అవును…ఆడు మగాడ్రా బుజ్జీ!

617

జర్నలిస్టు సంఘాలు లేకుండా కొత్త అక్రెడిటేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయం
ఇక మిగిలింది ఎల్‌ఏ యాడ్స్ ప్రక్షాళనే
భూసేకరణ యాడ్స్‌నూ సమాచార శాఖ పరిథిలోకి తీసుకోవాలి 
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

చేయాలన్న సంకల్పం… చేసే దమ్ము.. చేయగల ధైర్యం ఉండాలే గానీ,  అనుకున్నది పూర్తి చేయడానికి ఏదీ అడ్డుకాదు. రాదు!  ఏపీలో జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ల మంజూరుపై సమాచార శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయయం చూస్తే అది అవుననిపించకమానదు. ఇంతకాలం అక్రెడిటేషన్ల సంఘాల  చూరుపట్టుకుని వేళ్లాడుతున్న,  జర్నలిస్టు సంఘ గబ్బిలాల కస్తూరి వాసనలు లేకుండానే.. ఈసారి జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలన్న నిర్ణయం సాహోపేతమే కాదు. విప్లవాత్మకం కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క సమాచార శాఖ కమిషనర్ తీసుకోలేని, దమ్మున్న నిర్ణయం తీసుకున్న విజయ్‌కుమార్ మొనగాడి కిందే లెక్క.

కొత్త ఏడాదికి కొత్త  కార్డులపై ఇప్పటివరకూ జరుగుతున్న తర్జనభర్జన-మీనమేషాలకు ఏపీ సమాచార శాఖ కమిషర్ విజయకుమార్‌రెడ్డి తన సంచలన నిర్ణయంతో తెరదింపి, జర్నలిస్టులకు కొత్త కార్డుల పంపిణీకి లైన్‌క్లియర్ చేయడం స్వాగతించదగ్గదే. ఇప్పటివరకూ ఈ విషయంలో అడ్డగోడగా నిలిచిన జర్నలిస్టు సంఘాల పంచాయితీని పక్కకు పెట్టి… సారీ… పక్కన పారేసి,  కొత్త కార్డుల ప్రక్రియకు పచ్చజెండా ఊపిన కమిషనర్‌ను,  అభినందించడం  ప్రతి జర్నలిసు నైతిక బాధ్యత.

అసలు అక్రెడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలు ఎందుకు? అందులో ఆ నాయకమ్మన్యులు ఉండి ఉద్ధరించేది, ఊడబొడిచేదీ ఏమిటి? జర్నలిస్టులకు యాజమాన్యాల నుంచి జీతాలిప్పించే దమ్ము లేని సంఘాలు, ప్రభుత్వ శాఖలపై స్వారీ చేయడం ఏమిటి? కమిషనర్లను మొహమాటపెట్టి, తమ యూనియన్ల సభ్యులకు అదనంగా కార్డులు ఇప్పించుకోవడమే కదా ఈ నేతల మెహర్బానీ? చిన్నా చితకా సంఘాలు కూడా,  అక్రెడిటేషన్ కమిటీ సభ్యులమని ఫోజులు కొట్టడానికే తప్ప, ఈ కమిటీలో జర్నలిస్టులు ఎందుకు పనికివస్తారు? పోనీ ఈ కమిటీ ఏమైనా ఏడాది పొడవునా పనిచేస్తుందా? లేదు. ఒక్కటంటే ఒకేసారి!  మరి దేనికీ బిల్డప్పులు? కొత్త కార్డుల మంజూరుకు ఈ సంఘాల మోకాలడ్డు, ప్రతిబంధకాలూ ఎందుకు?  ఇవీ… కొన్ని దశాబ్దాల నుంచీ జర్నలిస్టుల మస్తిష్కాలలో నాటుకుపోయిన ప్రశ్నలు. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇప్పటివరకూ ఇవే ప్రశ్నలు, జర్నలిస్టు  మెదళ్లను తొలిచేస్తున్నాయి. కానీ, అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే… ఈ కమిటీలో జర్నలిస్టులను సిఫార్సు చేసేది,  ఇంకా పెద్ద జర్నలిస్టు ‘మహానేతలు’ కాబట్టి.

