వ్యవసాయ విధానం..విపక్షాల వింత వైఖరి

347

పార్లమెంటులో సమర్ధన.. బయట నిరసన
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ విధానంపై దేశమంతా నిరసన వ్యక్తమవుతోంది. లేవనెత్తడానికి అంశాలేమీ లేక, దిక్కుతోచకుండా ఉన్న కాంగ్రెస్‌కు, ఇది బ్రహ్మాస్త్రంగా మారింది. ఇక వామపక్షాల సంగతి సరేసరి. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పినా, అడగకపోయినా వాటికి తమ గొంతులు అరువు ఇస్తూనే ఉంటాయి. అటు పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల రైతులు పెడుతున్న నిరసన సెగకు ఎన్డీఏ మిత్రపక్షాలకు మంటపడుతోంది. దానితో ఆ పార్టీలు కూడా, కొత్త విధానాలు ఉపసంహరించుకోకపోతే, మా దారి మేం చూసుకుంటామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మరి ఇదంతా బీజేపీకి ప్రాణసంకటమే. మెజారిటీ ఉందని ఏమైనా చేస్తామంటే, తర్వాత తలెత్తే విపరిణామాలు ఇంతకు భిన్నంగా ఉందుకు ఉంటాయి?

ఓ వైపు దేశ రాజధాని రైతు ఆందోళనతో అట్టుడుకుంతోంది. వారికి ఢిల్లీ సర్కారు భోజనం కూడా పంపిస్తోంది. రైతు ఆందోళన సెగ దేశమంతా విస్తరిస్తే, బీజేపీ పలుకుబడి పలచబడటం ఖాయం. అమిత్‌షా ఎంత వ్యూహరచయిత అయినా, ఎప్పుడూ ఒకరి ఆటే సాగదు. అందుకే ఆయన సైతం దిగి వచ్చి, ఆందోళన కారులతో చర్చలు జరపడం అనివార్యమవుతోంది. ఈలోగా.. కేంద్రమంత్రులు చేసే ప్రకటనలు, సమస్యను మరింత సంక్లిష్టం చేసేలా మారాయి. ఆందోళనలో ఖలిస్తానీలు, మావోయిస్టులు చొరబడ్డారన్న ప్రకటనలు, రైతులను మరింత రెచ్చగొట్టేవే. ఉద్యమాన్ని, దాని డిమాండ్లను అర్ధం చేసుకుని పరిష్కరించాల్సిన పాలకులు, పుండుమీద కారం చల్లితే, ఆ కారం వారి కంట్లోనూ పడటం సహజం. ఇప్పుడు అదే జరుగుతోంది.

మరి నిజంగా వారి ఉద్యమం వెనుక ఉన్నట్టయితే, కేంద్ర నిఘా దళాలు ఏం చేస్తున్నాయి? గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాయా? అవి నిషేధిక సంస్థలే అయినప్పుడు, ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు? వారిని ఏరివేయవచ్చు కదా? చర్యలు తీసుకోకుండా వారిని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయన్నది మెడపై తల ఉన్న ఎవరికయినా వచ్చే సందేహమే. ఇవన్నీ ఉద్యమతీవ్రతను తగ్గించవచ్చేమో గానీ, ఉద్యమకారుల లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నది గ్రహించకపోవడమే అమాయకత్వం.

సరే.. ఒక అంశం తెరపైకి వచ్చినప్పుడు, దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడం, పార్టీలకు ఎప్పటినుంచో వస్తున్న అలవాటే. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు భాజపా చేసింది కూడా అదే కాబట్టి, ఇప్పుడు విపక్షాల కుట్రలని నిందించడం నంగనాచితనమే అవుతుంది. కాబట్టి ఎవరికి అవకాశం ఉంటే వారు, అంశాలను అస్త్రాలుగా మార్చుకుంటారు. అది సహజం. అందులో నైతిక-అనైతిక విలువలకు తావు లేదు. కొత్తగా కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనదీ అదే దారి.

