తస్సాదియ్యా..తుస్సుమంది!

410

‘గ్రేటర్’ పోలింగ్ శాతం గోవిందా
తగ్గిన పోలింగ్ కారుకే లాభమా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

‘అప్ప ఆర్భాటమే గానీ బావ బతికుంది లేద’న్నట్లుంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ వ్యవహారం. అమిత్‌షా నుంచి యోగి ఆదిత్యనాధ్ వంటి అతిరధమహామహులంతా దిగివచ్చి, కేటీఆర్ నుంచి కేసీఆర్ వరకూ ప్రచారం చేసినా గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన పోలింగ్  40 శాతమే.  బాగా చదువుకున్న వారు, అస్సలు చదువుకోని వారు, అత్తెసరు చదువుల మేలుకలయిక అయిన భాగ్యనగరంలో నమోదయిన ఈ పోలింగ్..   ‘భాగ్యనగర బద్ధకానికి’ ఓ తీపిగుర్తు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ, పోలింగ్‌బూత్‌ల వద్ద భూతద్దం పెట్టి వెతికినా ఓటర్లు కనిపించలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, మియాపూర్‌లో నివసించే సినిమాస్టార్లు,  పాపం అప్పటికీ..  మేము ఓటేశాం. మరి మీ సంగతేమిటని మేల్కొలిపేలా ట్వీట్లు చేసినా,  ‘భాగ్యనగర బద్ధకిస్టు’ల్లో చలనం లేదు మరి!  వచ్చిన సెలవులను టెకీలు, ప్రైవేటు ఉద్యోగులు హాయిగా జాలీ ట్రిప్పులు వేసుకుని నగరం దాటి… ఆరకంగా ముందుకెళ్లారు.

చదువుకున్న వాళ్లకంటే చదువులేనోళ్లే నయమన్న సామెత, గ్రేటర్ ఎన్నికల్లో అక్షరసత్యమయింది. కాళ్లు లేని వికలాంగులు.. ఒక్క కాలున్న వికలాంగులు, చేతికి కర్రను ఊతంగా చేసుకున్న పండు వృద్ధులకున్న ఓపిక… తీరిక,  ‘మహానగర సకలాంగులకు’ లేకుండా పోయింది. తమ ఓటు హక్కు  వినియోగించుకున్న వికలాంగులే.. ‘ సకలాంగుల’నిపించుకున్నారు. కాలనీ బూత్‌లలో మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఓటరు జాడ మిణుకుమిణుకుమంటూనే కనిపించింది. అదే మురికివాడలు, బస్తీల్లోని పోలింగ్ బూత్‌లలో కనీసం 20, 30 మందితో ఉన్న క్యూలయినా కనిపించాయి. అడ్డగుట్ట ఒక్కటే ఓటర్లతో ఫుల్లయింది. అసలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడూ 50 శాతం వరకూ చేరిన దాఖలాలే లేవు. 2002లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 ఇప్పుడు 37 శాతానికి దగ్గరగా చేరింది. ఇక ఈ ఎన్నికలే ఇలా ఉంటే..  రానున్న గ్య్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు,  ఇంకెంత సక్కదనంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మేధావులు, మేతావులకు కొదువ లేని మహానగర దుస్థితి ఇది.

ఇంతోటి దానికి.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ బీజేపీ-టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ధర్నాలు, దౌర్జన్యాలు ఆరోపణలు, బురద రాజకీయాలు ఎందుకో అర్ధం కాదు. పాపం అమిత్‌షాలు, నద్దాలు, యోగులూ స్పెషల్‌ఫ్లైట్లు వేసుకుని వచ్చినా,  వారికి ఆయిల్‌ఖర్చు కూడా దండగే. నగరంలో ఆ మందం ఓట్ల శాతం  కూడా గిట్టుబాటుకాలేదు పాపం!   పోలింగ్ సరళి పరిశీలిస్తే.. బస్తీలు, మురికివాడలున్న ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు మొగ్గు కనిపించింది. ఇక కాలనీల్లో ఉన్న పోలింగ్ బూత్ ప్రాంతాల సరళి మాత్రం, బీజేపీ వైపే సానుకూలత వ్యక్తమయింది. కానీ కాలనీల్లోని పోలింగ్ బూత్‌లలో పోలింగ్ శాతం దారుణంగా కనిపించింది.  అయితే కమలం వికాసం పోలింగ్ బూత్ ప్రాంతాల కంటే,  బయటే ఎక్కువగా కనిపించింది.