ఇప్పుడిక ఆ పితలాటకం లేదు. మా సంఘాలే ఉండాలి. అప్పటివరకూ ఎవరికీ కార్డులివ్వకూడదు. పాతవే కొనసాగించాలన్న పంచాయితీ అసలే లేదు. ఎందుకంటే.. అసలు జర్నలిస్టు సంఘాల లొల్లి లేకుండానే, జర్నలిస్టులకు కొత్త కార్డులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి! అంత సాహసం చేసిన కమిషనర్ నిజంగా చరిత్ర సృష్టించారనే చెప్పాలి. ఎందుకంటే… సమైక్య రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ,  జర్నలిస్టు సంఘాలను పక్కనపెట్టిన కమిషనర్లు ఎవరూ లేరు కాబట్టి. ఏ కమిషనరయినా జర్నలిస్టు సంఘాలకు భయపడాల్సిందే. లేకపోతే సీఎంల దాకా పంచాయతీ వెళ్లేది. అలాంటిది..  ఒక కమిషనర్ జర్నలిస్టు సంఘాలతో సంబంధం లేకుండానే..  అక్రెడిటేషన్ కమిటీని అధికారులతోనే వేసి, కొత్త కార్డులివ్వాలని నిర్ణయించడం మామూలు విషయం కాదు కదా? దానికి బోలెడంత దమ్మ కావద్దూ..? భవిష్యత్తులో కూడా ఇదే విధానం అనుసరించడం మంచిది.  అందుకే… ఆడు మగాడ్రా బుజ్జీ!

నిజానికి  కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న అనేక దమ్మున్న నిర్ణయాల్లో ఇది ఒకటి మాత్రమే. సమాచార శాఖలో ప్రకటనలన్నీ యాడ్ ఏజెన్సీల నుంచే ఇచ్చే  విధానం  ఉమ్మడి రాష్ట్రంలో  మొదలయి, గత ఏడాదిన్నర వరకూ కొనసాగింది. అంటే ఏదైనా పత్రిక లేదా చానెల్‌కు యాడ్స్ ఇవ్వాలంటే, మధ్యలో ఏజెన్సీ పాత్ర ఉండాల్సిందే. ప్రభుత్వంలో ఎవరుంటే, వారిని పట్టేసి.. ఎవరికి కావలసినవి వారికి సమర్పించుకుని ఏజెన్సీలు హవా సాగించేవి. పత్రికా ప్రకటనల నుంచి హోర్డింగ్సు వరకూ ఇదే వరస.  అందుకు సమాచార శాఖ సదరు ఏజెన్సీలకు 15 శాతం కమిషన్లు ఇచ్చేది. పోనీ, ఆ అంత కమిషన్లు తీసుకునే సదరు ఏజెన్సీలు,  పత్రికలకు సకాలంలో డబ్బులిస్తాయా అంటే అదీ లేదు. గత సర్కారు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి, ఏజెన్సీలు  ఇప్పటిదాకా పత్రికలకు బకాయిలు చెల్లించిన దాఖలాలు లేవు. కొత్త కమిషనర్ విజయకుమార్  ఈ సంప్రదాయానికి తెరదించారు.అంటే..అసలు సమాచార శాఖలో యాడ్ ఏజెన్సీల వ్యవస్థకే మంగళం పాడారు.  ఎలాగంటే.. ఏజెన్సీలకు పత్రికలు ఇచ్చే ఆ 15 శాతం కమిషను, ఇప్పుడు ప్రభుత్వమే తీసుకుని, వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తోంది. మంచిదే కదా!

అదొక్క నిర్ణయమే కాదు. కొత్త కమిషనర్ తీసుకున్న మరొక సాహసోపేత నిర్ణయం…. పత్రికల  యాడ్స్ టారిఫ్‌ను గణనీయంగా తగ్గించడం. ఇప్పటివరకూ ఈనాడు, సాక్షి, డెక్కన్‌క్రానికల్ వంటి పత్రికలే ఎక్కువ ప్రకటనల రేటు ఉండేవి. వాటి మొదటి పేజీ ప్రకటన ఖరీదు లక్షల నుంచి కోటికి పైమాటే. ప్రభుత్వం ఇచ్చే ఒక ప్రకటన  బడ్జెట్‌లో,  సింహభాగం ఈ పత్రికలకే సరిపోయేవి. టీడీపీ హయాంలో అయితే.. సింహభాగం బడ్జెట్ అంతా ఈనాడు-ఆంధ్రజ్యోతి ఖాతాకే వెళ్లేవి. ఇక టెండరు లేకుండానే అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్- గవర్నమెంట్ అఫిషియల్ మీడియా హక్కుల  తాలూకు నిధులన్నీ,  ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌కే వెళ్లేవి. ఇక వాటికి పోగా మిగిలిన బడ్జెట్‌ను, మిగిలిన పత్రికలకు సర్దుబాటు చేసేవారు.