కాకపోతే.. దేశాన్ని ఏదో ఒక రూపంలో నిర్వీర్యం చేయాలనుకునే శక్తులన్నీ, ఇలాంటి ఆందోళనల కోసమే కాచుకుని కూర్చుకుంటాయి. అది గతంలో ఎన్‌ఆర్‌సి, సీఏఏ వ్యతిరేక ఉద్యమాలలో స్పష్టంగానే కనిపించింది. ఇప్పుడు కూడా వచ్చిన ఈ అవకాశాన్ని ఆ శక్తులు ఎందుకు జారవిడుచుకుంటాయి? ఏదో ఒక పార్టీ భుజంపై తుపాకి పెట్టి, సర్కారును గురిపెడుతూనే ఉంటాయి. ఎందుకంటే జాతిద్రోహులకు గౌరవం దక్కేది ఒక్క మనదేశంలోనే. హింస-అణచివేతను కూడా మర్చిపోయి, పక్కనేమి జరుగుతుందో కూడా తెలియకుండా- పట్టించుకోకుండా బతికేస్తున్న ఉష్ట్రపక్షి జాతి.. కేవలం భరతజాతేనని… ఓ మిత్రుడు ఇటీవల పంపిన ఓ వాట్సాప్ సందేశంలో ఆవేదన వెలిబుచ్చారు. ఇదీ అంతే!

విచిత్రమేమిటంటే.. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానాన్ని, పార్లమెంటులో సమర్ధించిన పార్టీలే… ఇప్పుడు గొంతు మార్చి, రైతుల ఆందోళనకు మద్దతునిస్తున్నాయి. తమ రాష్ట్రంలో అమలు జరగని చట్టాలకు నిరసనగా, పంజాబ్‌లో రైతులు ఆందోళన చేయడమే ఆశ్చర్యం. కొత్త విధానానికి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మద్దతునిచ్చింది. కానీ అదే ‘ఆప్’ ఇప్పుడు ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కర్షకులకు, సర్కారు ఖర్చుతో భోజనాలు ఏర్పాటుచేస్తోంది. ఈ చట్టాన్ని తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలుచేస్తున్న… సీపీఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కూడా.. ఢిల్లీలో కర్షకుల ఆందోళనకు దన్నుగా నిలవడం మరో వింత. పాపం.. ఢిల్లీలోని ఓ పది మసీదులు కూడా ఆందోళనకారులకు భోజనాలు పంపిస్తున్నాయట.

నూతన వ్యవసాయ విధాన విధానం కర్షకుల జీవితాలను మార్చేస్తుందన్నది బీజేపీ వాదన. దళారీల బారి నుంచి కర్షకులను కాపాడుతున్న ఈ విధానాన్ని వ్యతిరేకించేవారంతా, రైతు వ్యతిరేకులేనన్నది భాజపేయుల వాదన. కానీ.. ఈ విధానం కార్పొరేట్లకు కొమ్ముకాసేందుకు, తీసుకువచ్చిన దుర్మార్గమైన కుట్ర అన్నది విపక్షాల ఆరోపణ. కర్షకులను నిలువునా దోచుకునేందుకు దళారులకు బీజేపీ ఇచ్చిన లైసెన్సుగా వారు అభివర్ణిస్తున్నారు. ఈ వాద-ప్రతివాదాల్లో నిజమెంత, అబద్ధమెంతన్నది పక్కనపెడితే.. వ్యవసాయ విధానాలకు పార్లమెంటులో సమర్ధించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు కర్షకుల చంకనెక్కి, వారికి దన్నుగా నిలవడమనే క్షుద్ర రాజకీయాలు ఎందుకన్నదే ప్రశ్న. పార్లమెంటులో బలం తక్కువగా ఉన్న బీజేపీ, దానిని భర్తీ చేసేందుకు చేసిన ‘ఫ్లోర్ మేనేజ్‌మెంట్’ లోపల విజయమంతమయి, ఇప్పుడు బయట వికటించడమే వింత. అంటే ఎవరి అవసరాలు వారికి తీరిపోయాయన్నమాట! అంతేగా.. అంతేగా!!