కేసుల భయంతో సరెండర్‌ అయ్యారు: చంద్రబాబు

159

పోలవరంపై అసెంబ్లీలో చర్చ
22 మంది ఎంపీలు ఏం చేస్తున్నారన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు

అమరావతి: వైకాపా ప్రభుత్వం చేతగానితనంతో పోలవరం అంశంలో చాలా సమస్యలు వస్తున్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కేసుల భయంతో నిధుల విషయంపై కేంద్రాన్ని అడగలేక సరెండర్‌ అయ్యారని ఆరోపించారు. శాససనభ శీతాకాల సమావేశాల్లో భాగంగా మూడోరోజు పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు వైకాపా చెప్పిన మాటలన్నీ విని ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపించారని.. పోలవరం పూర్తిచేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి పోలవరం నిధులు సాధిస్తారా? లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 22 ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరం భూసేకరణ చేసి ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  దీనిపై కేంద్రాన్ని ఒప్పించకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. ఎన్నికల్లో గెలిపిస్తే మేం పోరాడతాం, సాధిస్తామని చెప్పారని.. ఇప్పుడు నాటకాలాడొద్దని తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు.

అనంతరం నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ పోలవరం పూర్తి చేసేది తమ ప్రభుత్వమేనన్నారు. మార్చి నాటికి 17,500 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఐదేళ్లలో ఏనాడైనా ఆర్‌అండ్‌ఆర్‌ గురించి ఆలోచించారా? అని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 2022 ఖరీఫ్‌ నాటికి నీళ్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి సరెండర్‌ అవుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అనిల్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడే ఆమెను జగన్‌ ఎదిరించారన్నారు.