కాగా.. తాజా సరళి తమకే అనుకూలమని తెరాస వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము కనీసం 90 నుంచి 95 స్థానాలు సాధిస్తామన్న అంచనాతో ఉన్నారు. అటు మజ్లిస్ హవా ఉన్న ప్రాంతాల్లో కూడా,  పోలింగ్ శాతం తగ్గినప్పటికీ.. తాము 40 నుంచి 45 స్థానాలు సాధిస్తామన్న ధీమా మజ్లిస్ నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ మాత్రం తగ్గిన ఓటింగ్ శాతంతో, కొంత గందరగోళంలో పడినట్లు నేతల వ్యాఖ్యల బట్టి అర్ధమవుతోంది. తగ్గిన పోలింగ్ శాతం.. సహజంగా అధికారపార్టీకే అనుకూలంగా ఉంటుందని, అయినా తాము తీవ్రస్థాయిలోనే పోటీ ఇచ్చామని కమలదళాలు చెబుతున్నాయి.

ఇక పోలింగ్ సరళి తొలి నుంచీ మందకొడిగానే మొదలయింది. సహజంగా ఏ ఎన్నికల్లోనయినా… ఒక పార్టీపై ఆగ్రహం ఉంటే, ఓటర్లు  పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా  తరలివస్తారు. ఆ పార్టీపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో ప్రదర్శిస్తారు. సహజంగా ప్రజలకు అధికార పార్టీలపైనే   ఆగ్రహం ఉంటుంది కాబట్టి.. దానిని ఓడించాలని భావిస్తే, పోలింగ్‌బూత్‌లు ఓటర్లతో నిండిపోతాయి. ఆ పరిస్థితి, అలాంటి ఆగ్రహం ప్రదర్శించాలన్న కసి-పట్టుదల,  ‘గ్రేటర్’ ఎన్నికల్లో కనిపించలేదు. ఇక సహజంగా ఒక పార్టీకి మద్దతునివ్వాలనుకునే ఓటరు, తాపీగా.. సమయం చూసుకుని, తమ పనులు ముగించుకున్న తర్వాతనే  పోలింగ్ కేంద్రానికి వస్తారు. ఈలోగా తమ ప్రాధాన్యపరమైన పనులుంటే, పోలింగ్‌బూత్‌కూ రారు. కాకపోతే టీవీలు చూస్తూ, తమకు తెలిసిన వారికి ఫలానా పార్టీకి ఓటేయమని, లేకపోతే రాష్ట్రం నాశనమవుతుందంటూ  హితోక్తులు చెబుతుంటారు.ఇది సహజంగా ఏ రాష్ట్రంలోనయినా కనిపించే ఓటర్ సైకాలజీనే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. ఫలితమే మందకొడి పోలింగ్. మిగిలినదంతా ‘షేమ్’ టు ‘షేమ్’!  పదండి ముందుకు.  పదండి తోసుకు.. పోదాం పోదాం హాలిడే ట్రిప్పులకు!! ప్రజాస్వామ్యం ఎటు పోతే మాకెందుకు? ఏమైపోతే మనకెందుకు? అయినా మన ఒక్క ఓటుతోనే రాజ్యాలు తారుమారవుతాయా ఏంటీ? మనకు హాలిడే ఇచ్చారా.. ఎంజాయ్ చేశామా అన్నదే కదా ముఖ్యం? అంతే కదా…. బ్రో?