మన ప్రజాస్వామ్యానికి చట్ట సభల మోడల్ నప్పదేమో!

249

విజయవాడ:  గత దశాబ్ద కాలంగా దేశం లోనూ…, రాశ్రయాలలోనూ ‘చట్ట సభలు’ జరుగుతున్న తీరు, జరిపిస్తున్న తీరు, వాటికవుతున్న ఖర్చు, వాటి వల్ల ప్రజలకు కలుగుతున్న లబ్ది …మొదలైనవి చూస్తుంటే…. మన ‘డెమోక్రసీ’ కి చట్టసభల మోడల్ నప్పదేమో అనిపిస్తున్నది. వాటి స్థానం లో “బిల్లులు” పాస్ చేయించుకోడానికి ఇంకో విధానమేదో కనిపెట్టాలి.సభలు జరిగే కాల వ్యవధి ఆయేడు కాయేడు కుదించుకు పోతున్నది. అరుపులు-కేకలు; ఆరోపణలు -ప్రత్యారోపణలు; సవాళ్లు- ప్రతి సవాళ్లు, వాక్ ఔట్లు, పోడియం ముందు ధర్నాలు, దెప్పి పొడుపులు మొదలైనవి లేకుండా- చట్ట సభల సమావేశాలు  సజావుగా ఒక్క రోజైనా జరిగిన సందర్భాలు- ఏ రాష్ట్రం లోనూ కనపడవు.

ఈ పరిస్థితి- ఇందిరాగాంధీ హయాం లో మొక్క లాగా ప్రారంభమై…దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఇప్పుడు కోటప్ప కొండంత అయి కూర్చుంది. ఇది- కాణిపాకం వినాయకుని విగ్రహం లాగా పెరిగేదే కానీ….తరిగేది కాదు.ప్రాంతల  వారీగా…మతాల వారీగా..కులాల వారీగా…చీలికలు పీలికలై…అందరి యావా అధికారం చేజిక్కించుకోవడం; చేజిక్కించుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవడం పైనే కేంద్రీకృతమై పోవడంతో… మన ప్రజాస్వామ్యం దిక్కూ మొక్కూ లేనిదై పోయింది. ఎవరుబడితే వారు పరిహసించే స్థితిలో పడిపోయింది.

అధికార పక్షానికి కావలసిన బిల్లులు పాస్ చేయించుకోడానికి- ప్రజాస్వామిక ప్రియులు మరో మార్గం ఏదైనా ఆలోచించాలి. ఇంత రగడ, ఖర్చు, శ్రమ లేకుండా బిల్లులను చట్టాలుగా మార్చే విధానం గురించి వెదుకులాడాలి.ఇటువంటి పరిస్థితులు దేశం లో తల ఎత్తడానికి ప్రధాన కారణం- రాజకీయ పార్టీలలో- ఒక దానిపై మరో దానికి నమ్మకం, గౌరవం అనేవి ఒక్క శాతం కూడా లేక పోవడం. తమ పార్టీ తప్ప, ఎదుటి పార్టీ అంతా నేరస్థులు, దొంగలు, అవినీతి పరులు, లంచగొండులు, స్వార్ధపరులతో నిండిపోయిందనే భావం పెచ్చరిల్లిపోవడం.

