గురజాడ చనిపోలేదు….

346
గురజాడ వెంకట అప్పారావు గారిని గూర్చి తెలియని తెలుగు వారు ఉంటారా? ఆయన చిత్రం చూసి ఉండక పోవచ్చు గానీ ఆయన రచనకు తెలియని తెలుగు వారు బహుశా ఉండకపోవచ్చు. సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం, పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతి శతకము, బిల్హణీయం (పూర్తిగా వ్రాయలేదు) ,సుభద్ర, లవణరాజు కల, కాసులు,సౌదామిని ,కథానికలు, మీపేరేమిటి , దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము విమతము ఇలా వ్రాసినవి కొన్ని . వారు పరమపదించి నేటికి నూట నాలుగు సంవత్సరాలు. మహాకవి దేవులపల్లి వారు వారి గూర్చి ఏమన్నారో తెలుసా? గురజాడ 1915 నవంబరు 30 న చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించారు. నిజమే కదా.. వారు సుకవులు.. ప్రజల నాలుకల మీద, హృదాయాన్తరాలలో ఎప్పటికీ జీవించే ఉంటారు

తగటు బంగరు చీరె కట్టి
కురుల పువ్వుల సరులు జుట్టి
నుదుట కుంకుమ బొట్టు పెట్టి
సొంపు పెంపారన్
తొగల కాంతులు కనులు పరపగ
మించు తళుకులు నగలు నెరపగ
నడక లంచకు నడలు కరపగ
కన్నె పరతెంచెన్ రాజవీథిని
పసిడి కడవల పాలు పెరుగులు
పళ్లెరమ్ముల పళ్ళు పువ్వులు
మోము లందున మొలక నవ్వులు
చెలగ చెలికత్తెల్ వెంట నడిచిరి.
అంత పట్టపు రాజు యెదురైకన్నె
సొగసుకు కన్ను చెదురై
మరుని వాడికి గుండె బెదురై
యిట్లు తలపోసెన్.
“ఔర ! చుక్కల నడుమ చందురు
నట్లు వెలిగెడు కన్నె  ముందర
వన్నె కాంచిన నగరి సుందరు
లంద రొక లెక్కా !
“పట్టవలెరా దీని బలిమిని
కొట్టవలెరా మరుని రాజ్యం
కట్టవలెరా గండపెండెం
రసిక మండలిలో.”
నాడు గుడిలో మండె గుండం
మంట మింటిని ముట్టి యాడగ,
కన్న నరపతి గుండె దిగులై
పట్టు విడ జొచ్చెన్.
భక్తి పరవశ మైన మనసున
దుర్గ నప్పుడు కొలిచి కన్యక
ముక్తి వేడుచు వూడ్చి నగలను
శక్తి కర్పించెన్.
దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట
రక్త గంధం రక్త మూల్యం
దాల్చి,గుండం చుట్టు నిలిచిన,
జనుల కిట్లనియెన్ !
“అన్న లారా తండ్రులారా
ఆలకించం డొక్క విన్నప
మాలు బిడ్డల కాసు కొనుటకు
ఆశలే దొక్కొ కులము లోపల ?
“పట్టమేలే రాజు అయితే
రాజు నేలే దైవ ముండడొ ?
పరువు నిలపను పౌరుషము
మీ కేల కలగదొకో ?
“విద్య నేర్చినవాడు విప్రుడు
వీర్య ముండిన వాడు క్షత్రియు
డన్న పెద్దల ధర్మ పద్ధతి
మరచి,పదవులకై
“ఆశ చేయక, కాసు వీసం
కలిగి వుంటే చాలు ననుకొని,
వీర్య మెరుగక, విద్య నేర్చక
బుద్ధి మాలినచో,
కలగవా యిక్కట్లు ? మేల్కొని,
బుద్ధి బలమును బాహు బలమును
పెంచి, దైవము నందు భారం
వుంచి,  రాజులలో
“రాజులై మను డయ్య !” ఇట్లని
కన్య నరపతి కప్పుడెదురై
నాలు గడుగులు నడిచి ముందుకు
పలికె నీ రీతిన్.
“పట్టపగలే, వీధిని
పట్టబోరే జార చోరులు,
పట్టదలచితి వింక నీవొక
పట్టమేలే రాజువట !
“కండకావర మెక్కి నీవీ
దుండగము తలపెట్టినందుకు
వుండదా వొక దైవమంటూ,
వుండి వూర్కొనునా ?
“కులం పెద్దలు కూడి రదుగో !
అగ్నిసాక్షికి అగ్ని అదుగో !
కన్ను కోరిన కన్నె యిదుగో !
జాల మేలిక్కో ?
“పట్టమేలే రాజువైతే
పట్టు నన్నిపు” డనుచు కన్యక
చుట్టి ముట్టిన మంట లోనికి
మట్టి తా జనియన్ !
పట్టమేలే రాజు గర్వం
మట్టి గలిసెను, కోట పేటలు
కూలి, నక్కల కాటపట్టయి
అమరె,
యెక్కడైతే కన్య, మానం
కాచుకొనుటకు మంట గలిసెనొ
అక్కడొక్కటి లేచె సౌధము
ఆకసము పొడుగై.
పట్టమేలే రాజు పోయెను,
మట్టి కలిసెను కోట పేటలు,
పదం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్.