ సారథ్యానికి జయహో
ఫలించిన భావోద్వేగ వ్యూహం
సంకినేని ఫార్ములా సక్సెస్
ఎల్బీనగర్‌లో పూర్తిగా నవ్వుల్.. ‘పువ్వు’ల్
అమిత్‌షాకు మరో అవమానం
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

నుదుట పెద్ద బొట్టుతో నిటారుగా ఉన్న ఆ గడ్డం యువకుడు.. రాజకీయంగా హిమాలయమంత ఎత్తుకు ఎదిగిన అధికార పార్టీని ఎదుర్కోగలడా?.. కరీంనగర్‌లో కార్పొరేటర్ స్థాయి నుంచి ‘స్టేట్ సదర్’ స్థాయికి చేరుకున్నప్పటికీ, గ్రేటర్‌లో ఆయన పప్పులు ఉడుకుతాయా?.. ఆయన పెట్టే ‘హిందుత్వ’ మంట.. సెక్యులర్ పార్టీలకు సెగ తగులుతుందా?.. ఉన్న ఆ నాలుగు సీట్లు కాపాడుకుంటే ఎక్కువ. మహా అయితే మరో నాలుగయిదు సాధిస్తే గొప్ప. ఇవీ గ్రేటర్ ఎన్నికల ముందు.. ఆ యువ నేత గురించి చాలామందికి ఉన్న అభిప్రాయం. కానీ.. ఆ యువకుడే.. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తన పార్టీని విజయం వాకిట వరకూ తీసుకువెళ్లి, అధికార పార్టీని ముచ్చెమటలు పట్టించాడు. ఆయనెక్కిన ‘బండి’ ఎన్నికల్లో బాక్సులు బద్ధలు కొట్టింది. మొత్తంగా ‘పువ్వు’ను నవ్వించింది. ఆ రధసారథి పేరే బండి సంజయ్!ఇది కూడా చదవండి: ‘గ్రేటర్ గులాబీ’తోటలో ‘కమలం’ వికసిస్తుందా?

‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’.. ఈ సామెతనే ఒక సిద్ధాంతంగా మార్చుకున్న భారతీయ జనతా పార్టీ, గ్రేటర్ ఎన్నికల్లో అద్భుత .. అనితర.. అనన్య సామాన్య.. అనూహ్య విజయం సొంతం చేసుకుంది. 30 స్థానాలు దాటవనుకున్న సర్వే అంచనాలను కూడా కమలం తారుమారు చేసి, 46 స్థానాలు దాటి 50కి చేరువ కావడమంటే.. తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేచినట్లే లెక్క. నాలుగు నుంచి అర్ధ సెంచరీ చేరవయ్యేంత ఉధృత స్థాయిలో, వీచిన కమల పవనాల వెనుక.. సంజయ సారథ్యం సుస్పష్టం. గ్రేటర్ ఒక్కటే కాదు.. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకూ, ఇంత అనితర సాధ్యమైన విజయాన్ని ముందుండి నడిపించిన, తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ సారథ్యం వల్లే.. కమలం వికసించిదన్నది మనం మనుషులం అన్నంత నిజం.

సంజయ సారథ్యంలో జరిగిన మాటల యుద్ధం.. భావోద్వేగం.. హిందుత్వ నినాద ఫలితమే, ఈ అద్భుత విజయమని చెప్పకతప్పదు. నిజానికి సంజయ్ మాటల తూటాలు గురి తప్పి, బీజేపీకే బెడిసికొడతాయన్న ఆందోళన ప్రచారం సమయంలో సొంత పార్టీ నేతల్లోనే కనిపించింది. కానీ అది బ్యాలెట్ బాక్సులు బద్దలుకొట్టేందుకు అక్కరకొచ్చింది. సాంకేతికంగా భాజపా మేయర్ సీటు సాధించలేకపోవచ్చు. అతి పెద్ద పార్టీగానూ అవతరించకపోవచ్చు. కానీ, రేపటి భవిష్యత్తు రాజకీయ యుద్ధానికి, గ్రేటర్ మైదానం నుంచే రణనినాదం, ఎన్నికల శంఖారావం పూరించిందన్నది సుస్పష్టం.

