అతగాడిపై..పాములు పగబడున్నాయ్..

392
ఇప్పటికి 37 సార్లు కాటేశాయి
అది కూడా ఆ రెండు చోట్లే

సుబ్రహ్మణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పాములు పగబట్టినట్లుగా వెంటాడుతూనే ఉన్నాయి.. ఇప్పటి వరకు 37 సార్లు కాటు వేశాయి.
పాము కాటు గురించి మనం సాధారణంగా వింటుంటాం. ఒకసారో, రెండుసార్లో అయితే సరే.. కానీ ఏకంగా 37 సార్లు పాము కాటు వేయడం అంటే బాబోయ్ తలచుకుంటేనే వణుకుపుడుతుంది. చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తిని పాములు 37 సార్లు కాటు వేశాయి.. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా..
బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరుకు చెందిన సుబ్రహ్మణ్యం మాత్రం తన గోడు వెళ్లబోసుకున్నాడు.
సుబ్రహ్మణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతడు ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలానికి వెళితే అక్కడ పాము కాటేసింది. అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా వెంటాడుతూనే ఉన్నాయి.. కాటేస్తున్నాయి. 37 ఏళ్లలో 37 సార్లు సుబ్రహ్మణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే పాములు కాటేస్తున్నాయట. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తడమే సరిపోతుందట.
ఒకసారి పాము కాటేసిందంటే కనీసం 10 రోజులు ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. వైద్యం కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కూలి పనులు చేసుకునే తనకు ఇబ్బందిగా ఉందంటున్నాడు. నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తన పరిస్థితిని గుర్తించి ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.