అయితే సర్క్యులేషన్ పరంగా కూడా అవి పెద్దవే. కానీ.. సమాచార శాఖ బడ్జెట్ తగ్గిపోయింది.  ఆ భారం తగ్గించుకునే వ్యూహంలో భాగంగా.. కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, సమాచారశాఖ నిర్దేశించిన రేట్లను అంగీకరిస్తేనే, ప్రకటనలిస్తామని షర తు విధించారు. దానితో గత్యంతరం లేని పెద్ద పత్రికలు,  కొన్ని వేల మెట్లు దిగివచ్చి, కమిషనర్ ప్రతిపాదనను అంగీకరించడం అనివార్యమయింది. ఫలితంగా గత సర్కారు హయాంలో కోటిరూపాయల ఫుల్‌పేజీ ఉన్న ఒక యాడ్.. ఇప్పుడు 30 వేలకు ముద్రించాల్సి వస్తోంది. మరి ఇది శుభపరిణామమే కదా?

ఇంకొన్ని తెలుగు పత్రికల ప్రాణం చాలా బలహీనమయినా… వాటి ప్రకటనల రేట్లు మాత్రం ఈనాడు, క్రానికల్‌కు మించే ఉండేవి. అంటే దశాబ్దాలపాటు ఆ తరహా పత్రికలు యాడ్స్ రూపంలో ఎంత సంపాదించాయో,  ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కమిషనర్ తీసుకున్న కొత్త తరహా విధానం వారికి వాతపెట్టినట్టే. అది వేరే విషయం. అలా… ప్రభుత్వాలను కొన్ని దశాబ్దాల పాటు శాసించి, శ్వాసించిన పెద్ద పత్రికలను సైతం నేలమీదకు తీసుకురావడానికి,  నిజంగా దమ్ము-ధైర్యమే కాదు. సంకల్పం కావాలి. అది తనకు ఉందని నిరూపించిన కమిషనర్ విజయకుమార్‌రెడ్డిని అభినందించాల్సిందే. ఆయన తీసుకున్న ఈ సాహోసోపేత నిర్ణయం వల్ల, ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదా అయినట్లే కదా?

ఇన్ని విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్న కమిషనర్… భూసేకరణ ప్రకటనల్లో జరుగుతున్న కోట్లాదిరూపాయల కుంభకోణంపైనా దృష్టి పెడితే మంచిది. జిల్లాల్లో పత్రికలకు ఇస్తున్న భూసేకరణ ప్రకటనలు,  స్పెషల్ కలెక్టరు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల  దయాధర్మంపై వస్తున్నాయి. అతె్తసరు కాపీలు ముద్రించే చాలా పత్రికలు.. ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో కోట్లాదిరూపాయల యాడ్సు సంపాదిస్తున్నాయి. దీనివల్ల ఖజానాకు వందల కోట్లు నష్టం వస్తోంది. చంద్రబాబు సర్కారులో ఇదొక మాఫియాగా మారిందన్న ఆరోపణలుండేవి. ప్రకాశం, విజయనగరం, నెల్లూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో అయితే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, భూసేకరణ యాడ్స్ పుణ్యాన కోట్లకు పడగలెత్తారన్న ఆరోపణలుండేవి. ఇప్పుడు క్యాబినెట్‌లో ఓ పెద్ద స్థాయిలో ఉన్న.. ఓ ‘మంత్రిగారి వియ్యంకుడి’కి చెందిన పత్రిక, గత మూడేళ్లలో  కేవలం భూసేకరణ యాడ్సులోనే కోట్లాది రూపాయలు  సంపాదించింది. అయినా అడిగే దిక్కులేదు.

అయితే.. భూసేకరణ యాడ్స్ అంశం సమాచారశాఖ పరిథిలో లేకపోవడం, రెవిన్యూ శాఖ పరిథిలో ఉండటంతో సమాచార శాఖ అధికారులు ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు,  తమ ప్రకటనలన్నీ సమాచార శాఖ ద్వారానే ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. కానీ భూసేకరణ ప్రకటనలు మాత్రం మినహాయించడమే, కొన్ని పత్రికలకు కల్పతరువులా మారింది. ఆ అంశాన్ని కూడా సమాచారశాఖ పరిథిలో తీసుకువస్తే ప్రభుత్వం కొన్నివందల కోట్లు ఆదా చేసినట్టవుతుంది. పెద్ద పత్రికలను దారికి తెచ్చి, కోట్లాదిరూపాయలు ఆదా చేసిన కమిషనర్… నిజాయితీగా నడుపుతున్న చిన్న పత్రికలను కూడా ప్రోత్సహిస్తే మంచిది.