లోకసత్తా ఉద్యమకారుడు జయప్రకాష్ నారాయణ్ గతంలో ఒక మాట చెప్పారు- ప్రతి పార్టీ కూడా ఎదుటి పార్టీ గురించి చెప్పేవన్నీ నిజాలే అని ఆయన అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ అంటే మంట. కాంగ్రెస్కి బీజేపీ అంటే…అంతకంటే ఎక్కువ మంట. మంట మాత్రమే కాదు…., బోలెడంత చులకన భావం. అలాగే మాయావతి పార్టీ అంటే అఖిలేష్ యాదవ్ పార్టీకి. కరుణానిధి పార్టీ అంటే జయలలిత పార్టీకి, నితీష్ కుమార్ దుకాణం అంటే లాలూప్రసాద్ యాదవ్ దుకాణానికి, శివసేన కాషాయం అంటే బీజేపీ కాషాయానికి, కాంగ్రెస్సో…బీజేపీ నో అంటే- టిఆర్ఎస్ కు, తెలుగు దేశం అంటే- వైసీపీకి …..ఇలా ఒక రాజకీయ పార్టీ అంటే మరో రాజకీయపార్టీకి దమ్మిడీ గౌరవం లేదు.అంత దాకా ఎందుకు…? సీపీఐ అంటే సీపీఎం కు చాలా చులకనభావం. చిన్న చూపు.

ఎవరికి దొరికినంత వారు కుమ్మేసుకుంటున్నారని….. కుమ్ముకోడానికి అవకాశం లేని వారు గుడ్ల నీరు కుక్కుకుంటున్నారు.ఈ పరిస్థితి- దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 60,70 ఏళ్లకే ఎదురవుతుందని రాజ్యాంగ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ అంబేద్కర్ గానీ; రాజ్యాంగ సభ సభ్యులు గానీ ఊహించి ఉండరు. అదీ వారి మానసిక స్థాయి, ఔన్నత్యం.ఇప్పుడు మనం చూస్తున్న ‘చట్ట సభల హింస” నుంచి ప్రజాస్వామ్య రక్షణకు మన సమాజం తీసుకోవలసిన చర్యలు ఏమిటి అని విషయం పైనే- టీవీ చానెళ్లు డిబేట్లు, చర్చా వేదికలు, దిశ- దశలు, నిర్వహించాలి.

ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు- రోజూ అనేక విషయాలపై నాలుగైదు వీడియోలు పెడుతుంటారు. వాటికి లక్షల్లో వీక్షకులు ఉన్నారు. కానీ, మన చట్టసభలను చ  చెరపడుతున్న రాజకీయ పరిస్థితులపై ఆయన ఒక్క వీడియో కూడా చేసినట్టు లేరు. యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే- మన చానల్స్ యాంకర్లు  కోట్లు తగిలించుకుని- రకాల భంగిమలతో….డిబేట్ లు నిర్వహిస్తున్న దృశ్యాలు కనపడుతుంటాయి గానీ.. నానాటికీ దిగజారిపోతున్న చట్టసభల ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి ఏమి చేయాలనే అంశం పై ఒక్క డిబేటూ కనపడదు.

ఇన్ని”ఫాక్స్ న్యూస్” టైపు చానళ్ళ మధ్య- మన ప్రజాస్వామ్యం నలిగిపోతున్న తీరు చూస్తుంటే- మనకు ఈ చట్ట సభల ప్రజాస్వామ్యం మోడల్ నప్పదేమో అనిపిస్తున్నది.అమెరికన్  మోడల్ మనకు బెస్టు.ఈ మోడల్ లో మన ప్రధానమంత్రి ఇండియా ప్రెసిడెంట్ అవుతారు. ముఖ్యమంత్రి – రాష్ట్ర గవర్నర్ అవుతారు. వారికి నచ్చిన వారిని మంత్రులుగా నియమించుకుంటారు. దీనికోసం మంత్రులు ఎం.పీలో…ఎం.ఎల్.ఏ లో అవ్వాల్సిన అవసరం లేదు.చట్ట సభలకు ప్రెసిడెంటూ, గవర్నర్లూ రావలసిన అవసరం లేదు. వారికి నచ్చిన నిర్ణయాలు వారు తీసుకుంటారు. చట్ట సభలు వాటి మంచి చెడ్డలు మాత్రమే చర్చిస్తాయి. దీనివల్ల – సభ్యులు తొడగొట్టడాలు, మీసాలు మెలివేయడాల తో పని ఉండదు.

-భోగాది వెంకట రాయుడు