‘గ్రేటర్ గులాబీ’తోటలో ‘కమలం’ వికసిస్తుందా?

811

కాంగ్రెస్-టీడీపీ ఓట్లు బదిలీ అయితేనే ఫలితం
యువతలో వచ్చిన మార్పుతో కనిపిస్తున్న జోష్
ప్రచార జోరు ఫలితాలు రాబడితేనే భవిష్యత్తు
టీఆర్‌ఎస్‌కు ఇవి ప్రతిష్టాత్మకం
అధికారంలో ఉండటమే క లిసొస్తున్న అంశం
కిషన్‌రెడ్డి పట్టు-ప్రతిభకు అగ్నిపరీక్ష
అసమ్మతే కొంపముంచుతుందా?
ఎన్నికలకు అంతా రె‘ఢీ’
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

అధికార టీఆర్‌ఎస్- ప్రతిపక్ష బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో జీరో నుంచి ఉవ్వెత్తున పైకి లేచి, అధికారపార్టీ హడలెత్తిస్తున్న కమలం.. గ్రేటర్ లోని ‘గులాబీతోట’లో వికసిస్తుందా? అనే స్ధాయికి వెళ్లడం నిజంగా విశేషమే. అందుకు కమలదళపతి బండి సంజయ్ మంత్రాంగం-దూకుడే కారణమన్నది నిర్వివాదం. అయితే, ప్రచారంలో కనిపించిన జోరు, హడావిడి ఫలితాల్లో చూపించకపోతే, బీజేపీ కేవలం హైప్ పార్టీగానే మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఇప్పటి పరిస్థితి ప్రకారం.. నగరంలో కమల కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా యువతలో తొలిసారి గతంలో ఎన్నడూ కనిపించనంత మార్పు, ఈ ఎన్నికల్లోనే కనిపించడం ప్రస్తావనార్హం. గత రెండు రోజుల వరకూ 20 సీట్ల వరకూ రావచ్చని అంచనా వేసిన ఆ పార్టీ వర్గాలు, ఇప్పుడు యువతలో దూకుడు పెరిగిన నేపథ్యంలో కనీసం 30-40 స్థానాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనా వ్యక్తమవుతోంది. నిజానికి యువతలో కూడా బీజేపీ పట్ల అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఈసారికి బీజేపీకి ఓటేయాలని తలిదండ్రులను సైతం,  ఒత్తిళ్లు చేసే పరిస్థితి కనిపించడం ఇదే తొలిసారి.

దానికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. కాంగ్రెస్-టీడీపీ నిర్వీర్యమయిపోవడం, ఆ పార్టీ సానుభూతిపరులు-ఓటర్లు కూడా అందుకు ప్రత్యామ్నాయంగా, బీజేపీనే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వీటికి మించి అమిత్‌షా, నద్దా, స్మృతి ఇరానీ, యోగి వంటి అగ్రనేతలు ప్రచారంలోకి దిగడం, టీఆర్‌ఎస్ మాదిరిగానే నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించడం, సంఘ్ పరివారం చాపకిందనీరులా క్షేత్రస్థాయికి వెళ్లడం వంటి అంశాలు కమలం పార్టీకి కలసివచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే, అగ్రనేతల రాకతోనే ఓట్లు వస్తాయనుకోవడం పోరపాటే అయినప్పటికీ.. జనంలో బీజేపీ క్రేజ్ పెరుగుతోందని భావించేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఆ ‘మౌత్‌టాక్’ విస్తరిస్తోంది కూడా. కాంగ్రెస్ కూడా సీరియస్‌గా రేసులో లేకపోవడం కూడా.. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అన్న భావన కలిగేందుకు అవకాశం ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధుల ఎంపిక లోపాలు లేకపోతే, ఈ ఊపు మరింత ఉధృతంగా ఉండేది.

బండి సంజయ్ దూకుడు-ప్రణాళిక పుణ్యాన..  జీరో నుంచి పైకి లేచిన కమల కెరటం, అవన్నీ ఫలించి ‘గులాబీ’ తోటలో వికసించకపోతే.. బీజేపీ హడావిడి తప్ప, ఫలితం లేని పార్టీ.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారానే,  తన ఉనికి కాపాడుకుంటుందన్న భావన మరింత బలపడి, అది విస్తృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే హైదరాబాద్‌లో బీజేపీ నేతలపై ‘పని తక్కువ-పబ్లిసిటీ ఎక్కువ’ అన్న ముద్ర ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన హైప్‌నకు తగిన ఫలితాలు రాబట్టకపోతే, ఇక బీజేపీ ప్రాధాన్యం పోయినట్టు భావించకతప్పదు. ఏదేమైనా.. ఇప్పటి నాలుగు స్థానాల నుంచి డజన్ల స్థాయికి ఎదిగినా, అది ఆ పార్టీ భవిష్యత్తు విజయానికి ‘గ్రేటర్’ ముఖద్వారం అయినట్లే లెక్క.