నిజానికి భాజపా వ్యూహాలెప్పుడూ రెడీమేడ్‌గా ఉండవు. తాత్కాలిక లక్ష్యాలు అసలు కనిపించవు. సుదూర సమయం- సుదూర వ్యూహం- సుదీర్ఘ లక్ష్యంగా ఉంటాయి. ఒక వేటగాడికి ఉన్నంత ఓపిక ఆ పార్టీకి ఉంటుందన్నది చరిత్ర నిరూపించిన సత్యం. ఆ ఓపిక- ఆ సహనమే ఇన్ని దశాబ్దాల కార్పొరేషన్ చరిత్రలో, ఆ పార్టీకి ఇంత భారీ విజయాన్ని సాధించిపెట్టింది. లేకపోతే.. కేవలం నాలుగంటే నాలుగు సీట్ల నుంచి, 50కి చేరువయ్యేంత స్థాయికి చేరుకోవడం, అధికార పార్టీకి కేవలం పదడుగుల దూరంలోనే నిలవడమంటే, మామూలు విషయం కాదు. అది సంజయ్ సారథ్యం- మాటల యుద్ధం వల్లే సాధ్యమయింది.

జాతీయ పార్టీ అగ్ర నేతలయిన అమిత్‌షా, నద్దా, స్మృతి ఇరానీ, సీఎం యోగి ఆదిత్యనాధ్ చేసిన ప్రచారంతో వచ్చిన ఊపు.. కాంగ్రెస్ రాజకీయ వియోగం.. టీడీపీ అస్త్రసన్యాసం.. ఇటీవలి వరద.. ఇలా అన్ని అంశాలూ కమలానికి కలసివచ్చాయి. యువత కూడా ఈసారి తొలిసారి కమలానికి చేరువయింది. అధికార టీఆర్‌ఎస్‌కు మరో పార్టీ పోటీ లేకపోవడంతో, బీజేపీనే ఏకై క ప్రత్యామ్నాయమన్న భావన కలిగించేందుకు అగ్ర నేతల ప్రచారాలు కమలానికి కలసివచ్చాయి.

కానీ.. అగ్రనేత అమిత్‌షా ప్రచారం చేసిన బౌద్ధనగర్-సీతాఫల్‌మండి డివిజన్లలో ఆ పార్టీ ఓడిపోవడం మాత్రం పరాభవమే. విజయావకాశాలున్న డివిజన్లను ఎంపిక చేసుకోకపోవడం, అభ్యర్ధుల ఎంపికలో నిర్ణయం తీసుకున్న నేతలదే ఆ బాధ్యత. అమిత్‌షా వంటి అగ్రనేత ప్రచారం చేసిన డివిజన్లలో పార్టీ ఓడటం, వ్యక్తిగతంగా అది ఆయనకే అప్రతిష్ఠ అన్నది పార్టీ నేతల ఆవేదన. ఇక పార్టీ జాతీయ దళపతి నద్దా ప్రచారం చేసిన నాలుగు డివిజన్లలో విజయం సాధించగా, యుపి సీఎం యోగి ప్రచారం చేసిన కూకట్‌పల్లిలో పార్టీ ఓడిపోయింది. అక్కడ టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయగా, నద్దా ప్రచారం చేసిన ఎల్బీనగర్ లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. ఇది కూడా చదవండి.. అమిత్‌షా ప్రచారం అచ్చొస్తుందా?

సంజయ్ ప్రకటిత సర్జికల్ స్ట్రైక్స్.. యుద్ధం చేస్తాం.. రోహింగ్యాలు, బంగ్లా-పాక్ జాతీయుల తిష్ఠ వంటి అంశాలతోపాటు… భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణాలు, అక్కడే అగ్రనేతల పూజల వంటి సెంటిమెంటు… హిందువులలో ‘బీజేపీ మన పార్టీ’ అన్న బలమైన భావన కల్పించేందుకు బీజాలు వేశాయి. అందుకు బీజేపీ జాతీయ నాయకత్వం.. తెలంగాణ దళపతి బండి సంజయ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఆయనతోపాటు.. ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’, ఎంపీ అర్వింద్ చేసిన మాటల యుద్ధం కూడా కమలానికి ఓట్లు రాల్చాయి. కాబట్టి ఈ విజయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా భాగస్వామి.

దాదాపు 20 స్థానాల్లో తప్పుడు ఎంపికల పుణ్యాన, బీజేపీ కనీసం మరో పది-పదిహేను సీట్లు కోల్పోవలసి వచ్చింది. గెలుపు గుర్రాలను కాకుండా.. సిఫార్సు రాజకీయం ఫలించినందుకు, పార్టీ నాయకత్వం అందుకు ‘ఫలితం’ అనుభవించాల్సి వచ్చింది. ఆ లోపం కూడా లేకపోతే.. గ్రేటర్‌లో గులాబీ సరసన, బీజేపీ సగర్వంగా తలెత్తుకుని ఉండేది. అగ్రనేతలు ఎవరి కోటాలు వారు పంచుకున్నందుకే, ఈ పరాభవమన్నది కార్యకర్తల వ్యాఖ్య.

