ఢిల్లీ రైతాంగ పోరాట వెలుగు..మీడియా పాత్ర!

365

మీడియా అమ్ముడు పోలేదు, అది అంకిత భావంతో పని చేస్తోంది. అది శుభసూచకం. నిష్పాక్షిక & పారదర్శక పాత్రల్ని పోషిస్తున్న నేటి మీడియా నుండి ఉద్యమ స్ఫూర్తిని పొందుదాం.
ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరోదారి అట. నేడు మీడియా పాత్రపై పై వ్యాఖ్యలు బాధిత ప్రజా రాశుల నుండి తరచుగా వినిపిస్తున్నాయి. ఐనప్పుడు పై శీర్షికలు ఒకింత అపోహలకి గురి చేస్తాయి. పరవా లేదు. మీడియాగూర్చి నేడు వినిపించే  వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యల్ని చేయక తప్పదు.

ఈ ప్రపంచం, ఈ సమాజం మనకు తలక్రిందులుగానే చూపించబడుతుందని ఒక సందర్భంలో కారల్ మార్క్స్ అంటాడు. యధాతథంగా చూస్తే, అది తలక్రిందులుగానే కనిపిస్తుంది. మనం కూడా తలక్రిందుల దృష్టితో చూస్తే అది వాస్తవ రూపంలో కనిపిస్తుంది. ఇది ఆర్థిక, రాజకీయ, సాంఘిక,  నైతిక, సాహిత్య, సాంస్కృతిక, న్యాయ, సైనిక తదితర అన్ని రంగాలకూ వర్తిస్తుంది. అదే సూత్రం మీడియా రంగానికి కూడా వర్తిస్తుంది. ఈ అన్నింటి స్థానాలు అవి వుండాల్సిన చోట్లనే వుంటాయి. మధ్యలో అవేమీ మారవు. మనం చూసే చూపుని బట్టి మాత్రమే అవి స్థానభ్రంశం చెందుతాయి. ఇటీవల కాలంలో మీడియా కూడా ప్రజల దృక్కోణంలో (ముఖ్యంగా పోరాటాలు చేపట్టే ప్రజల -struggling people – దృష్టిలో) స్థానభ్రంశం చెందుతూ వస్తోంది. అదే తాజా రైతాంగ పోరాట సమయంలో కూడా జరుగుతోంది. మరోసారి నేడు మీడియా పాత్రపై దేశ ప్రజల లో  చర్చకు తెర లేచింది. దానిపై మార్క్స్ చెప్పిన తలక్రిందుల దృష్టితో విశ్లేషిద్దాం.

ఇక్కడ ప్రస్తావించే మీడియా అంటే, ప్రధాన స్రవంతి (main stream) ప్రచార మాధ్యమాల వ్యవస్థ అని అర్థం. సారంలో కార్పోరేట్ మీడియా వ్యవస్థే. మీడియా గూర్చి గత కొన్నేళ్లుగా తరచుగా ప్రజల్లో వినిపించే వ్యాఖ్యల్ని ముందు గా పేర్కొందాం. వాటి పదును, తీవ్రతలు తాజా రైతాంగ ఉద్యమ కాలంలో పెరిగాయి. అందుకే ఇది వాటి మీద మాట్లాడే తగు సమయం గా భావించి స్పందిస్తున్నది. ఇంకో మాట! ఇవి పోరాడే బాధిత ప్రజల నుండే కాకుండా, అట్టి ప్రజా రాశులకు ప్రాతినిధ్యం వహించే ప్రజా ఉద్యమ సంస్థల కి చెందిన శ్రేణుల నుండి కూడా తరతమ స్థాయిల్లో ఇటీవల కాలంలో వినిపిస్తున్నాయి. అందుకే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది.