అటు తెరాస హవాలో కూడా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డికి ఈ ఎన్నికల ఫలితాలు అగ్నిపరీక్షనే. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలో, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేరు. కార్పొరేటర్లదీ అదే పరిస్థితి. ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక అంతా ఆయన సూచన ప్రకారమే జరిగింది కాబట్టి, జయాపజయాలకు ఆయనే బాధ్యత వహించవలసి ఉంటుంది. మెజారిటీ డివిజన్లు సాధించకపోతే.. గత ఎన్నికల్లో ఆయన గెలుపు ‘గాలి’వాటంగానే భావించే ప్రమాదం లేకపోలేదు. అభ్యర్ధుల ఎంపికలో ఆయన పొరపాటు చేశారన్న అసంతృప్తి, అగ్రనేతల ఒత్తిళ్లకు లొంగిపోయారన్న ఆగ్రహం తొలి నుంచీ పార్టీలో పనిచేస్తున్న నేతల్లో లేకపోలేదు. దానితో కీలకమైన నియోజకవర్గాలు, డివిజన్లలో వారు సహాయ నిరాకరణ చేయడం, ఆందోళన కలిగించే అంశమే. ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు సాధిస్తేనే, ఆయన పునాదులు బలపడతాయి.

ఇక అధికార టీఆర్‌ఎస్‌కు.. గ్రేటర్ ఎన్నికలు జీవన్మరణం కాకపోయినా, అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతే వచ్చే నష్టమేమీ లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు తప్ప, నగరంలో అంతా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే. మెరుగైన ఫలితాలు రాకపోతే, వారి పని అయిపోయిందని.. ప్రజల్లో వారిపై వ్యతిరేకత మొదలయిందన్న ప్రచారానికి తెరలేస్తుంది. అభ్యర్ధుల ఎంపిక లోపాలు, కొంతమంది ఎమ్మెల్యేల నాన్ సీరియస్ వ్యవహారం, సిట్టింగ్ కార్పొరేటర్లపై అవినీతి ఆరోపణలు… వీటికి మించి, ఇటీవలి వరద సాయంలో పదివేలు అందరికీ ఇవ్వలేదన్న ఆగ్రహం వంటి అంశాలు,  తెరాసకు మైనస్ పాయింట్లుగా పరిణమించాయి.

అయితే, అధికారంలో ఉండటమే ఆ పార్టీకి బలం కూడా! ఎందుకంటే టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున, పనులు త్వరగా అవుతాయని, ప్రతిపక్షం మేయర్ అయితే పనులు జరగవన్న భావన, సాధారణ ప్రజల్లో ఏర్పడితే… అది టీఆర్‌ఎస్‌కే లాభం. ఈసారి సెటిలర్లు తెరాస వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ, యువత మాత్రం బీజేపీ వైపు చూస్తుండటం కొంత ఆందోళన కలిగించే అంశమే.

ఎన్నికలంతా కేటీఆర్ కథానాయకుడిగానే జరిగినందున, సహజంగా జయాపజయాలకు ఆయనదే  బాధ్యత. అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సనత్‌నగర్, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న తీగుళ్ల పద్మారావుకు సైతం, ఈ ఎన్నికల ఫలితాలు సవాలే. వారి నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక వారి ఇష్టప్రకారమే జరిగింది కాబట్టి, వారిని గెలిపించుకునే బాధ్యత కూడా సహజంగా వారిపైనే ఉంటుంది. రెండు నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా ప్రతిపక్షాలు లేవు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కాలుపెడితే, అవి వారి రాజకీయ మనుగడ-ఉనికికే ప్రమాదం.

అటు మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికీ ఈ ఫలితాలు సవాలే. నగరంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం ప్రచారం చేశారు. అలాంటిది ఆయన తన పార్లమెంటుపరిథిలోని వార్డుల్లో, మెజారిటీ స్థానాలు గెలిపించుకోకపోతే.. సొంత ఇలాకాలో గెలవలేని నేతగా విమర్శలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయనొక్కరి గళమే గట్టిగా వినిపించింది.