ఇప్పుడు మేయర్ సీటును బీజేపీ గెలవలేకపోవచ్చు. గెలవడం అసాధ్యం కూడా. అది ఇప్పటికిప్పుడు ఆచరణ సాధ్యం కాదన్నది, కమలదళాలకూ తెలుసు. నిజానికి, మేయర్ సీటు సాధించాలన్నది ఆ పార్టీ లక్ష్యం కూడా కాదు. కానీ, రెండవ స్థానంలో టీఆర్‌ఎస్‌కు రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబడి.. గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించడం, ఆ పునాదులపై నిలబడి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడమే బీజే పీ అసలు లక్ష్యం. తాము మేయర్ సీటు సాధిస్తామని బీజేపీ నేతలు పైకి ప్రకటనలిచ్చినా.. అసలు లక్ష్యం మాత్రం, వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే పునాదులు వేసుకోవడమే. నగరంలోని ఉద్యోగ వర్గాలు బీజేపీ వెంటనే ఉన్నాయన్న వాస్తవాన్ని, గ్రేటర్ ఎన్నికలు చాటడం ఆ పార్టీకి శుభవార్తనే.

ఎందుకంటే ఇప్పటివరకూ ఆ వర్గాలు టీఆర్‌ఎస్‌కు మానసిక మద్దతుదారుగా ఉన్నారన్న భావన ఉండేది. అది ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఉదయం మొదలయిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ హవా కనిపిస్తే, ఆ తర్వాత జరిగిన కౌంటింగ్ దానిని అనుసరించింది. అంటే ఉద్యోగ వర్గాల ఆలోచననే సిటిజనం అనుసరించిందన్న మాట. ఇది అధికార పార్టీకి ఆందోళన కలిగించే అంశమే.

ఇక నగరంలో గంపగుత్తగా బీజేపీకి జై కొట్టిన ఏకైక నియోజకవర్గం ఎల్‌బీనగర్ కావడం మరో విశేషం. అక్కడ 11 డివిజన్లు ఉండగా, మొత్తం స్థానాలు కమలం ఖాతాలోనే కలిసేందుకు.. ఎన్నికల ఇన్చార్జయిన ఆ పార్టీ రాష్ట్ర ఉపాథ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పన్నిన వ్యూహం- కష్టం, కారణమయింది. ఆ తర్వాత ముషీరాబాద్‌లోనే ఐదు స్థానాలకు నాలుగు బీజేపీ చేజిక్కించుకుంది.

2009లో టీడీపీ ఎల్బీనగర్ ఇన్చార్జిగా ఉన్న సంకినేని సారథ్యంలోనే, టీడీపీ 8 స్థానాలకు 7 గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 వేలు, లోక్‌సభ కు 30 వేల ఓట్లు దక్కిన బీజేపీ… ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఏకంగా 45 వేల మెజారిటీ సాధించడం మామూలు విషయం కాదు.సంకినేని సుదీర్ఘ రాజకీయ అనుభవం, లౌక్యం, సమన్వయం, ఎన్నో ఎన్నికల్లో ఎల్బీనగర్‌కు ఇన్చార్జిగా వ్యవహరించిననాటి పరిచయాలే ఇప్పుడు, ఆ పార్టీని అక్కడ విజయతీరాలకు చేర్చాయి. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శేఖర్జీ-టీడీపీ నుంచి చేరిన సామ రంగారెడ్డి వర్గాల మధ్య టికెట్ల పోటీ పెరిగింది. ఫలితంగా.. ఒక్కో వార్డుకు 5 నుంచి 14 మంది పోటాపోటీగా నామినేషన్లు వేసిన గందరగోళానికి, సంకినేని వ్యూహాత్మకంగా తెరదించి, అందరినీ బరినుంచి తప్పించి, తన పార్టీని విజయతీరాలకు చేర్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ.. సగర్వంగా మీసం మెలేసిన ఏకైక నియోజకవర్గం ఎల్బీనగరే మరి!

దుబ్బాకలో మొదలైన సంచలన విజయం.. గ్రేటర్‌లో చరిత్రాత్మకమైన విజయంగా మార్చిన కమలదళం, ఇక తన దృష్టి రాష్ట్రమంతా సారించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలిచ్చిన కిక్.. రానున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్ని , ఖమ్మం-వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల వరకూ కొనసాగించడం ఖాయం. కమల దళపతి సంజయ్ సంధించిన హిందూ అస్త్రం.. జనక్షేత్రంలో సక్సెస్ కావడంతో.. ఇకపై అన్ని చోట్లా అదే ఫార్ములా కొనసాగించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.ఏదేమైనా సంజయ సారధ్యానికి జయహో చెప్పాల్సిందే. ఎందుకంటే.. ఇది ఆయన కమలానికి సాధించి పెట్టిన చిరస్మరణీయమయిన ఘన విజయం కాబట్టి!