ఇటీవల కాలంలో మనకు తరచుగా వినిపించే కొన్ని వ్యాఖ్యల్ని ముందుగా క్రింద ఉదహరించుకుందాం.
“మీడియా డబ్బుకు అమ్ముడు పోయింది”  “బడా కార్పోరేట్ సంస్థలు మీడియాను కొనేశాయి” “నేడు మీడియా సిగ్గు విడిచి సంపన్న వర్గాల కొమ్ము కాస్తున్నది”  “మీడియా వైఖరి పక్షపాత బుద్ధితో వుండటం సిగ్గుచేటు” “డబ్బుకు కక్కుర్తిపడి తన ప్రజాస్వామ్య వృత్తి ధర్మాన్ని నేడు మీడియా నిస్సిగ్గుగా కోల్పోతున్నది”
పై వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమైనవి. వాస్తవాలు పై వ్యాఖ్యలకు భిన్నమైనవి.

అమ్ముడు పోవడం అంటే ఏమిటి? కొమ్ము కాయడం అంటే ఏమిటి? అసలు ఈ రెండింటికి అర్థం ఏమిటో ముందుగా తెలుసుకుందాం. ఒకరికోసం అవతరించి మరొకరి కోసం ప్లేటు ఫిరాయిస్తే అమ్ముడు పోవడం అంటారు. కాకుల కోసం పుట్టి గద్దల కోసం; చీమల కోసం పుట్టి పాముల కోసం, పేద వర్గం కోసం పుట్టి ధనిక వర్గం కోసం మధ్యలో హఠాత్తుగా ప్లేటు ఫిరాయిస్తే, దాన్ని అమ్ముడు పోవడం అంటారు. ఒకవేళ మీడియా శ్రామికవర్గం కోసం అవతరించి బూర్జువా వర్గం కోసం ప్లేటు ఫిరాయిస్తే, అది నిజంగానే అమ్ముడు పోయినట్లు మనం భావించాలి. అదే జరిగిందా?
అదేవిధంగా ఇటు కాకులు, అటు గద్దల పక్షాన; ఇటు చీమలు, అటు పాముల పక్షాన; ఇటు పేదవర్గం, అటు ధనిక వర్గం పక్షాన వుంటానని చెప్పి, ఆచరణలో ప్లేటు ఫిరాయించి అందులో ఏదో ఒక వైపు మాత్రమే నిలబడితే కొమ్ము కాయడం అంటారు.  నేడు అదే జరిగిందా?

పైన పేర్కొన్న అర్థాల వెలుగులో మీడియా పాత్రని పరిశీలిద్దాం.
మీడియా ఏ వర్గం ద్వారా పుడితే, ఆ వర్గం కోసం చేసే సేవలు అమ్ముడు పోవడం క్రిందికి రావు. పైగా అది తనను పుట్టించిన వర్గ ప్రయోజనాల కోసం అంకిత భావంతో పని చేయడమే. దానికి కితాబు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వర్గం చేతుల్లో మీడియా అవతరించి, దాని బద్ద శత్రువైన ఇంకో ప్రత్యర్థి వర్గప్రయోజనం కోసం ప్రచారం చేయకుండా వుంటే, అది నిజానికి కొమ్ము కాయడం క్రిందికి రాదు.
తొమ్మిది నెలలు కడుపులో మోసి, పురిటి నొప్పుల మధ్య ప్రసవించి, పాలిచ్చి, పోషించి, పెద్ద చేసిన తల్లికి ఆ కొడుకు అన్నం ముద్ద పెట్టక పోతే అది మాతృద్రోహం అంటారు. తన తల్లదండ్రుల్ని వదిలి, మధ్యలో పరుల చెంతకు చేరితే, కన్న తల్లిదండ్రులకు ద్రోహం చేసి, ఇతరుల పంచన కొమ్ము కాయడం క్రిందికి వస్తుంది. అలాంటి సందర్భాలలో వారిని సమాజం తప్పు పడుతుంది. ఈ దృష్టితోనే మీడియా పాత్రని కూడా విశ్లేషించాలి.

ఈ సందర్భంగా ప్రజల వాడుక భాషలో ఉన్న రెండు సామెతలను ఉదహరిద్దాం.
“తల్లిపాలు త్రాగి తల్లి రొమ్ము గుద్దినట్లు”  “తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు” విశ్వాస ఘాతుకం, మిత్ర ద్రోహం జరిగే సందర్భాలలో పై సామెతల్ని సహజంగా ప్రజలు ఉపయోగిస్తారు. అది మీడియా కి కూడా వర్తిస్తుంది. నిజంగానే మీడియా మాతృ ద్రోహం చేసి పరపంచన చేరిందా? అది అలా చేరుతుందా? అది విశ్వాస ఘాతుక బుద్ధితో వ్యవహరిస్తుందా? లేదంటే తనని కని పెంచిన తన మాతృమూర్తి పట్ల అంకిత భావంతో పని చేస్తుందా? అసలు విషయం ఇదే!

