అన్నదాత పరిస్థితి అగమ్యగోచరం

223
సాగు చేసి పండించిన పంట నాశనం  

ఆటుపోట్లను తట్టుకుని అందరికీ ఆదర్శవంతంగా ఉండే అన్నదాత పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ధీరుడులా ఉండే దివిసీమ రైతన్న పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నివర్ తుఫాన్ బారిన పడడంతో దిక్కు తోచక ట్రాక్టర్ దమ్ము వీల్స్ తో స్వేద బిందువులు సాక్షిగా సాగు చేసి పండించిన పంటను   తానే నాశనం  చేసుకుంటున్నాడు. మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు పంచాయతీ శివారు కప్తాను పాలెంలో కౌలు రైతు అత్తులూరి రమేష్ నేల తల్లి నమ్మి మూడు ఎకరాలు బిపిటి వరిని ఎకరానికి 30 వేల చొప్పున 90 వేల రూపాయలును అప్పు చేసి సాగు చేశాడు. ఎటువంటి కలుపు దరిచేరకుండా కలుపు మందులు చల్లి కన్నబిడ్డ వలెసాకాడు . ఏపుగా పెరిగిన పంటను చూసి తన శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని ఆశించాడు. కానీ  నివర్ తుఫాన్ తన ఆశలను అడియాశలు చేసింది. కురిసిన అధిక వర్షాలకు పండిన పంట నేలకొరిగి ధాన్యపు గింజలు నుండి మొలకలు రావడం ప్రారంభమయ్యాయి. ప్రకృతి సహకరించకపోవడంతో దిగాలు చెందిన అన్నదాత ట్రాక్టర్ దమ్ము వీల్స్ తో పంటను తొక్కించేశాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట  నీటిలో నాని పోయి కుళ్ళి పోతుంటే కుమిలి పోతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నష్ట పరిహారం తో పాటు ఉచితంగా విత్తనాలు ఎరువులు పంపిణీ చేసి రైతులకు భరోసా కల్పించాలని కౌలు రైతు రమేష్ వేడుకుంటున్నాడు.