కార్పొరేట్ సంస్థల చేత నేడు మీడియా కొనుగోలు చేయబడిందని ఆరోపించడం వాస్తవ విరుద్ధమైనది. అలా ఆరోపించదమంటే, ఇప్పటి వరకూ మీడియా కార్పోరేట్ సంస్థలకు చెందినది కాదని ఒప్పుకోవడమే. నేటి మీడియా పుట్టుక, పెరుగుదల పరిణామ క్రమం పట్ల స్పష్టత వున్న ఎవరో ఈ తరహా వ్యాఖ్యలు చేయరు.

నిజానికి మీడియా ఇప్పుడు మాత్రమే మారింది కాదు. నేడు కొత్తగా అది ఫిరాయించ లేదు. నిన్నటి వరకూ అది ఒక వర్గం పక్షాన వుండి, నేడు కొత్తగా మారింది కాదు. నిన్నటి వరకూ ప్రజల పక్షాన పుట్టి, పెరిగి, నేడు కొత్తగా మారింది కాదు. ఏదైనా ఓ సమస్య మీద బాధిత ప్రజలు దోపిడీ వర్గాలపై రోడ్డెక్కి పోరాడే సందర్భంలో హఠాత్తుగా అది పిరాయించ లేదు.
ప్రజల పక్షాన ప్రజల కోసం, ప్రజా ఉద్యమ సంస్థల ప్రత్యక్ష భాగస్వామ్యంతో స్థాపించిన  మీడియా సంస్థలకు ఈ విశ్లేషణ వర్తించదు. దాని వర్గ పునాది వేరు. సహజంగానే దాని రాజకీయ పునాది కూడా వేరుగానే వుంటుంది. ఒకవేళ ప్రజల పక్షాన ఏర్పడి, మధ్యలో కార్పొరేట్ల చేత అది కొనుగోలు చేయబడితే, దాన్ని మాత్రమే అమ్ముడు పోవడం అనాలి.
నిజానికి కార్పొరేట్ల సంస్థల ప్రయోజనాల కోసం, కార్పొరేట్ల సంస్థల డబ్బుతో అవతరించి, కార్పోరేట్ సంస్థల నిర్వహణలో నడిచే మీడియా ఎవరికీ సేవ చేయాలి? ప్రజలకూ, కార్పోరేట్ సంస్థలకు మధ్య సంఘర్షణ జరిగిన సందర్భాలలో అట్టి మీడియా తన స్థాపిత లక్ష్యం  ప్రకారం ఎవరికీ సేవ చేయాలి? ఎవరి పక్షాన పని చేస్తే అంకిత భావంతో పని చేసినట్లు? ఎవరి పక్షాన పని చేస్తే అమ్ముడు పోయినట్లు? ఈ తార్కిక దృష్టితో పరిశీలించాల్సి ఉంది.
తనకు జన్మ ఇచ్చిన కార్పోరేట్ వ్యవస్థ పక్షాన నిలబడి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం కార్పోరేట్ మీడియా కనీస వృత్తి ధర్మం. అది ఒకవేళ మాతృద్రొహం చేస్తేనే నేరం. తన మాతృమూర్తి కోసం సేవచేస్తే, అది అంకిత భావంతో పని చేయడమని అంటారు. అదే నేడు కార్పోరేట్ మీడియా చేస్తున్న పని కదా! ఐనప్పుడు  “అమ్ముడు పోయిన మీడియా” గా విమర్శ చేయడం ఎలా శాస్త్రీయం అవుతుంది?

నిజానికి మున్నెన్నడూ లేని పారదర్శక పద్దతిలో మీడియా పనిలో నేడు మెరుగుదల వుంది. పురోగతి వుంది. అది అందుకే గడ్డకట్టే చలిలో పోరాడే లక్షలాది రైతాంగానికి తమ ఛానెళ్లు, పత్రికలలో చిన్న చోటు కూడా ఇవ్వడం లేదు. అది తన వర్గం కోసం “వర్గ చైతన్యం” తో పని చేస్తోంది.  నిజానికి నేడు ఢిల్లీరైతాంగం మీడియా మొఖం  మీద “తూ” అంటూ కాండ్రించి ఉమ్మి వేస్తున్నది. ఐనా అది తన వర్గం కోసం నిస్సిగ్గుగా  గొప్ప నిబద్దతతో పని చేయడం గమనార్హం. తనను కని పెంచిన కార్పోరేట్ వర్గ ప్రయోజనాల కోసం అది నేడు “వర్గస్పృహ”, “వర్గ నిబద్దత”, “వర్గ చైతన్యం” వంటి గొప్ప ఆదర్శాలను ప్రదర్శిస్తోంది.
కార్పోరేట్ మీడియా లో ఉద్యోగులు గా పని చేస్తున్న పాత్రికేయ వ్యవస్థను వేరుగా చూడాలి. కార్పోరేట్ వ్యవస్థ కు పాత్రికేయ వ్యవస్థ ప్రాతినిధ్యం వహించదు. పై విశ్లేషణ దానికి యధాతథంగా వర్తించదు. వారు వేతన ఉద్యోగులు మాత్రమే. వారు తాము పని చేసే ఛానెళ్లు, పత్రికల విధాన కర్తలు (policy makers) కాదు. విధాన కర్తలు వాటిని పెట్టుబడులు పెట్టి స్థాపించిన, నిర్వహిస్తున్న స్వంత దార్లు మాత్రమే. ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు.కార్పోరేట్ మీడియా లో పని చేసే వేతన ఉద్యోగవర్గం తన యజమాని వర్గమైన కార్పోరేట్ వర్గానికి చెందదు. ఒకవేళ వారిలో ఎవరైనా కార్పోరేట్ భావజాలం యొక్క ప్రభావానికి గురైతే కావచ్చు. అది విడిగా వ్యక్తులుగా మాత్రమే చూడాలి.   మీడియా వ్యవస్థ, మీడియా ఉద్యోగ వర్గం ఒకటి కాదు. ఇదో గమనార్హ అంశం.

ఇది చిన్న పత్రికలు, స్థానిక పత్రికలకు కూడా వర్తించదు. అవి ప్రజల డబ్బుతో ఏర్పడ్డ మీడియా సంస్థలు కాకపోవచ్చు కానీ కార్పోరేట్ సంస్థల యొక్క పెట్టుబడులతో ఏర్పడ్డవి కూడా కాదు. అవి చిన్న మదుపు దారులతో లేదంటే యాడ్స్ తో నడపబడేవి. చిన్న పెట్టుబడి లేదా మదుపు దారులతో ఏర్పడి, కార్పోరేట్ సంస్థలకూ, బాధిత ప్రజలకూ మధ్య జరిగే వర్గ పోరాటాల సందర్భాలలో ఒకవేళ కార్పొరేట్ సంస్థల చేత  కొనుగోలు చేయబడ్డాయని అనుకుందాం. అవి అప్పుడు మాత్రమే అమ్ముడు పోయినట్లు భావించవచ్చు. ఎందుకంటే, ఒక వర్గం పెట్టుబడితో ఏర్పడి,  మరో వర్గం పెట్టుబడికి అవి దాసోహం ఐనట్లైతే, దాన్ని కొనుగోలు చేయబడ్డ లేదా అమ్ముడు పోయిన ప్రక్రియగా భావించవచ్చు. అంతే తప్ప, కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల యొక్క, కార్పొరేట్ల చేత (FOR THE CORPORATES, OF THE CORPORATES, BY THE CORPORATES) ఏర్పడి పనిచేసే మీడియా గూర్చి “అమ్ముడు పోయింది” లేదా “కొనుగోలు చేయబడింది” అని ఆరోపించడం శాస్త్రీయ విమర్శ క్రిందికి రాదు. ఇది గమనార్హం.
ఢిల్లీ రైతాంగ పోరాట సమయంలో మీడియా పై ఈ తరహా విమర్శలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. కారణం వుంది. నేడు లక్షల సంఖ్యలో రైతాంగం గడ్డకట్టే చలిలో, దేశ రాజధాని నగరం శివార్లలో ఆరుబయలులోనే నిలిచి  పోరాటం చేస్తుంటే కూడా, మీడియా కళ్ళకు కనిపించడం లేదు. తమ ఉద్యమ వార్తల్ని ఎందుకు ప్రచారం చేయడం లేదనేది నేడు రైతుల ఘోష! రైతాంగాన్ని నిండు మనస్సుతో బలపరిచే కోట్లాది భారతదేశ పీడిత ప్రజల హృదయ ఘోష కూడా ఇదే. వారి ఘోషను సానుభూతితో అర్థం చేసుకో వచ్చు. కానీ బడా కార్పోరేట్ మీడియా వర్గ స్వభావం పట్ల రాజకీయ అవగాహన గల రాజకీయ ఉద్యమ సంస్థల శ్రేణులకు అది తగదు.

మీడియా వర్గ స్వభావం ఇప్పుడు కొత్తగా మారలేదు. ఐతే ఒకటి మాత్రం మారింది. అదేమిటంటే, ఇంత వరకు అది ప్రజల్ని మోసం చేయగలిగింది. ఇప్పుడు చేయ లేకపోతోంది. అదే నేడు కొత్తగా మారింది.
కార్పోరేట్ వర్గం చేత అంటే  బూర్జువా వర్గం చేత పుట్టించ బడ్డ మీడియా కి స్పష్టమైన వర్గ ప్రయోజనాలు వుంటాయి. అదే సమయంలో బయటకు మాత్రం అది ప్రజల మనస్సుల్లో “ప్రజల మీడియా” గా చెప్పుకునే ఒక పెద్ద నాటకం ఆడుతుంది. అట్టి నాటకం ఇంతకాలం ప్రజల్ని రక్తి కట్టించ గలిగింది. తాను ఏ ఒక్క పక్షం కొమ్ము కాయని నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ముసుగు ధరించే నాటకమది.  ఈ కపటనాటక నీతి గ్రహించ లేని సామాన్య ప్రజలు ఇంత వరకు మీడియా ఒక నిష్పాక్షిక, పారదర్శక వ్యవస్థగా భ్రమపడి వుండొచ్చు. ఇటీవల కాలంలో అట్టి భ్రమలు క్రమంగా దేశ ప్రజల మనస్సులలో నుండి తొలగి పోతున్నాయి. అదే నేడు కొత్తగా జరిగిన స్థాన భ్రంశం.  నిజానికి మీడియా తన సుస్థిర స్థానం నుండి ఎన్నడూ వైదొలగ లేదు. దాన్ని చూసే ప్రజల దృక్కోణంలో మాత్రమే స్థాన భ్రంశం చోటు చేసుకుంది.

నేడు గడ్డ కట్టే చలిలో ఢిల్లీ లో పోరాడే రైతాంగంలో కూడా మీడియా పట్ల భ్రమలు తొలగి పోతున్నాయి.  వారం క్రితం 26-11-2020న సుమారు 25 కోట్లమంది కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేశారు. ఐనా కార్పోరేట్ మీడియా ప్రచారం చేయలేదు. కార్మికవర్గం “చీ చీ” అని మొఖం మీద ఉమ్మి వేస్తున్నా నిగ్రహంతో ఆ సమ్మె వార్తలను ప్రచారం, ప్రసారం చేయకుండా ఎంతో నిగ్రహంతో వ్యవహరించ గలిగింది. ఈ క్రమంలో పోరాడే ప్రజలలో తన నాటకం పట్ల క్రమంగా భ్రమలు కోల్పోతున్నా అది మూల్యం చెల్లించడానికి సిద్దపడుతోంది. అందుకే ఇది నిజానికి శ్రామిక వర్గ సంస్థలు, శక్తులకు ఎంతో సంతోషకర పరిణామం.

కార్పోరేట్ మీడియా ఇప్పటి వరకూ ధరించిన తన అందమైన సుందర వలువల్ని ఒక్కొక్కటి చొప్పున విడుస్తోన్న చరిత్ర వుంది. దాని వంటి మీద ఓ యాబై ఏళ్ల క్రితం ధరించిన అలంకరణ వస్త్రాలు ఇప్పుడు లేవు. ఒక్కొక్కటి అవి వరసగా వూడి పోతున్నాయి. ఐనా అది ఇంకా పూర్తిగా వివస్త్ర స్థితికి చేరలేదు. దాని వంటి పై నేటికీ బనియన్, డ్రాయర్ల వంటి అండర్ వేర్లు (UNDER WEARS) మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ రైతాంగం వాటిని కూడా విప్పేపని చేస్తోంది. (అది బనియన్ ని కోల్పోయి కూడా డ్రాయర్ ను కాపాడు కోగలదు సుమా! మున్ముందు తలెత్తే శ్రామికవర్గ విప్లవ పోరాటాలే పూర్తి దిగంబరం చేసి నగ్నంగా నడి వీధుల్లో వూరేగించ గలవు) అట్టి రేపటి తీవ్ర విప్లవ వర్గ పోరాటాల నిర్మాణానికి నేటి కార్పోరేట్ వ్యతిరేక రైతాంగ పోరాటం ఒక దూకుడు బల్ల (spring board or jumping ground) గా ఉపకరిస్తుంది.

అందుకే నేడు మీడియా పోషించే పాత్ర పట్ల ఇది చాలా “విచారకరం”, “బాధాకరం”, “చింతి స్టున్నాం”, “ఇకనైనా మీడియా తన వైఖరి మార్చు కోవాలి” వంటి వలపోత వైఖరికి స్వస్తి చెప్పి, దానిని దిద్దుబాటు చేయగలమని ఆశించడం మాని స్పష్టమైన వర్గ దృష్టితో విమర్శించి, దాని నిజ రూపాన్ని పీడిత ప్రజల్లో రాజకీయంగా సూటిగా బట్టబయలు చేసే సుస్పష్ట పాత్రను ఉద్యమ సంస్థలు చేపట్టాలి. ఇది నేటి రైతాంగ పోరాటం వాటికి ఇస్తొన్న సుస్పష్ట సందేశం. పోరాడే రైతాంగం ద్వారా నేడు వాటికి చరిత్ర ఇస్తున్న గొప్ప సదవకాశం కూడా! ఈ నూతన పరిణామాన్ని నిండు మనస్సుతో మనం స్వాగతిద్దాం. ఆనందిద్దాం.

చివరి మాట వుంది. నేడు  మీడియా పాత్ర నుండి కూడా ఉద్యమ సంస్థలు స్ఫూర్తి పొందే  విషయాన్ని పేర్కొనాల్సి వుంది. మార్క్స్ చెప్పిన తలక్రిందుల దృష్టితో మీడియాను కూడా శ్రామిక వర్గ విప్లవ సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలి. అది చివరి మాట గా పేర్కొందాం.
ఔను మరి! మొఖం మీద ప్రజలు “తూ” అని  కాండ్రించి ఉమ్మి వేస్తున్నా, సిగ్గూ ఎగ్గూ లేకుండా తన వృత్తిధర్మం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న కార్పోరేట్ మీడియా వ్యవస్థ  నేడు ఉద్యమ సంస్థలకు పెను ఆదర్శం కావాలి. (ఇది ప్రత్యర్థి వర్గం నుండి పొందే నెగిటివ్ స్ఫూర్తితో కూడిన ఆదర్శం సుమా) తన కార్పోరేట్ వర్గ ప్రయోజనాల కోసం ఏ గొప్ప వర్గ చైతన్యం, వర్గ నిబద్ధతల్ని అది నేడు ప్రదర్శిస్తుందో, దాని నుండి శ్రామిక వర్గ విప్లవ సంస్థలు ఉద్యమ స్ఫూర్తిని పొంది పురోగమించాల్సి వుంది.  అది నేటి మన వృత్తి ధర్మంగా భావించి, మరింత విప్లవ దీక్షతో ముందుకు సాగుదాం.

– ఇఫ్టూ ప్రసాద్